iDreamPost
iDreamPost
బాహుబలి ఏ ముహూర్తంలో ఒప్పుకున్నాడో కానీ అక్కడి నుంచి ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియాకు ఒక్క ఇంచ్ కూడా కిందకు దిగడం లేదు. వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ మెట్రో స్పీడ్ ని దాటేసి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాడు. రాధే శ్యామ్ చివరి దశ పనుల్లో ఉండగా ఆది పురుష్ కోసం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇదయ్యాక నాగ అశ్విన్ చేయబోయే విజువల్ వండర్ సెట్స్ పైకి వెళ్తుంది. ఇవన్నీ విడుదలయ్యేలోపు 2023 దాటేస్తుంది. దీనికే అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే తాజాగా మరో సెన్సేషనల్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టినట్టు లేటెస్ట్ అప్ డేట్. అది కూడా అంతకు మించి అనే తరహాలో.
కెజిఎఫ్ రాకముందు కర్ణాటక జనాలకు తప్ప ఇంకెవరికి తెలియని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టాప్ లిస్ట్ లో ఉన్నాడు. చాప్టర్ 2 మీద విపరీతమైన అంచనాలు, వందల కోట్ల బిజినెస్ జరగడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇది విడుదలయ్యాక ఎవరితో చేస్తారనే సస్పెన్స్ మొన్నటిదాకా కొనసాగింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి సంస్థ ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు సీన్లోకి ప్రభాస్ ఎంటరయ్యాడు. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాను డిసెంబర్ 2 వ తేదీ కెజిఎఫ్ నిర్మాతలు ప్రకటించబోతున్నట్టు సమాచారం.
ఇది తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. బాహుబలి కోసం తమ హీరో ఐదేళ్లు చేసిన త్యాగం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోందని అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్-డార్లింగ్ కాంబోని అఫీషియల్ గా ఇంకా చెప్పనప్పటికీ ఆల్రెడీ సోర్సెస్ లీక్ చేసేశాయి. ఈ లెక్కన ఎలాంటి బ్రేకులు లేకుండా ప్రభాస్ సినిమాల షూటింగులు జరిగితే ఇది 2024లో రిలీజ్ కావొచ్చు. కానీ ప్రభాస్ మూవీ ఏదీ అనుకున్న టైంకి ప్లానింగ్ ప్రకారం జరగలేదు. కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. యాక్షన్ కథలను డీల్ చేయడంలో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఏ రేంజ్ లో చూపిస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాం.