iDreamPost
android-app
ios-app

గరం గరం సాగర్!

గరం గరం సాగర్!

యుద్ధాన్ని మధ్యలో వదిలేస్తే అది మొదటికే మోసం తెస్తుంది. జాతర మొదలు పెట్టాక వేడి తగ్గితే పండగ వాతావరణం పోతుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు రాబట్టుకున్న బిజెపి ఇదే స్పీడు కొనసాగించడానికి, తెలంగాణలో రాజకీయ వేడి రాజయ్య డానికి ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఫలితంగా తెలంగాణాలో బీజేపీ ఒకపక్క వ్యూహంతో రాజకీయాలు చేస్తోందని తెలుస్తోంది.

ఎవరిని ఎంపిక చేద్దాం!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని అవసరం బీజేపీకి ఉంది. తెలంగాణలో గట్టిపట్టు పెంచుకోవాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం తప్పనిసరి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా గట్టి అభ్యర్థి అయితేనే ఇక్కడ నెగ్గుకు రాగలమని, 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి కి కేవలం రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చిన విషయాన్ని నాయకులు గుర్తు పెట్టుకుని అభ్యర్థి ఎంపిక కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

జానా వస్తారనుకుని…

మొదట జానారెడ్డి బిజెపి లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నోముల నర్సింహయ్య మీద కాంగ్రెస్ తరపున జానారెడ్డి పోటీ చేశారు. 7,700 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పని చేయలేదు. కాంగ్రెస్ మీద ఆయన కోపంతో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో జానారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకుంటారని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆయనే ఉంటారని ప్రచారం ఎక్కువ కావడంతో జానారెడ్డి స్వయంగా స్పందించి తాను ఎప్పటికీ కాంగ్రెస్ను వీడను అంటూ స్పష్టం చేశారు. దాని తర్వాత ఆయన కొడుకును బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతుంది అన్న ప్రచారం కూడా జరిగింది. దీనిని సైతం జాన కుటుంబం ఖండించడం తో పాటు తాము ఎప్పటికీ కాంగ్రెస్ వాదులమే అని అర్థం చేయడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

రాములమ్మను అనుకున్న..

ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వచ్చిన ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి తన అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని అంతా భావించారు. ఆమె సినీ గ్లామర్ తో పాటు, ప్రత్యర్థుల మీద జోరుగా విమర్శలు గుప్పిస్తూ మంచి ఫలితం వస్తుందని అంచనా వేశారు . అయితే విజయశాంతి ఈ విషయంలో బిజెపి జాతీయ నాయకుల ఆలోచన మరోలా ఉంది. ఆమెను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న బీజేపీ, ఆమెను అభ్యర్థిగా నిలిపేందుకు చివరి నిమిషంలో విముఖత వ్యక్తం చేసింది.

కోమటిరెడ్డి రాక మీద!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలబడతారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి ఆ పార్టీ తీరు మీద వైఖరి మీద బహిరంగంగా విమర్శలు చేశారు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. అందులోనూ అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని అక్కసుతో పాటు పార్టీ అధిష్టానం తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న అతను ఆయన బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలోనే పార్టీ మార్పు మీద ఆలోచిస్తున్నట్లు చెప్పడం, ఖచ్చితంగా బిజెపిలోకి వెళ్తారని ప్రచారం ఊపందుకోవడం జరిగింది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థి అవుతారన్నది తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న చర్చ.

సామాజిక వర్గాల లెక్కలు వేస్తూ…

నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 30 వేల వరకు ఉంటే, ఇక నాయక్ (లంబాడీ) సామాజిక వర్గం ఓట్లు 40 వేల వరకు ఉన్నాయి. దీంతో ఉప ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం తరపున కడారి అంజయ్య యాదవ్ బిజెపి టికెట్ కోసం నాయకులను కలుస్తున్నారు. తన సామాజిక వర్గం అంతా తనకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. ఇక 2018 ఎన్నికల్లో జానా రెడ్డి ఓటమికి ప్రధాన కారణం గా భావిస్తున్న లంబాడా సామాజికవర్గం నుంచి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రాగ్యా నాయక్ కుమారుడు కైలేష్ నాయక్ ను బీజేపీ నుంచి రంగంలోకి దింపితే రాజకీయంగానూ, ఆర్థికపరమైన ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. దింతో పాటు గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన కంకటాల నివేదిత రెడ్డి సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె తండ్రి కంకటాల శ్రీధర్ రెడ్డి బిజెపి నల్గొండ జిల్లాకు అధ్యక్షుడిగా పని చేస్తుండడంతో పాటు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమ కుటుంబానికి ఈ ఉప ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఊపు తగ్గకుండా..

తెలంగాణలో రాజకీయ వేడి తగ్గకుండా ఎప్పటికప్పుడు ఉపఎన్నికలు రావడమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే గా ప్రస్తుతం ఉన్న రాజగోపాల్ రెడ్డి ని నాగార్జునసాగర్ ఓపెన్ ఎన్నికల్లో నిలబెట్టి, గెలిపించుకోవడం ద్వారా మునుగోడు స్థానం ఖాళీ అవుతుంది. అంటే అక్కడ మళ్లీ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. దీనివల్ల తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి పుడుతుంది. ఇలా తెలంగాణాలో ఎప్పటికప్పుడు ఎన్నికల రావడం, రాజకీయ చర్చ ఊపు అందుకోవడం వల్ల బీజేపీ ను, పార్టీ బలాన్ని సైతం ప్రజలు గుర్తు పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది అన్నది నాయకుల అంచనా. దీని కారణంగానే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో దించాలని కాషాయం పార్టీ భావిస్తోంది.

అయితే ప్రతిసారీ ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పై, పార్టీ మార్పు మీద వ్యాఖ్యానాలు చేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే యోచన లేనట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే బిజెపి నాయకులు కోమటిరెడ్డి తో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో కోమటిరెడ్డి మీద బీజేపీ ఆశలు వదులుకున్నట్లే నని తెలుస్తోంది. గెలుపు కోసం అన్ని మార్గాలను వెతికే బీజేపీ ఇప్పుడు వేసే కొత్త ఎత్తులు సాగర్లో ఆసక్తి ని రేపుతున్నాయి.