iDreamPost
iDreamPost
కొద్దిరోజుల క్రితం టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ విషయంలో ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన రచ్చ ప్లస్ విమర్శలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని కదిలించాయి. ముఖ్యంగా ఆ సినిమా హీరో నాని, నిర్మాతలు ఏదో చేయరాని తప్పు చేసినట్టుగా కొందరి కామెంట్లు హద్దు మీరడం సోషల్ మీడియాతో పాటు ఇతర ఛానల్స్ లో కూడా బాగా హై లైట్ అయ్యింది. నానిని అంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటనే కౌంటర్స్ గట్టిగా వచ్చాయి. కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సినిమా నిర్మించిన వాళ్లకు దాన్ని ఎలా విడుదల చేసుకోవాలనే విషయంలో పూర్తి హక్కులు ఉంటాయని అలాంటప్పుడు ఇంత రాద్ధాంతం అనవసరమనే బదులు ఎక్కువ వినిపించింది.
ఈ నేపథ్యంలో ఇందాక యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ATFPF) ఒక నోట్ ని విడుదల చేసింది. అందులో ప్రధానంగా కనిపించిన పాయింట్లు ఇవి. ఏ సినిమాకైనా దాన్ని మొదలుపెట్టాల్సింది నిర్మాత. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇందులో భాగం వహిస్తారు. ఈ వ్యవస్థలో ఎగ్జిబిటర్లు తదితరులు కీలక భాగస్వాములు . శాటిలైట్, డిజిటిల్ తదితరాలు వచ్చిన తర్వాత తన పెట్టుబడిని వెనక్కు తెచ్చుకోవడానికి ప్రొడ్యూసర్ కు ఆప్షన్లు పెరిగాయి. తన సినిమాను ఏం చేసుకోవాలనే దాని మీద అతనికే మొదటి అధికారం ఉంటుంది. అంతే తప్ప ఇలా పబ్లిక్ గా ఆ వ్యక్తి ఇలా చేయాలి చేయకూడదు అని ఎవరు శాశించలేరు.
కరోనా వల్ల అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాయి. దాని పట్ల ప్రతిఒక్కరికి సానుభూతి ఉంది. పెద్ద సినిమాలకు డిమాండ్ ఉన్న వాటికి మాత్రమే సహకరించే ఎగ్జిబిటర్లు చిన్న సినిమాలు నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు న్యాయం. ఈ కారణంగా తమ చిత్రాలు వెలుగు చూడక నష్టపోయిన నిర్మాతలు ఎందరో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా. మనమందరం కలిసి కట్టుగా ఎదురుకోవాల్సిన సమస్యని ఇలా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేయడం బాధాకరం. ఇది నిర్మాతల సమాఖ్య కాస్త ఘాటుగా కాస్త సుతిమెత్తిగా పంపిణీదారులుకు ఇచ్చిన కౌంటర్. మరి అవతల వైపు నుంచి సమాధానం వస్తుందో లేక ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి
Also Read : వాహనం నిలిపితే ప్రాణానికే ముప్పు