iDreamPost
android-app
ios-app

ఆక‌లి రాజ్యంతో శ్రీ‌శ్రీ జ్వ‌రం – Nostalgia

ఆక‌లి రాజ్యంతో శ్రీ‌శ్రీ జ్వ‌రం – Nostalgia

ఒక సినిమా చూసి క‌విత్వం మీద ప్రేమ పుట్టి, చ‌ద‌వ‌డం, రాయ‌డం జ‌రుగుతుందా? 1981లో జ‌రిగింది. సినిమా పేరు ఆక‌లిరాజ్యం. అంద‌రినీ ఆవేశ ప‌రిచిన క‌వి శ్రీ‌శ్రీ‌. సాహిత్యం, లెప్ట్ పార్టీల‌తో సంబంధం ఉన్న వారిని మిన‌హాయిస్తే మిగిలిన సామాన్యుల‌కి శ్రీ‌శ్రీ సినిమా క‌విగానే తెలుసు. మ‌హాప్ర‌స్థానం అనే అద్భుత పుస్త‌కాన్ని రాశాడ‌ని కుర్రాళ్ల‌కి తెలియ‌దు.

81 నాటికి యువ‌త ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. ఉద్యోగాలు లేని స్థితి. గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చే గ్రూప్ స‌ర్వీసెస్ గ‌తి. అప్పుడ‌ప్పుడు బ్యాంక్ Exams జ‌రిగితే, వేల‌లో ప‌రీక్ష‌లు రాస్తే, వంద‌ల్లో కూడా జాబ్స్ వుండేవి కావు. స్కూళ్లు త‌క్కువ‌గా ఉన్న కాలం. టీచ‌ర్ ఉద్యోగాలు కూడా లేవు. ప్రైవేట్ ఉద్యోగాలు అస‌లు లేవు. బ‌య‌ట ఉద్యోగం లేక ఇంట్లో జ‌రుగుబాటు లేక చాలా మంది కేవ‌లం వ‌స‌తి, భోజ‌నం కోసం ప‌దేళ్ల‌కు పైగా యూనివ‌ర్సిటీల్లో తిష్ట వేసేవాళ్లు. ఫ‌స్ట్ పీజీ చేరితే రెండేళ్లు, త‌ర్వాత లా ఐదేళ్లు, ఎంఫిల్ ఏడాది, పీహెచ్‌డీ ఐదేళ్లు. హాస్ట‌ళ్ల‌లోనే ముస‌లోళ్లు అయిపోయినోళ్లు ఉండేవారు. రాజ‌కీయాలు అధ్వానంగా ఉండేవి. ఎమ‌ర్జెన్సీ ఎత్తేసి , 77లో ఇందిర‌మ్మ ఓడిపోయింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జ‌న‌తా ప్ర‌భుత్వం కీచులాట‌ల‌తో ర‌చ్చ‌కెక్కింది. మార్గ‌ద‌ర్శ‌కుడు జ‌య‌ప్ర‌కాష్‌ నారాయ‌ణ చ‌నిపోయారు.

జ‌న‌తా కంటే ఇందిర‌మ్మే మేల‌ని మ‌ళ్లీ గెలిపించారు. కాశ్మీర్ య‌థాత‌థం. పంజాబ్‌లో ఖ‌లిస్తాన్ మొలిచింది. బింద్ర‌న్‌వాలే ఒక శ‌క్తిగా ఎదిగాడు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంది. మారుతున్న ముఖ్య‌మంత్రుల‌తో అవినీతిలో మునిగితేలుతూ ఉంది. నిరాశ నిస్పృహ‌ల‌తో ఉన్న యువ‌త న‌క్స‌లిజం వైపు న‌డుస్తోంది. తెలంగాణ , ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ జిల్లాల్లో కూడా ద‌ళాలు తిరుగుతున్న కాలం.

బాల‌చంద‌ర్ కాలం కంటే ముందు ఆలోచించే ద‌ర్శ‌కుడు. అందుకే ఆయ‌న సినిమాలు ఇప్ప‌టికీ ప్రెష్‌గా ఉంటాయి. నిరుద్యోగం నేప‌థ్యంతో క‌మ‌ల్‌హాస‌న్‌, శ్రీ‌దేవిల‌తో వ‌రుమాయిన్ నిరం సివ‌ప్పు తీశాడు. అదే తెలుగులో ఆక‌లిరాజ్యం. త‌మిళంలో న‌వంబ‌ర్ 80లో వ‌స్తే, తెలుగులో జ‌న‌వ‌రి 81లో వ‌చ్చింది. రెండు భాష‌ల్లో తీశారు.

