iDreamPost
android-app
ios-app

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అస్తమయం

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అస్తమయం

తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ కన్ను మూశారు. ఈ రోజు అంటే 28-01-2022 తెల్లవారుజామున హైదరాబాద్ లో ఆయన గుండె పోటుతో మరణించారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితం అయ్యారు.

ఎండ్లూరి సుధాకర్‌ భార్య డా.పుట్ల హేమలత కూడా కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూశారు. సుధాకర్ కి ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో పెద్ద కుమార్తె ప్రముఖ యువ కథారచయిత్రి మానస, మరో కుమార్తె మనోఙ్ఞ.ఎండ్లూరి మానస కథా రచయిత్రి, ఆమె రాసిన కథా సంపుటి “మిళింద” కు 2020 సంవత్సరపు కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది.

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959న నిజామాబాద్ లోని పాముల బస్తిలో జన్మించారు.తెలుగు టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్యపీఠంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులకు పరిశోధనా గైడ్ గా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు,తెలుగు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగా ఆయన అనేక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తొలివెన్నెల మొదలైన రచనలతో తెలుగు సాహితీరంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన శ్రీమతి దివంగత హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు కాగా, కుమార్తె మానస కూడా రచయిత్రిగా రాణిస్తున్నారు. సుధాకర్ శ్రీమతి హేమలత 2019లో మరణించిన నాటి నుండి సుధాకర్ తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. ఆయన రచనలకు గాను అనేక అవార్డులు ఆయనను వరించాయి. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.