iDreamPost
android-app
ios-app

పోలీసులపై దౌర్జన్యం.. మాజీమంత్రి అయ్యన్నపై కేసు

  • Published Apr 17, 2022 | 3:07 PM Updated Updated Apr 17, 2022 | 8:42 PM
పోలీసులపై దౌర్జన్యం.. మాజీమంత్రి అయ్యన్నపై కేసు

నోటి దురుసుతనానికి, దౌర్జన్యాలకు పెట్టింది పేరైన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత ఊరు నర్సీపట్నంలో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. నిజానికి అయ్యన్నకు కేసులు కొత్తకాదు.అయినా ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ప్రత్యర్థులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అధికారులను అడ్డుకోవడం, తూలనాడటం, అసభ్య పదజాలంతో దూషించడం అయ్యన్నకు అలవాటే. గతంలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ను ఇదే రీతిలో దూషించారు. కొద్దినెలల క్రితం గుంటూరు జిల్లాలో అప్పటి హోంమంత్రి సుచరితతోపాటు, సీఎం జగన్ ను, వైఎస్సార్సీపీ అగ్రనేతలను దూషించినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలుసెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఎస్సైపై దౌర్జన్యం చేసినందుకు..

నర్సీపట్నం గ్రామదేవత మరిడిమాంబ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా రికార్డింగ్ డాన్సులు పెట్టరాదని, వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని ఉత్సవ నిర్వాహకులకు పోలీసులు ముందే సూచించారు. అయితే ఉత్సవాల్లో ఈ ఆంక్షలను ఉల్లంఘించడంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ తరుణంలో అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడారు. రెండేళ్ల తర్వాత మీ సంగతి చూస్తానని హెచ్చరించారు. అంతే కాకుండా విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేశారని పోలీసులు చెప్పారు. ఆ మేరకు అయ్యన్నపై ఐపీసీ 304, 305, 188, 204 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలోనూ అయ్యన్న నోటి దురుసుతనం

అధికారంలో ఉన్నా లేకపోయినా అయ్యన్న దురుసుతనంతో మాటలు తూలుతూ అనేకమార్లు వివాదాస్పదమయ్యారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. 2020 జూన్ 15న నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో పెయింట్లు వేస్తున్న సందర్భంలో అయ్యన్న తాత లచ్చాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు తీసి పక్కన పెట్టారు. అధికారులు ఆ విషయం చెప్పినా అయ్యన్న పట్టించుకోకుండా తన అనుచరులతో కార్యాలయం ఆవరణలో ధర్నా చేయడమే కాకుండా మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని నానదుర్భాషలాడారు. తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. దాంతో ఆమె ఫిర్యాదు మేరకు 354 ఏ(4), 500, 504, 505 (1)(బి), 505(2), 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వగ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ సందర్బంగా అప్పటి హోంమంత్రి మేకతోటి సుచరితను తీవ్ర పదజాలంతో దూషించినందుకు అయ్యన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల, గుంటూరు జిల్లా నకరికల్లు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తదితరులను అసభ్య పదజాలంతో దూషించినందుకు నల్లజర్ల, నకరికల్లు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.