iDreamPost
android-app
ios-app

తదుపరి సీజేఐ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు

తదుపరి సీజేఐ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు

సుప్రిం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామకం ప్రక్రియ పూర్తయింది. సుప్రిం 48వ చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ ఎన్‌వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 24వ తేదీన ప్రస్తుత సీజేఐ ఎస్‌ఎ బాబ్డే.. రమణను సిఫార్సు చేయడంతో మొదలైన ప్రక్రియ తాజాగా ముగిసింది. ఈ నెల 23వ తేదీన ఎస్‌ఏ బాబ్డే పదవీ విరమణ చేయబోతున్నారు. 24వ తేదీన చీఫ్‌ జస్టిస్‌గా ఎన్‌వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు.

సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియం వ్యవస్థ న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది. చీఫ్‌ జస్టిస్‌గా సుప్రిం కోర్టులో సినియర్‌ న్యాయమూర్తిని నియమించడం ఆనవాయితీ. సినియారిటీ ప్రకారం ఎన్‌వీ రమణ ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్‌వీ రమణన తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలంటూ ఎస్‌ఏ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. సీజేఐ సిఫార్సులను న్యాయశాఖ కేంద్ర హోం శాఖకు పంపింది. అక్కడ నుంచి ప్రతిపాదనలు రాష్ట్రపతికి చేరాయి. తదుపరి సీజేఐ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

Also Read : ఆ జడ్జిల పాత్ర మీద నేరుగా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ

తదుపరి సీజేఐగా నియమితులైన జస్టిస్‌ ఎన్‌వీ రమణది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామం. 1957 ఆగస్టు 27న ఎన్‌వీ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరిలో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 2000 జూన్‌27వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పని చేశారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రిం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా చీఫ్‌ జస్టిస్‌గా ఎంపికయ్యారు.

ఈ నెల 24వ తేదీన సుప్రిం 48వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న ఎన్‌వీ రమణ ఆ పదవిలో 16 నెలలు కొనసాగనున్నారు. 2022 ఆగస్టు 26వ తేదీ వరకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించనున్నారు.

Also Read : జస్టిస్ ఎన్ వీ రమణ నేపథ్యం ఏంటి?