టేకిటీజీగా హార్ట్స్ గెలిచిన ‘ప్రేమికుడు’ – Nostalgia

(అప్పట్లో యువతను ప్రేమలో సంగీతంలో ముంచెత్తిన శంకర్ మాయాజాలం ప్రేమికుడు సినిమా గురించి అప్పట్లో 8 తరగతి చదువుతున్న ఓ కుర్రాడి అంతరంగం ఇప్పటి మాటల్లో)

మరహబా ఆ ఆ ఆ …….

టిన్టి…….డిడి…..టిటిటిన్టిటిన్డి….డిడిటి………

రోజూ తెల్లవారగానే సంప్రదాయ తెలుగిళ్ళలో వెంకటేశ్వర సుప్రభాతం వినిపించే తరహాలో అప్పట్లో ఈ సినిమాలో టేకిటీజీ పాలసి పాట ట్యూన్ తో సహా 8వ తరగతిలో ఉన్న నాలాంటి స్కూల్ పిల్లల మీద రెహమాన్ వేసిన మేజిక్ మంత్రం చాలా ఏళ్ళ పాటు వెంటాడుతూనే వచ్చింది…..

అందులో అర్థం పూర్తిగా తెలిసేది కాదు కాని పాటలో పదాలు పెదాలపై నాట్యం చేస్తూనే ఉండేవి.ఇలా కూడా తెలుగు పాటలు ఉంటాయా, వాటిని ఆస్వాదిస్తే ఆ అనుభూతిని చెవులు రిక్కించి వినడం అంటారని తర్వాత తెలిసింది….

అప్పటికే శంకర్ సత్తా జెంటిల్ మెన్ లో చూసి ఉండటంతో ఇది అంతకు మించి ఉందనే టాక్ నాలాంటి స్కూల్ పిల్లల్నీ కుదురుగా ఉండనివ్వలేదు. ఒక్కణ్ణే వెళ్లే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని రోజులు కాబట్టి ఎవరు తీసుకెళ్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను…

ప్రేమికుడు

1994 సెప్టెంబర్

అప్పటిదాకా కొరియోగ్రాఫర్ గా ఉన్న ఓ బక్కపలచని యువకుడు హీరో….

ఘరానా మొగుడు లాంటి మాస్ మసాలా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో స్టార్ స్టేటస్ లో ఉన్న హీరోయిన్….

రోజా జెంటిల్ మెన్ లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ తో అప్పటికే యూత్ కి హార్ట్ త్రోబ్ లా మారిన రెహమాన్ సంగీతం….

సౌత్ సినిమా స్థాయిని బాలీవుడ్ నిర్మాతలు సైతం ఈర్ష్యతో రగిలిపోయేలా ఎత్తుకు తీసుకెళ్లిన కుంజుమోన్ నిర్మాణం….

అన్నింటినీ మించి భారీతనంకి కొత్త అర్థాన్ని డిక్షనరీలో రాసిన శంకర్ అనే బ్రాండ్…

ఇంతకన్నా ఏం కావాలి

డేట్ గుర్తులేదు కాని మా ఊరి ద్వారకా థియేటర్. ఏదో పనిమీద వచ్చిన పెదనాన్న కొడుకు నా ఆత్రం చూడలేక సాయంత్రం ఫస్ట్ షోకి సైకిల్ మీద తీసుకెళ్లాడు. దారిపొడవునా ప్రేమికుడు పోస్టర్లు కనిపిస్తే చాలు ఇంకాసేపట్లో చూడబోతున్నానన్న ఆనందం. అది ఇంకొద్ది నిమిషాల్లో ఆవిరి కాబోతోందని ఊహించే వయసు కాదది. సినిమా హాల్ దగ్గర తొక్కిడి మాములుగా లేదు. ఎవడో గోల్డ్ బిస్కెట్లు ఫ్రీగా పంచుతున్నారనే రేంజ్ లో వయసుతో సంబంధం లేకుండా టికెట్ కౌంటర్ల దగ్గర కొట్టుకుంటున్నారు. చొక్కా తడిడిపోయే రేంజ్ లో అన్నయ్య విశ్వప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. బ్లాక్ లో కొందామన్నా అమ్మేవాడేడి. అప్పటిదాకా చిరు బాలయ్య సినిమాలకే జాతర ఉంటుందన్న నా నమ్మకాన్ని బ్రేక్ చేశాడు శంకర్. ఇంటికి తీసుకెళ్తే బాధపడతానని అన్నయ్య నన్ను బలవంతంగా ఒప్పించి ఎర్రసైన్యం తీసుకెళ్లడం ఇప్పటికీ గుర్తే. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం.

