iDreamPost
android-app
ios-app

రోజుకు 20 కోట్ల వసూళ్ళు..!

  • Published Dec 25, 2020 | 6:05 AM Updated Updated Dec 25, 2020 | 6:05 AM
రోజుకు 20 కోట్ల వసూళ్ళు..!

రోజుకు 20 కోట్ల రూపాయలు వసూలు చేయాలి.. లోన్‌ యాప్‌ సంబంధిత కాల్‌సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి పెడుతున్న టార్గెట్‌ ఇది. లోన్‌యాప్‌ల కారణంగా జనం ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. దీంతో యాప్‌ నిర్వాహకులను బైటపెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన రోజుకో లీల వెలుగుచూస్తోంది. తెలంగాణా పోలీస్‌లు ఢిల్లీలో అయిదుగురు, హైదరాబాదులో ఆరుగురు వ్యక్తులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోవడంతో విచారణలో పురోగతి సాగుతోంది.

అప్పులు తీసుకుంటున్న వాళ్ళ నుంచి రికవరీ చేసేందుకు నియమితులైన కాల్‌సెంటర్‌ ఉద్యోగులు ఎలాగైనా మాట్లాడొచ్చు. కానీ లోన్‌ రికవరీ అవ్వాలి అంతే. నిర్వాహకులు పెట్టిన టార్గెట్‌ ఇదని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. యాజమాన్యం ఇచ్చిన ఈ వెసులుబాటు కారణంగా రుణగ్రహీతలకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో వారిని దూషిస్తున్నట్లుగా వెలుగుచూసింది.

అంతేకాకుండా ఒక లోన్‌యాప్‌కు అనుబందంగా 30 వరకు లింక్‌ యాప్‌లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. వీటి వెనుక చైనాకు చెందిన ఒక మహిళ కీలక వ్యక్తిగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా లోన్‌యాప్‌ బాధితులు వారి సమస్యను తమ దృష్టికి తీసుకు రావాలని ఉభయ తెలుగురాష్ట్రాల్లోని పోలీస్‌లు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు తమలోతామే బాధపడుతున్న బాధితులు ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ యాప్‌ బాధితులు వందల సంఖ్యలోనే పోలీస్‌లను ఆశ్రయిస్తున్నారు. వారి ఫిర్యాదులు నమోదు చేసుకుని పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.