iDreamPost
iDreamPost
ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రానురాను పతనావస్థలో కనిపిస్తోంది. అధినేత వ్యవహారశైలి ప్రజలను మరింత దూరం చేస్తోంది. దాంతో ఏం చేయాలో పాలుపోని టీడీపీ నేతలు చాలామంది మౌనంగా ఉంటున్నారు. అదే సమయంలో సొంత నియోజకవర్గాల్లో పెత్తనం కోల్పోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఆక్రమంలోనే అనేక చోట్ల వర్గపోరుకి ఆస్కారం ఏర్పడుతోంది. ఆధిపత్యం కోసం ప్రయత్నాలతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు మరింత కోల్పోయే దిశలో కనిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అలానే తయారయ్యింది. వాస్తవానికి సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గం టీడీపీని ఆధరించింది. అందులోనూ టీడీపీ ఏపీ అద్యక్షుడిగా వ్యవహరించిన కిమిడి కళా వెంకట్రావు సొంత మండలం రేగిడి ఈ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఈపార్టీకిది ప్రతిష్టాత్మకమైనది. కానీ 2014 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరడంతో కథ మారింది. అప్పటి వరకూ ఈ నియోజకవర్గ నాయకురాలిగా చక్రం తిప్పిన కావలి ప్రతిభా భారతికి సమస్యలు వచ్చాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసి, చంద్రబాబుకి సన్నిహితురాలిగా మెలిగిన ప్రతిభాభారతికి అవకాశం లేకుండా చేసింది. 2014లో ఆమె ఓటమి తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆమెకు అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో కోండ్రుకి టికెట్ ఇచ్చినా టీడీపీ గెలవలేకపోయింది.వరుసగా రెండు ఎన్నికల్లోనూ రాజాం సీటుని వైఎస్సార్సీపీ గెలుస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడు ఇరు వర్గాలు పోటీపడుతున్నాయి. ఈసారి తమకే అవకాశం కావాలని ప్రతిభా భారతి పట్టుబడుతోంది. ఇటీవల ఆమె కుమార్తె గ్రీష్మా ప్రసాద్ కొంత క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. వివిద మీడియా చర్చల్లోనూ, టీడీపీ వ్యవహారాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. నారా లోకేష్ క్యాంపుకి దగ్గరగా ఉంటున్నారు. దాంతో కళా వెంకట్రావు ఆశీస్సులతో సంబంధం లేకుండా నారా లోకేష్ అండదండలతో ఈసారి ప్రతిభా భారతి తన వారసురాలికి టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే కోండ్రు మురళీ మోహన్ కూడా తన పట్టు చేజారకుండా ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తన హవాని కొనసాగించాలని ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ పరాజయం పాలయ్యింది. దాంతో కోండ్రుకి అది పెద్ద అడ్డంకి అవుతోంది.
రాజాం రూరల్, అర్బన్ మండలాల్లో ప్రతిభా భారతి వర్గానిదే పై చేయి. రేగిడి మండలం కిమిడి కుటుంబం పట్టుఉండడం మూలంగా ప్రతిభా భారతికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక సంతకవిటి తో పాటుగా సొంత మండలం వంగర సైతం కోండ్రు కాపాడుకోలేకపోవడంతో ఆయనకు టికెట్ రాకుడా అడ్డుకోవాలనే వ్యూహంతో ప్రతిభా భారతి ఉన్నారు. కానీ కోండ్రు మాత్రం గట్టిగానే పట్టుబడుతున్నారు. ఈసారి తన కుమార్తెకి టికెట్ దక్కించుకుంటే గెలుపోటములతో సంబంధం లేకుండా భవిష్యత్తులో రాజాం తమ కు సుస్థిర స్థానం అవుతుందనే అంచనా ప్రతిభా భారతి వర్గీయుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కోండ్రు, ప్రతిభా భారతి వర్గాల ఆధిపత్య పోరు ఇప్పుడు రోడ్డెక్కుతోంది. బహిరంగంగానే ఇరువురూ బలప్రదర్శనలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో రాజాం టీడీపీలో రాజుకున్న చిచ్చు పెద్ద మంట రాజేసే అవకాశం ఉంది. చివరకు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది.