iDreamPost
android-app
ios-app

త్రిశంకు స్వర్గంలో టాలీవుడ్ థియేటర్

  • Published Jul 26, 2022 | 12:17 PM Updated Updated Jul 26, 2022 | 12:17 PM
త్రిశంకు స్వర్గంలో టాలీవుడ్ థియేటర్

ఎన్నడూ లేని విపరీత స్తబ్దత టాలీవుడ్ ని కుదిపేస్తోంది. పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా థియేటర్ వ్యవస్థ అగ్నిగోళంలా మండుతోంది. సినిమాలకు జనం రావడం లేదు. హాళ్లు సగం నిండితే గొప్పనేలా ఉంది. వర్షాలు, రివ్యూల సంగతి పక్కనపెడితే కనీసం మొదటి రోజు హౌస్ ఫుల్ చేయలేనంత స్థితికి చిరంజీవి, నాగ చైతన్య లాంటి ఇమేజ్ ఉన్న హీరోలు దిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆచార్య, థాంక్ యు ఫలితాలు తీవ్ర హెచ్చరికలు జరీ చేస్తున్నాయి. నైజామ్ టికెట్ రేట్ల వ్యవహారం పట్ల ప్రేక్షకులు సానుకూలంగా స్పందించే సూచనలు కనిపించడం లేదు. మల్టీప్లెక్సుల్లో మీడియం బడ్జెట్ సినిమాలకు 195 గరిష్ట ధరని లాక్ చేయడం పరిస్థితిని సీరియస్ గా మారుస్తోంది.

ఈ కారణంగానే రామారావు ఆన్ డ్యూటీకి సైతం అడ్వాన్స్ బుకింగ్స్ సోసోగా ఉన్నాయి. కౌంటర్లో నేరుగా కొనేవాళ్ళు ఉంటారు కానీ అది కూడా మార్నింగ్ అయ్యాక ఎలా ఉందనే రిపోర్ట్ బయటికి వచ్చాకే పెరుగుతుంది. అలా కాకుండా ఎలా ఉన్న ఓసారి చూద్దామనుకునే ఫ్యాన్స్ ఇలాంటి రేట్ల వల్ల రిపీట్ వెళ్లకుండా దూరవమవుతుండటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. దానికి తోడు కంటెంట్ విషయంలో హీరోలు దర్శకులు చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి భారీ మూల్యం చెల్లించేసేలా చేస్తోంది. చూసినా కథలే మళ్ళీ మళ్ళీ తీయొద్దని ఎంత మొత్తుకున్నా వినకపోవడం వల్లే థాంక్ యుకి కనీసం యూత్ ఆడియన్స్ ఆదరణ కూడా దక్కడం లేదు.

నిర్మాతల మండలి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేస్తాయా అంటే డౌటే. ముఖ్యంగా ఆరు కోట్ల బడ్జెట్ దాటిన వాటిని పది వారాల తర్వాతే ఓటిటికి ఇవ్వాలన్న కండీషన్ వల్ల పబ్లిక్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎటొచ్చి ఓటిటి సంస్థలు రేట్లు తగ్గించడం వల్లే నిర్మాతే నష్టపోతాడు. హిట్టు ఫ్లాపుని బట్టి ఇందులో సడలింపు ఉండాలే తప్ప గాడిద గుర్రం రెండింటికి ఒకటే ట్రీట్మెంట్ ఇస్తే ఫలితాలు తలకిందులవుతాయి. కరోనా లాక్ డౌన్ ల వల్ల ఈ మార్పులు రావడం నిజమే కానీ థియేట్రికల్ రెవిన్యూ పెంచుకునే దిశగా మరింత లోతైన చర్చ జరగాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే ఇప్పటి చర్యలు అద్భుతాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు