iDreamPost
android-app
ios-app

విద్యుత్‌ కొరత.. గుజరాత్‌లో పరిశ్రమలకు సెలవు

విద్యుత్‌ కొరత.. గుజరాత్‌లో పరిశ్రమలకు సెలవు

వేసవి ఆ పై బొగ్గు కొరత కారణంగా దేశ వ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్‌ ఏర్పడింది. తగినంత ఉత్పత్తి లేకపోవడంతో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు అనివార్యంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నాయి. గత పదిహేను రోజులుగా దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. విద్యుత కొరత కారణంగా తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఒక రోజు పరిశ్రమలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థ గుజరాత్‌ ఉర్జ వికాశ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) ఉత్తర్వులు జారీ చేసింది. నిరంతరం సాగాల్సిన పరిశ్రమలు మినహా.. మిగతా చిన్నా, పెద్దా అన్ని పరిశ్రమలు వారంలో ఒక రోజు పాటు మూసివేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.

ప్రస్తుతం గుజరాత్‌లో రోజుకు 37 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. అయితే తగినంత ఉత్పత్తి లేకపోవడంతో ప్రతి రోజు 500 మెగావాట్ల విద్యుత్‌ కొరత ఏర్పడుతోంది. ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో 60 శాతం పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. 18 శాతం వ్యవసాయానికి వినియోగిస్తుండగా.. మిగతా 22 శాతం గృహ అవసరాలకు వాడుతున్నారు. సాధారణంగా కొన్నేళ్లుగా వారంలో ఒక రోజు పరిశ్రమలు మూసివేసే అనవాయితీ కొనసాగుతోంది. అయితే అది తప్పనిసరి కాదు. యాజమాన్యం ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఒక రోజు మూసివేత జరుగుతోంది. అయితే ఈ ఏడాది అనూహ్యంగా డిమాండ్‌ పెరగడంతో వారంలో ఒక్క రోజు తప్పనిసరిగా పరిశ్రమలు మూసివేయాలనే ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు మరో 15 రోజుల పాటు అమల్లో ఉంటాయని జీయూవీఎన్‌ఎల్‌ పేర్కొంది.

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై పరిశ్రమదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పరిశ్రమలను చావుదెబ్బ తీస్తుందని గుజరాత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (జీసీసీఐ) జీయూవీఎన్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జేపీ శివహరేకు లేఖ రాసింది. ప్రస్తుతం ఆర్థిక ఏడాది ముగింపు దశలో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో వారంలో ఒక రోజు పరిశ్రమలను మూసివేయాలనే నిర్ణయం పరిశ్రమలను ఆర్థికంగా దెబ్బతీస్తుందని జీసీసీఐ అధ్యక్షుడు హేమంత్‌ షా వాపోయారు. కోవిడ్‌ తర్వాత పరిశ్రమలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని, ఇలాంటి తరుణంలో జీయూవీఎన్‌ఎల్‌ నిర్ణయం పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని, లేదంటే కనీసం పదిహేను రోజులు వాయిదా వేయాలని కోరారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా నిబంధన అమలు చేయడం సరికాదని హేమంత్‌ పేర్కొన్నారు. తమకు పదిహేను రోజుల సమయం ఇస్తే.. విద్యుత్‌ కొరతను ఎదుర్కొనేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటామన్నారు.