iDreamPost
android-app
ios-app

సై అంటే సై..

  • Published Jan 13, 2021 | 8:55 AM Updated Updated Jan 13, 2021 | 8:55 AM
సై అంటే సై..

దేశ వ్యాప్తంగా సంక్రాంతి శోభ సంతరించుకుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ నాలుగు రోజుల పాటు సాంప్రదాయకంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో తమ స్వస్థాలకు ఇప్పటికే చేరుకున్నారు. మరికొందరు మార్గమధ్య ప్రయాణంలో ఉన్నారు. ప్రతియేటా మాదిరిగానే ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంక్రాంతి సందర్భంగా వచ్చే కోడిపందాల శోభ వచ్చేసింది. కత్తి కట్టకుండా వేసే కోడిపందాలను పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రారంభించారు. దీంతో సంక్రాంతి సంబరాలకు ఊపునిచ్చినట్టయింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు తమతమ ప్రాంతాల్లో కోడిపందాలకు సిద్ధమయ్యారు.

అయితే కత్తితో వేసే పందాలు వద్దంటూ కోర్టు నుంచి ఆదేశాలున్న నేపథ్యంలో పోలీస్‌లు ఆ ఆదేశాలను అమలు చేసేందుకు గట్టి ప్రయత్నాలనే చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ, కాకినాడ డివిజన్లలో దాదాపు 300లకుపైగా పందాలకు సిద్ధం చేసిన బరులను జేసీబీలు, ట్రాక్టర్లతో ధ్వంసం చేసినట్టు ఆయా డివిజన్‌ పోలీస్‌ అధికారులు ప్రకటించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో వందలాది మంది పందాల నిర్వాహకులను పోలీస్‌లు బైండోవర్‌ చేసారు. టౌన్‌కు సమీపంలోనే ఉన్న ఆర్డీవో టెస్టింగ్‌ సెంటర్‌ సమీపంలోని గొడౌన్స్‌ వద్దకు తరలించినట్లు సమాచారం. అలాగే పందాలకు పేర్గాంచిన ప్రాంతాల్లో కోడి కత్తులు తయారు చేసే వారిని కూడా పోలీస్‌లు ఇప్పటికే బైండోవర్‌ చేసారు.

కత్తులు కట్టకుండా వేసే డింకీ పందాలను ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభమయ్యాయి. అయితే తొలుత ఈ విధంగానే ఉండి ఆ తరువాత కత్తుల పందాలు మొదలవుతాయని వాటి నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ ప్రత్యేకంగా పందాలపై నిఘా ఉంచింది. కోడి పందాలతో పాటు అక్కడ జరిగే జూదం, ఇతర కార్యకలాపాలను అడ్డుకునేందుకు కంకణం కట్టుకున్నారు. ఏపీలో ఎస్‌ఈబీ అధికారులు కూడా కోడి పందాలపై నిఘా ఉంచినట్లుగా చెబుతున్నారు. అయినప్పటికీ పందెం రాయుళ్ళు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ ప్రయత్నాల్లో తామున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో పోలీస్‌ల ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతమయ్యాయన్నది తేలుతుంది.