iDreamPost
iDreamPost
ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఉంది పత్రికారంగం దుస్థితి. కరోనా కల్లోలంతో అతలాకుతలం అయిన న్యూస్ పేపర్ ఇండస్ట్రీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భారీగా పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలు పత్రికారంగం మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
తగ్గుతున్న పాఠకాదరణ…
ఏ వ్యాపారంలోనైనా అమ్మకాలు పెరిగే కొద్దీ లాభాలు పెరుగుతాయి. బహుశా ఒక్క పత్రికా రంగంలోనే అమ్మకాలు విపరీతంగా పెరిగితే ఆ స్థాయిలో నష్టం పెరుగుతుంది. ఇందుకు కారణం దాని ఉత్పత్తి వ్యయానికి, అమ్మకం ధరకు పొంతన లేకపోవడమే. ఒక పేపరు తయారు కావడానికి అయ్యే ఖర్చులో నాలుగోవంతు కూడా దాని ధర ఉండదు. మిగిలిన సొమ్మును ప్రకటనల రూపంలో సమకూర్చుకుని పత్రికలు మనుగడ సాగిస్తాయి. వచ్చే ప్రకటనల ఆదాయానికి అనుగుణంగా సర్క్యులేషను ను ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ప్రకటనలు తగ్గి సర్క్యులేషను పెరుగుతూ పోతే నష్టమూ పెరుగుతుంది. అయితే తగినంత సర్క్యులేషను లేకుంటే ప్రకటనలు రావు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇన్నాళ్లు పత్రికలు నడిచాయి. కానీ ఆ రంగంలో వచ్చిన పెఢ ధోరణి వాటి ఉనికికే ముప్పు తెచ్చింది. ప్రకటనల కోసం ప్రభుత్వాలకు అనుకూల వైఖరి తీసుకోవడం మొదలైన తరువాత క్రమంగా జనంలో విశ్వసనీయత కోల్పోయాయి.
ఒక్కో పత్రిక.. ఒక్కో పార్టీ పక్షాన పనిచేస్తోందని అర్థం కావడంతో ఆయా పార్టీల అభిమానులే దానికి పాఠకులు అవుతున్నారు. నిష్పాక్షికత లోపించడంతో పాఠకాదరణ తగ్గిపోతోంది.
కుదిపేసిన కరోనా..
కరోనా విజృంభణతో అన్ని రంగాల్లో చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో పత్రికల సర్క్యులేషన్ తగ్గింది. ప్రకటనల ఆదాయం దాదాపు శూన్యమైంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం స్వల్ప వ్యవధిలో న్యూస్‌ప్రింట్ ధర నాలుగురెట్లు పెరిగే స్థాయిలో దిగుమతి సుంకాలను పెంచేసింది. ఇది దేశవ్యాప్తంగా పత్రికల నిర్వహణను దెబ్బతీసింది. తెలుగులో ఆంధ్రభూమి మూతపడింది. ఇక చిన్న పత్రికల సంగతి చెప్పనక్కర్లేదు. అడపాదడపా సంచికలను బయటకు తెస్తున్నాయి. పెద్ద పత్రికలు జిల్లా అనుబంధాలకు స్వస్తి చెప్పాయి. పేజీల సంఖ్య తగ్గించాయి. సిబ్బందిని కుదించాయి. జీతాల్లో కోత పెట్టాయి. 24/7 న్యూస్ చానల్స్, వెబ్సైటుల వైపు పాఠకులు మళ్లుతుండడం కూడా సర్క్యులేషన్ లపై ప్రభావం చూపింది.
భారీగా పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలు..
కరోనా ప్రభావం తగ్గి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయనుకొనే దశలో న్యూస్ ప్రింట్ ధరలు 35 శాతం పైబడి పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా రష్యా నుంచి న్యూస్ ప్రింట్ దిగుమతులు ఆగాయి. దీనికితోడు పెరిగిన వ్యయాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ ప్రింట్ ఉత్పత్తి తగ్గింది. దీంతో పెద్ద పత్రికల మెషీన్ల కు అనుగుణంగా ఉండే నాణ్యమైన న్యూస్ ప్రింట్ కు కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే పేజీల సంఖ్య తగ్గించారు. ఇంకా తగ్గిస్తే సర్క్యులేషను, ప్రకటనల ఆదాయం తగ్గుతుంది. పెరిగిన ధరలను పాఠకులకు బదలాయించినా సర్క్యులేషను పై ప్రభావం చూపుతుంది. దీంతో పత్రికల నిర్వహణకు యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. మరోపక్క ఇప్పటికే అంతంతమాత్రమైన జీతాలతో పనిచేస్తున్న తమపై ఈ కల్లోలం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని పత్రికల్లో పనిచేసే సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.