iDreamPost
android-app
ios-app

విద్యకు పెద్ద పీట.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

విద్యకు పెద్ద పీట.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

విద్యా వ్యవస్థ లో సంస్క‌ర‌ణ‌లు ప్రవేశపెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైసిపి సర్కార్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రైమ‌రీ స్కూల్స్ లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి ప్రీ స్కూల్స్‌‌ను ప్రారంభించాలని చెయ్యాల‌ని విద్యాశాఖ స‌మాలోచ‌న‌లు చేస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్‌ కింద 3,400 పాఠ‌శాల‌ల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్‌కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా దృష్టి పెట్టారు. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్స్‌లో అడ్మిషన్లు ఇస్తారు.

ఈ ప్రీ స్కూల్స్‌లో సంవ‌త్స‌రం పాటు చదవడం, రాయడం వంటివి ప్రాక్టీస్ చేయిస్తారు. అలాగే పిల్ల‌ల్లో ఉన్న స్పెష‌ల్ టాలెంట్స్ వెలికితీయం, గణితం స‌బ్జెక్ట్స్ పై వారిలోని మేధస్సును వెలికితీస్తారు. ఆ తర్వాత విద్యార్థులు ఫ‌స్ట్ క్లాస్ లో చేరతారు. ఈ ప్రీ స్కూల్స్‌లో టీచర్లను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో తీసుకుంటారు. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిష‌న్లు పెరగడంతో పాటూ విద్యార్థులు నాణ్యమైన విద్య అందుతుంద‌ని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడత‌గా‌ గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుమ‌తి ఇస్తే అన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసేందుకు విద్య శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ సర్కార్‌ విద్యా వ్యవస్థలో కేజీ నుంచి పీజీ వరకూ అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో భోదన చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా పేదరికం వల్ల విద్యార్థులు విద్యకు దూరం కాకుడదనే లక్ష్యంతో ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫార్మ్స్, షూ, బెల్ట్, పుస్తకాలు, బ్యాగు తదితర వస్తువులు ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇంటర్‌ తర్వాత అన్ని ఉన్నత కోర్సులకు పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోంది. అంతేకాకుండా హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి ఏడాదికి 20 వేల రూపాయలు ఇస్తోంది. ఇక నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పూర్థి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. విద్య వల్లనే పేదరికం దూరం అవుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకోసమే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు.