iDreamPost
iDreamPost
సినిమాలో విషయం ఎంతున్నా అది ఉందనే విషయం జనం దాకా తీసుకెళ్లకపోతే వసూళ్లు ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో ఎంత పెద్ద స్టార్ అయినా ప్రమోషన్ ఎంత కీలకంగా మారుతోందో చూస్తూనే ఉన్నాం. ఈవెంట్లు కావొచ్చు లేదా వీడియో మెటీరియల్ కావొచ్చు లేదా సోషల్ మీడియాలో వివిధ మార్గాల్లో బజ్ తేవడం కావొచ్చు, మార్గం ఏదైనా ప్రేక్షకుడి దాకా సినిమా తీశామనే మెసేజ్ వెళ్లడం చాలా ముఖ్యం. లేదంటే ఎప్పుడో టీవీలోనో డిజిటల్ స్ట్రీమింగ్ లోనో వచ్చినప్పుడు అరె ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుడి వంతవుతుంది.
గత నెల 28న విడుదలైన దుల్కర్ సల్మాన్ కనులు కనులను దోచాయంటేకు మొదటి రోజు మంచి రిపోర్ట్స్ తో పాటు రివ్యూస్ దక్కాయి . కాని ఓపెనింగ్స్ మాత్రం చాలా డల్. చాలా చోట్ల కనీసం యాభై శాతం హాళ్ళు కూడా నిండలేదు. దానికి తోడు టైటిల్ చూసి ఇదేదో మలయాళం డబ్బింగ్ మూవీ అనుకున్న జనం కేరళ ప్రేమకథలను ఏం చూస్తాం లెమ్మని లైట్ తీసుకున్నారు. ఫలితంగా కనులు కనులను దోచాయంటే పికప్ కు కొంచెం టైం పట్టింది. భీష్మ తప్ప ఎంటర్ టైన్మెంట్ కు మరో ఆప్షన్ లేని తరుణంలో కనులు కనులను దోచాయంటేలో మెప్పించే అంశాలు చాలా ఉన్నాయి.
మౌత్ టాక్ స్లోగా స్ప్రెడ్ కావడంతో నిన్న వీకెండ్ లో 64 అదనపు స్క్రీన్లు జోడించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొన్న శుక్రవారం ఏకంగా ఆరు తెలుగు సినిమాలు విడుదలైనా దీనికి ఇన్నేసి షోలు తోడవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ చక్కని పబ్లిసిటీ చేసి ఉంటే దీని రీచ్ ఇంకా పెరిగి ఉండేది. దుల్కర్ సల్మాన్ తో పాటు హీరొయిన్ రీతూ వర్మ ఓ రెండు ఈవెంట్లలో పాల్గొన్నప్పటికీ అది సరిపోలేదు. ఏదైతేనేం మొత్తానికి స్లోగా అయినా స్పీడు అందుకున్న కెకెడికి దగ్గరలో మరో పెద్ద సినిమా ఏదీ లేదు కాబట్టి మరికొంత రాబట్టుకునే అవకాశం దక్కింది. దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా దేశింగ్ పెరియస్వామి రూపొందించిన కనులు కనులు దోచాయంటే ఫలితం చూసాకైనా ప్రమోషన్ ప్రాముఖ్యతను నిర్మాతలు త్వరగా తెలుసుకుంటే మొదటి రోజు థియేటర్లలో ఖాళీ సీట్లను చూసే బాధ తప్పుతుంది.