తర్వాత ఓ రెండు వారాలయ్యాక కానీ వెళ్లే అవకాశం దొరకలేదు. ఈసారి నా పోరు పడలేక నాన్నే తీసుకెళ్లాడు. ఓ గంట ముందు వెళ్ళాం కాబట్టి టికెట్లు దొరికాయి కానీ లేదంటే కథ మళ్ళీ మొదటికే వచ్చేది.రఘువరన్ బిల్డింగ్ లో బాంబ్ పెట్టడంతో మొదలవడం దగ్గరి నుంచి రెప్ప వేస్తే ఏం మిస్ అవుతానో అన్న టెన్షన్ అలా గుడ్లప్పగించేలా చేసింది. హీరో మెటీరియల్ అంటే నమ్మడం కష్టమనిపించే ప్రభుదేవా, అతను పక్కనుంటే మనం కొంత దూరంగా వెళ్లిపోదామా అనిపించే వడివేలు రూపం ఏదీ మైనస్ గా కనిపించడం లేదు. నగ్మా కంటే ఫస్ట్ హాఫ్ లో ఈ ఇద్దరి మీదే నాలాంటి కుర్రాళ్ళ దృష్టి ఎందుకు ఉందంటే కారణం ఒకటే. నాలా చాలా యావరేజ్ గా అనిపించే అబ్బాయిల ఐడెంటిటీ కాంప్లెక్స్ ని శంకర్ ఆ పాత్రల ద్వారా పోగొట్టాడు కాబట్టి

ఓ మాములు కానిస్టేబుల్ కొడుకు ఏకంగా రాష్ట్ర గవర్నర్ కూతురిని ప్రేమించడం అనే పాయింటే ఊహకందనిది. దానికి బాంబ్ బ్లాస్ట్ చేసే విలన్ కి ముడిపెట్టడం, ఇద్దరు ప్రేమికులు పారిపోయే ఎపిసోడ్ ని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేంజ్ లో అంత ఖర్చుతో తీయడం కేవలం శంకర్ కే చెల్లింది. నిజానికి సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ అనిపించిన ప్రతిసారి రెహమాన్ సంగీతంతో ప్రాణం పోశాడు. జీవా ఛాయాగ్రహణం జీవం పోసింది. ముక్కాలా ముక్కాబులా పాటకు థియేటర్ పైకప్పు ఎగిరిపోతుందేమో అన్న రేంజ్ లో ఈలలు గోలలు. డెబ్యూతోనే (స్టార్ వారసుడు అనే ట్యాగ్ లేకుండా) ఈ స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న హీరో ప్రభుదేవా ఒక్కడే. అప్పటికప్పుడు అభిమాన సంఘాలు పుట్టుకురావడం అంటే మాటలా

అలా ప్రేమికుడు చాలా రోజులు యూత్ ను వెంటాడుతూనే వచ్చింది….

ఎందరో కుర్రాళ్లను డాన్స్ నేర్చుకునేలా ప్రేరేపించి వాళ్ళకో కొత్త కెరీర్ ని ఇచ్చింది….

డాన్స్ ఇన్స్టిట్యూట్ల ముందు స్కూల్ వయసు పిల్లల్ని క్యు కట్టేలా చేసింది….

టీ కొట్లతో మొదలుకుని ఇంట్లో రేడియో సెట్ల దాకా క్యాసెట్లు అరిగిపోయేలా మ్రోగిపోయింది….

ఒకటా రెండా ప్రేమికుడు గురించి ఎంత చెప్పినా తక్కువే …. అందుకే నాకది ఎంత పాతబడినా మక్కువే ……

Show comments