iDreamPost
android-app
ios-app

పేద ఆర్టీసీ పెద్ద‌మ్మ క‌థ‌

పేద ఆర్టీసీ పెద్ద‌మ్మ క‌థ‌

“అవ్వా కథ చెప్ప‌వా?” అడిగింది మ‌నుమ‌రాలు.
“ఈ క‌థ చెప్పాల్సి వ‌స్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేదు బిడ్డా కానీ చెప్తా విను”

అన‌గ‌న‌గా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని ప‌రాయివాళ్లు పాలించేవాళ్లు. భాష‌ని, బ‌ట్ట‌ని, తిండిని అన్నింటిని వాళ్లు అవ‌మానిస్తున్నార‌ని ఆత్మ‌గౌర‌వ ఉద్య‌మం బ‌య‌ల్దేరింది. ఎన్నో ఏళ్లుగా ఎంద‌రో చేశారు కానీ , సొంత‌రాజ్యాన్ని తీసుక‌రాలేక‌పోయారు.

ఒక్క‌డొచ్చాడు. నేల మ‌న‌ది, నీరు మ‌న‌ది అన్నాడు. ప్రాణం కంటే గౌర‌వ‌మే ముఖ్య‌మ‌న్నాడు. ఏళ్ల‌త‌ర‌బ‌డి పోరాడాడు. జ‌నం న‌మ్మారు. పాల‌కుల క‌త్తుల‌కి ఎదురెళ్లారు. తిండి, నిద్ర మానారు. ప‌నుల్లేక ప‌స్తులున్నారు. ప‌సిబిడ్డ‌లు కూడా నినాద‌పు జెండాలై ఎగిరారు. ఒక యుద్ధ‌మే జ‌రిగింది. నాయ‌కున్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు. ఈ య‌జ్ఞంలో ఎంద‌రో క‌ర్ర‌లై కాలిపోయారు.

Read Also: క్రీస్తు పూర్వం 2017 – అమరావతి ప్రయాణం

ప‌రాయిపాల‌న ముగిసింది. ఉద్య‌మకారుడు సింహాస‌నం మీద కూచున్నాడు. ఈ నేల‌ని ముద్దు పెట్టుకున్నాడు. ఈ మ‌ట్టిని బంగారుగా చేస్తాన‌న్నాడు. త్యాగం వృథా పోద‌న్నాడు. ప్ర‌జ‌ల కంటికి రెప్ప‌న‌వుతా, చీక‌టి వేళ దీపంగా మారుతాన‌న్నాడు. నువ్వు న‌డిచే వేళ నీడ‌న‌వుతా, నిద్రించే వేళ క‌ల‌ని అవుతాన‌న్నాడు. ప్ర‌జ‌లు పండగ చేసుకున్నారు.

రోజులు గ‌డిచాయి. మ‌ళ్లీ అవే పాత‌రోజులు. ఏమీ మార‌లేదు. విద్య మార‌లేదు. వైద్యం మార‌లేదు. క‌ష్ట‌ప‌డినా కంచం నిండ‌దు.

ఇలా ఉండ‌గా బ‌తుకు భార‌మై గుర్రంబ‌ళ్ల వాళ్లు , ఒంటెద్దు బండ్ల‌వాళ్లు రాజుని కాసింత భ‌త్యం పెంచ‌మ‌ని అడిగారు. వాళ్లు బండెన‌క బండి క‌డితేనే ఉద్య‌మం న‌డిచింద‌ని రాజు మ‌ర‌చిపోయాడు. కొర‌డాతో ముందు గుర్రాన్ని, త‌ర్వాత బండివాన్ని కొట్టాడు. త‌న రాజ్యంలో అభ్య‌ర్థ‌నే త‌ప్ప గ‌ట్టిగా అడిగే హ‌క్కు లేద‌న్నాడు. వాళ్లు స‌మ్మె చేశారు. గుర్రాలు ఎండిపోయాయి. మ‌నుషులు రాలిపోయారు. రాజు క‌ర‌గ‌లేదు.

క‌న్నీళ్ల‌కి విలువ‌లేని కాలం ఒక‌టి వ‌చ్చింది. ఉద్య‌మం కోసం గ‌జ్జ క‌ట్టిన క‌వులు, కళాకారులు మౌనం వ‌హించారు. జ‌నాన్ని నిద్ర‌లేపే కోడిపుంజులు క‌న‌ప‌డ్డం మానేశాయి. ఆస్థానంలో ప‌ద‌వులు ద‌క్కిన‌వాళ్లు గాంధారిలాగా క‌ళ్ల‌కి గంత‌లు క‌ట్టుకున్నారు.

Read Also: వెలుగులోకి నిత్యానంద అక్రమాలు.. అవయవాల వ్యాపారం కూడానా?

“ఆక‌లిగా ఉంద‌వ్వా?” అడిగింది మ‌నుమ‌రాలు.
“ఇది మ‌న క‌థే. తిన‌డానికి అన్నం లేక క‌థ చెప్పినిద్ర‌పుచ్చాల‌నుకున్నా”
త‌న కన్నీళ్ల‌లో తానే త‌డిసిపోతూ చెప్పింది అవ్వ‌.
“స‌రే ,త‌ర్వాత ఏమైంది”

“రోడ్డు మీద శ‌వాల‌ను, ఆడ‌వాళ్ల ఏడుపుని జ‌నం రెండు క‌ళ్ల‌తో చూస్తున్నారు. క‌డుపులోని బాధ క‌ళ్ల‌లోకి ఎగ‌తంతే క‌న్నీళ్లు గ‌డ్డ‌క‌డ్తాయి. అది లావాగా మారి అప్పుడు మూడోక‌న్ను తెరుచుకుంటుంది. ఆ క‌న్ను తెరుచుకునేలా చేయ‌డ‌మే పాల‌కుల అంతిమ ల‌క్ష్యం”
క‌థ అయిపోయింది. పాప ఆక‌లితో నిద్ర‌పోయింది.

Read Also: గాడ్సే ఒక దేశభక్తుడు–ప్రగ్యా సింగ్