iDreamPost
android-app
ios-app

పోలవరంలో మరో ముందడుగు, స్పిల్ చానెల్ కి నేడు కాంక్రీట్ పనులు ప్రారంభం

  • Published Jan 06, 2021 | 2:56 AM Updated Updated Jan 06, 2021 | 2:56 AM
పోలవరంలో మరో ముందడుగు, స్పిల్ చానెల్ కి నేడు కాంక్రీట్ పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం పనులను ముమ్మరం చేసింది. కాంట్రాక్ట్ సంస్థ మేఘ ఇంజనీరింగ్ నిపుణులు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అందులో భాగంగా ఓవైపు స్పిల్ వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో స్పిల్ చానెల్ నిర్మాణంలో కీలకమైన కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి ఈ పనులు ప్రారంభిస్తున్నారు. వచ్చే వరదల సీజన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో సాగుతున్నారు.

వచ్చే ఏడాదికి పోలవరం నుంచి రైతులకు నీరు అందించాలనే సంకల్పంతో సర్కారు ఉంది. దానికి తగ్గట్టుగా ఇటీవల సీఎం పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. సమీక్షా సమావేశం నిర్వహించారు. దిశానిర్దేశం చేసి పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బృందం కూడా పరిశీలించింది. చైర్మన్ కూడా పోలవరం పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలని , పునరావాసం మీద దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కేంద్రం నుంచి నిర్మాణ వ్యయం అంచనాల పెరుగుదలకు కూడా సానుకూల స్పందన వచ్చింది. సీడబ్ల్యూసీ అంగీకరించినట్టుగా 2017 నాటి అంచనాల ప్రకారం రూ. 55వేల కోట్ల కు అంగీకారం దక్కుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు సర్కారు చేసిన తప్పిదం కారణంగా 2013 నాటి అంచనాలకే పరిమితం అవుతామని చెప్పిన కేంద్రం, ప్రస్తుతం దానిని సవరించేందుకు సిద్ధపడడంతో పోలవరం పనులకు ఆటంకాలు ఉండవనే చెబుతున్నారు.

అదే సమయంలో స్పిల్ వే, స్పిల్ చానెల్ నిర్మాణాలు పూర్తయితే రాబోయే వరదల సీజన్ నాటికి గోదావరి నీటిని పూర్తిగా మళ్లించే అవకాశం వస్తుంది. స్పిల్ చానెల్ ద్వారా వరద జలాలను మళ్లించి, కాఫర్ డ్యామ్ దిగువన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులకు అడ్డంకులు లేకుండా చేయవచ్చని భావిస్తున్నారు. గత వరదల సమయంలో స్పిల్ వే పనులు చేపట్టారు. భారీ వరదలు వచ్చినా పనులకు ఆటంకం లేకుండా చేశారు. మొత్తం వరద నీటిని కాఫర్ డ్యామ్ మీదుగా మళ్లించి ఈపనులు సాగించారు. ఇప్పుడు వరద జలాలను స్పిల్ చానెల్ వైపు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అదే జరిగితే కీలకమైన డ్యామ్ పనులకు అడ్డంకులు తొలగినట్టేనని భావిస్తున్నారు. ప్రస్తుతం స్పిల్ చానెల్ పనుల్లో కాంక్రాట్ వర్క్స్ ప్రారంభం కావడం విశేషం. ఇది 8 నెలల తర్వాత మళ్లీ కాంక్రీట్ పనులు మొదలయినట్టవుతుంది.