చెవిరెడ్డి, భూమన వారసులొస్తున్నారు…

చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కుమారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకొని తమ రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో తమ తండ్రుల తరఫున ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి, వారి గెలుపునకు కృషి చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటిస్తూ ప్రజలందరికీ దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో షార్ట్‌ కట్‌ల జోలికి వెళ్లకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరే లక్ష్యంతో వారసులిద్దరూ ముందుకు సాగుతున్నారు.

చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్లపల్లి ఎంపీటీసీ–1 స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తమ స్వగ్రామమైన తుమ్మలగుంటలోని ఎంపీటీసీ స్థానం రిజర్వ్‌ అవడంతో జనరల్‌ కేటగిరీ స్థానం కోసం వెతికి పెరుమాళ్లపల్లిని పోటీకి ఎంపిక చేసుకున్నారు. ఈ ఎన్నికలో గెలవటం ద్వారా మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్‌ ఎంపీపీ పదవికి ఎన్నిక కావటానికి మార్గం సుగమం అవుతుంది.

ఇక తిరుపతి వైఎస్సార్‌సీపీ గెలుపు వెనుక అభినయ్‌రెడ్డి పాత్ర ఎంతో ఉంది. తిరుపతిలోని అన్ని డివిజన్లలో తిరుగుతూ ప్రజల తలలో నాలుకలా మారారు. తండ్రి కరుణాకర్ రెడ్డి గెలిచిన తర్వాత తిరుపతి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని ఏదో ఒక స్థానం నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి మేయర్‌ స్థానం మహిళలకు రిజర్వ్‌ కావడంతో.. డిప్యూటీ మేయర్‌గా పనిచేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఆయన అడుగులు పడుతున్నాయి.

తండ్రి బాటలోనే మోహిత్‌రెడ్డి..
చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా కింది స్థాయి నుంచి పలు పదవులు అలంకరించి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ లాతోపాటు పీహెచ్‌డీని కూడా పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే చెవిరెడ్డికి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి సంఘంలో నాయకుడిగా ఉంటూ గుర్తింపు పొందారు. అలా వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టిలో పడ్డారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు.

ఆ తరువాత తిరుపతి జెడ్పీటీసీకి పోటీ చేసి గెలిచారు. తన పోరాటాల ద్వారా జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందారు. చెవిరెడ్డి సేవలను గుర్తించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందారు. వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. 2014 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి లాంటి బలమైన అభ్యర్థిని ఎదుర్కొని చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్‌ జగన్‌ మరోసారి తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ను చేశారు. ప్రభుత్వ విప్‌గా కూడా అవకాశం కల్పించారు. ఇలా కింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి చేరిన చెవిరెడ్డి.. తన కొడుకును కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. అందుకే ఎంపీటీసీగా పోటీ చేయిస్తున్నారు.

వైఎస్‌ రాజారెడ్డి నుంచి వైఎస్‌ జగన్‌ వరకు..
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి దశాబ్ధాలుగా వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. అయితే ఏ రోజూ రాజకీయ పదవులు ఆశించలేదు. కాంగ్రెస్‌ పార్టీకి నిస్వార్థ సేవ చేశారు. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పనిచేశారు. తన పదవీ కాలంలో తిరుమలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 2009లో వైఎస్సార్‌ సూచన మేరకు తిరుపతి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి చేతిలో పరాజయం పాలయ్యారు. వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ జగన్‌ వెంట అడుగులు వేశారు. 2012లో తిరుపతి స్థానానికి చిరంజీవి రాజీనామా చేయడంతో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఓడిపోయినా.. 2019లో మళ్లీ గెలిచారు. ఇలా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని రాజకీయాల్లో ఉంటున్నారు. ఇలా తండ్రి బాటలోనే కొడుకు అభినయ్‌ పయనిస్తున్నారు. అందులో భాగంగానే కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు.

Show comments