iDreamPost
iDreamPost
ప్రముఖ నిర్మాత, గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు పిఆర్ గా చేసిన మహేష్ కోనేరు కన్ను మూశారు. ఇవాళ కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన మహేష్ కోలుకోలేక చివరి శ్వాస తీసుకున్నారు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా థియేటర్లలో తన సినిమా తిమ్మరుసు రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ గా మహేష్ పలువురు పెద్దల నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉండే మహేష్ కోనేరుకి సౌమ్యుడని పేరు. తారక్ కు ఎంతో సన్నిహితంగా మెలిగే మహేష్ గత కొన్నేళ్లుగా ప్రొడక్షన్ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ తో 118 నిర్మించడానికి ఒకరకంగా ఇదే కారణమని చెప్పొచ్చు.
ఇండస్ట్రీలో అందరితోనూ మహేష్ కోనేరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఊహించని ఈ షాకింగ్ న్యూస్ పట్ల పరిశ్రమలోని నటీనటులు సాంకేతిక నిపుణులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్ డబ్బింగ్ సినిమాలు విజిల్, మాస్టర్ కు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. కీర్తి సురేష్ తో మిస్ ఇండియా లాంటి భారీ ప్రాజెక్ట్ ను టేకప్ చేసిన అనుభవం మహేష్ కోనేరుకి ఉంది. బడ్జెట్ ఎక్కువ కావడంతో నెట్ ఫ్లిక్స్ కి డైరెక్ట్ ఓటిటి ప్రీమియర్ కు ఇచ్చేశారు. అల్లరి నరేష్ సభకు నమస్కారం, నాగ శౌర్య పోలీస్ వారి హెచ్చరిక ప్రస్తుతం మహేష్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు. ఇవి కాకుండా సందీప్ కిషన్, కళ్యాణ్ రామ్ లతో వేర్వేరుగా మరో రెండు సినిమాలు కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
వైజాగ్ లో మహేష్ కోనేరు కన్నుమూసినట్టుగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియరాలేదు. షూటింగ్ కోసం వెళ్ళారా లేక ఆరోగ్య చికిత్స కోసం ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్న మహేష్ కోనేరు కింది స్థాయి నుంచి ఇక్కడి దాకా చేరుకున్నారు. గతంలో తారక్ పిఆర్ గా ఉన్నప్పుడు సైతం మూవీ లవర్స్ కోసం రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తూ ట్విట్టర్ తొలిదశలో చాలా చురుకైన పాత్ర పోషించారు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలతో కలిసి నిర్మాణం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారట. ఈలోగా ఇలా అందరిని శోకంలో ముంచెత్తుతూ మహేష్ కోనేరు కాలం చేయడం ఎవరూ తీర్చలేని లోటు
Also Read : భలే మాయ చేసిన శ్రియ.. పాప పుడితే ఏడాది దాచేసింది!