సవాల్ చేశారు.. నిలిచారు

రాష్ట్రంలో 200 సీట్లు సాధిస్తాం.. అధికారంలోకి వస్తామని బెంగాల్ ఎన్నికలకు చాలా ముందు నుంచే బీజీపీ ప్రకటించింది. అదే వ్యూహంతో అక్కడ ఎన్నికల వ్యూహాలు అమలు చేసింది. అయితే బీజేపీకి 200 కాదు.. 100 సీట్లు కూడా రావు. వంద మార్కు దాటితే ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం మానేస్తానని తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ సవాల్ చేశారు. ఫలితాలు ఆయన మాటలనే నిజం చేస్తున్నాయి. పార్టీల రాజకీయ పోరాటం ఎలా ఉన్నా.. వ్యూహకర్తగా తన మాటను నెగ్గించుకున్న పీకే వ్యూహకర్తగా ఆయన మరింత మార్మోగుతోంది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత రంగ ప్రవేశం

పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పై ప్రజావ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. 42 ఎంపీ సీట్లలో 18 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ మమత సర్కారుకు సవాల్ విసిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తనదేనని తొడగొట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే మమత తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు. ఒకవైపు బీజేపీ సవాళ్ళను, ఒత్తిడిని ఎదుర్కొంటూనే పీకే టీమ్ సలహాలతో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దూరమైన వర్గాలను తిరిగి పార్టీ వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. బీజేపీలోకి ఫిరాయించిన నేతల స్థానంలో కొత్త నాయకత్వాన్ని, క్యాడరును తయారు చేసుకున్నారు. పీకే సలహాల ప్రకారం ఒంటరిగానే ఎన్నికల యుద్ధం చేశారు.

ప్రచారంలోనూ బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించారు. పీకేకు చెందిన ఒక ఆడియో క్లిప్ ను సామాజిక మధ్యమాల్లోకి వదిలి మమత ఓడిపోతుందని పీకే వ్యాఖ్యానించినట్లు సీన్ సృష్టించారు. అయితే పీకే దాన్ని గట్టిగా తిప్పికొట్టారు. దమ్ముంటే ఎడిట్ చేసింది కాకుండా.. ఆ ఆడియో మొత్తాన్ని యధాతధంగా రిలీజ్ చేయాలని బీజేపీని సవాల్ చేశారు. బీజేపీ 100 మార్కు దాటదన్న తన పాత సవాలును పునరుద్ఘాటించారు.

అనుమానాలు పటాపంచలు

ప్రచారంలోనూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లోనూ టీఎంసీ సాధారణ విజయమే సాధిస్తుందని, బీజేపీ వందకుపైగా సీట్లు సాధిస్తుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఫలితాల తొలి సరళి కూడా అలాగే కనిపించింది. కానీ క్రమంగా పుంజుకున్న టీఎంసీ బీజేపీని వందలోపు ఉంచేసి తాను మాత్రం 213 పైకి ఎగబాకడం ద్వారా పీకే అంచనాలను నిజం చేసింది. ఆయన సగర్వంగా రాజకీయ వ్యూహకర్తగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసింది. ఐతే ఫలితాలు వెలువడిన కాసేపటికే ఇకపై వ్యూహ కర్తగా పనిచేయబోనని పీకే ప్రకటించడం కొసమెరుపు.

Show comments