iDreamPost
iDreamPost
ప్రధానమంత్రి మోడీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నాడు బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పిన పీఎం ఇప్పుడు ఇంట్లో దీపాలు ఆర్పి, బయట దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ నాటినుంచి ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ ప్రధాని మాటలను ఆచరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం మాటలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. మహమ్మారిని మట్టుపెట్టేందుకు సంపూర్ణంగా సహకరిస్తున్నాయని మోడీ కూడా ప్రశంసలు కురిపించారు. దాంతో ప్రధాని నుంచి తమకు ఏదో ప్రతిఫలం దక్కుతుందని ఆశించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కు కేంద్రం నుంచి కనికరం లేకపోతే గట్టెక్కడమే గగనంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏకంగా ఆరుగురు ముఖ్యమంత్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వేతనాలు కూడా పూర్తిగా చెల్లించలేకపోయామని కొందరు ప్రస్తావించారు. ఇప్పటికే ఉన్న ఆర్థిక మాంధ్యపు ఛాయలతో అంతంతమాత్రపు ఆదాయంతో రాష్ట్రాలు నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత ఓ వైపు వ్యయం పెరిగింది. రెండోవైపు ఆదాయం స్తంభించింది. ఈ పరిణామాలతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతోంది. కానీ మోడీ మాత్రం చేయూతనివ్వడంలో తగిన చొరవ చూపుతున్నట్టు కనిపించడం లేదు. విపత్తు సహాయ నిధుల నుండి రూ.11 వేల కోట్లను వ్యక్తిగత రక్షణ సామగ్రి (ప్రొటెక్టివ్ గేర్) నిమిత్తం ఇస్తామని గతంలో ప్రకటించిన రూ.15 వేల కోట్లను విడుదల చేస్తామని మాత్రం ఆయన ఇంతవరకూ చెబుతూ వస్తున్నారు.
కరోనా బాధితులకు వైద్య సేవలందించడం వలస జీవుల ఆలనా పాలనా చూడడంతో పాటుగా కరోనా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజలకు చేదోడుగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై పడింది. దాంతో అది మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారయ్యింది. అయినప్పటికీ ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంతోబాటు నిత్యావసర సరకులు అందించడం, పరిశుభ్రతకు సంబంధించిన చర్యలు చేపట్టడం వంటివి రాష్ట్రమంతటా ఏకకాలంలో చేపట్టాల్సిన వచ్చినప్పటికీ ఏదో రకంగా నెట్టుకొస్తున్నాయి. అయినా కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధపడడం లేదు. ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులు, పిఎం కళ్యాణ్ యోజన నుండి జన్‌ధన్ ఖాతాలకు బదిలీ వంటివన్నీ చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమూలకు సరిపోవు.
ఇప్పటికయినా మోడీ ఈ విషయంలో పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే ఇంతటి విపత్తు రావడంతో అంతా విలవిల్లాడుతున్నారు. అది గమనంలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో రాష్ట్రాలకు తగిన వాటా ఇవ్వాలి. లేదంటే రాష్ట్రాలలో ప్రభుత్వాల నిర్వహణ పెనుభారంగా మారే ముప్పు ఉంటుంది. బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయాలపై దృష్టి పెట్టి ఆయా రాష్ట్రాలకు తగిన నిధులు సాధించడంపై శ్రద్ధ వహించడం అత్యవసరం.