జ‌న‌వ‌రి 2, అనంత‌పురం ర‌ఘువీరా టాకీస్‌లో ఈ సినిమా చూసి మైండ్ పోయింది. క‌మ‌ల్‌హాస‌న్‌, శ్రీ‌దేవి ఒకరిని మించి మ‌రొక‌రు. శ్రీ‌దేవి వ‌చ్చిన‌పుడు క‌మ‌ల్‌హాస‌న్ త‌న మిత్రుల‌తో క‌లిసి ఉత్తుత్తి భోజ‌నం తింటున్న‌ట్టు యాక్ట్ చేసే సీన్‌లో క‌ళ్ల‌లో నీళ్లు. ఎమ్మెస్ విశ్వ‌నాథ‌న్ Back ground Score అద్భుతం. క‌మ‌ల్ నోట్లో నుంచి శ్రీ‌శ్రీ క‌విత‌లు వింటూ ఉంటే ప్ర‌తి ప‌దం సంగీత‌మే.

నిరుద్యోగం, ఆక‌లిని న‌వ్విస్తూ , ఏడ్పిస్తూ చెప్ప‌డం చాప్లిన్ ప‌ద్ధ‌తి. బాల‌చంద‌ర్‌, క‌మ‌ల్‌హాస‌న్ అంత‌కు రెండింత‌లు స‌క్సెస్ అయ్యారు. యువ‌త వెర్రెక్కి చూశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లంతా కొద్దోగొప్పో తేడాతో క‌ష్టాల్లోనే ఉన్నారు.

ఇంజ‌నీరింగ్‌కి డిమాండ్ ఏర్ప‌డుతున్న రోజులు. గుంటూరు ర‌వి కాలేజీ ఎంట్రెన్స్ పేరుతో ఊరంతా హాస్ట‌ళ్లు న‌డుపుతున్న కాలం. ఉన్న‌వి అతి త‌క్కువ కాలేజీలు (అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేవు). సీటు రాని వాళ్లు BSC లో చేరేవాళ్లు. అక్క‌డా రానివాళ్లు ఆర్ట్స్ గ్రూప్‌లో. ఇప్ప‌టిలా ఖర్చుల‌కు సంపాదించుకోడానికి స్విగ్గీ, జమోటా , క్యాబ్‌లు లేని కాలం. అందుకే ఈ సినిమాకి క‌నెక్ట్ అయిపోయారు.

సినిమా చూసిన‌ప్పుడు నా వ‌య‌సు 17. డిగ్రీ చ‌దువుతున్నా. శ్రీ‌శ్రీ తెలుసు కానీ, క్షుణ్ణంగా కాదు. విశాలాంధ్ర బుక్‌హౌస్‌కి వెళ్లి మ‌హాప్ర‌స్థానం కొన్నాను. రోజుల త‌ర‌బ‌డి చ‌దివాను. శ్రీ‌శ్రీ ప‌దాల‌లోని మ‌ర్మం , ర‌హ‌స్యం , దుక్కం అర్థం చేసుకోడానికి చాలా కాలం ప‌ట్టింది. ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నా.

రాజ్యం అర్థ‌మైతేనే ఉరి తీయ‌బ‌డ్డ శిర‌స్సు చెప్పిన ర‌హ‌స్యం తెలుస్తుంది. ఆక‌లేస్తేనే కేక‌లెందుకు పుడ‌తాయో అర్థ‌మ‌వుతుంది.

శ్రీ‌శ్రీ కోసం క‌ల‌వ‌రించి, ప‌ల‌వ‌రిస్తున్న‌ప్పుడు ఆయ‌న సాయిబాబా కాలేజీకి గెస్ట్‌గా వ‌చ్చారు. యువ‌కులంతా ప‌రుగులు తీశాం. అయితే ఆయ‌న ఉప‌న్యాసం నిరాశ‌ప‌రిచింది. క‌విత్వంలో ఉన్న ఆవేశం మాట‌లో లేదు. మెల్లిగా మాట్లాడారు. ఆయ‌న త‌ర‌హా అంతేన‌ని తెలియ‌దు.

శ్రీ‌శ్రీ‌ని నిద్ర‌లో , మెల‌కువ‌లో చ‌దివాను. చ‌నిపోయిన‌ప్పుడు ఆంధ్ర‌జ్యోతి వీక్లీ క‌వ‌ర్ పేజీ ఫొటోని ఫ్రేమ్ క‌ట్టి చాలా కాలం దాచుకున్నాను. అంత‌టి క‌వి, మ‌నిషి మ‌ళ్లీ పుడ‌తారా? మ‌ర‌ణ‌మే లేని వాళ్లు మ‌ళ్లీ ఎందుకు పుడ‌తారు. మ‌న ప్ర‌పంచాన్ని రంగుల మ‌యం చేయ‌డానికి శ్రీ‌శ్రీ బ్లాక్ అండ్ వైట్‌లో జీవించి వెళ్లిపోయారు.

(ఏప్రిల్ 30 శ్రీ‌శ్రీ పుట్టిన రోజు)