iDreamPost
android-app
ios-app

స్వర్గానికేగిన ఈశ్వర్ పోస్టర్

  • Published Sep 21, 2021 | 4:48 AM Updated Updated Sep 21, 2021 | 4:48 AM
స్వర్గానికేగిన ఈశ్వర్ పోస్టర్

తెలుగు సినిమా చరిత్ర పోస్టర్ డిజైనింగ్ లో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టి కేవలం పేపర్ మీద బొమ్మ చూసే ప్రేక్షకులకు సినిమా చూడాలన్న బలమైన కాంక్షను రేపేలా చేసిన ఈశ్వర్ ఇక లేరు. ఇవాళ ఉదయం చెన్నైలో తన స్వగృహంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈశ్వర్ టాలీవుడ్ కు చేసిన సేవలు ఎనలేనివి. దశాబ్దాల తరబడి అత్యధిక శాతం సినిమాలకు ఈశ్వర్ పేరు ఒక సంతకంలా మారింది. అగ్ర హీరోలు ఏరికోరి మరీ తమ దర్శకులు నిర్మాతలకు రికమండ్ చేసి ఆయనతో పని చేయించుకునేవారు. ఒకదశలో రోజులో ఇరవై నాలుగు గంటలు సరిపోవనే స్థాయిలో బిజీగా ఉండేవారు.

ఈశ్వర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. చిన్నప్పటి నుంచే చిత్రలేఖనం మీద విపరీతమైన ఆసక్తితో చదువును మధ్యలోనే ఆపేసి మదరాసు వెళ్లిపోయారు. గురువు ఆర్టిస్ట్ కేతా. ఈయన దగ్గర సినిమా పోస్టర్ల డిజైనింగ్ లో మెళకువలు నేర్చుకుని అప్పటి ట్రెండ్ కు అనుగుణంగా కొత్తగా ఏం చేయాలో అలోచించి అమలు చేశారు. మొదటి సినిమా 1967లో బాపు తీసిన సాక్షి. మొదట్లో ఈశ్వర్ నాటకాలు వేసేవారు. అల్లు రామలింగయ్య వేసిన ఆడది నాటకం చూసి స్ఫూర్తి చెంది ఇండస్ట్రీకి రావాలన్న సంకల్పాన్ని పెట్టేసుకున్నారు. ఈశ్వర్ పని చేసిన చివరి చిత్రం 2000వ సంవత్సరంలో వచ్చిన కోడి రామకృష్ణ దేవుళ్ళు.2600కి పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల సినిమాలకు ఈశ్వర్ గారు పనిచేయడం ఎప్పటికీ చెరిగిపోని రికార్డు.

ఆ తర్వాత రిటైర్ అయిపోయి విరామం తీసుకున్నారు. సినిమా పోస్టర్ పేరుతో ఈయన రాసిన బయోగ్రఫీ ఉత్తమ గ్రంధాల్లో ఒకటిగా ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది. బాల్యంలో పాలకొల్లులో రత్నం థియేటర్ కు పదే పదే పోస్టర్లు చూసేందుకు వెళ్లిన ఈశ్వర్ వాటిని డిజైన్ చేయడంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారని ఎవరూ ఊహించనిది. పాప కోసం, రామ్ ఔర్ శ్యామ్, ప్రేమ నగర్, మనుషులు మారాలి, బొబ్బిలి బ్రహ్మన్న, సింహాసనం, అడవిరాముడు, ప్రేమాభిషేకం,మోసగాళ్లకు మోసగాడు, బొబ్బిలిరాజా, ధర్మదాత, ఆదిత్య 369 ఇలా వందల సినిమాలకు అద్భుతమైన డిజైన్లతో అలరించిన ఈశ్వర్ లేని లోటు పరిశ్రమకు ఎన్నటికీ తీరనిది

Also Read : టాలీవుడ్ పెద్దల చర్చలు – ఫలితమేంటో