Idream media
Idream media
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాలు గడిచాయి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్, చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో పాటు ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు. పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి ఒక నివేదిక పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ (I am appalled with your report) అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
“నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా. (Don’t I have the freedom to differ with my editor?)
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి” ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
Guest Writer – Bhandaru Srinivas Rao