‘రిషితేశ్వరి’ కేసులో పోక్సో చట్టం వర్తిస్తుంది: హైకోర్టు కీలక తీర్పు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొని, మేజర్‌గా అయిన తర్వాత ఆమె ఆ లైంగిక వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. ఆమె మేజర్‌ అన్న కారణంతో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానాలు తిరస్కరించడానికి వీల్లేదంది. కాలేజీలో చేరిన నాటికి ఆమె మైనర్‌ అని, అప్పటి నుంచి ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందన్నారు. 18 సంవత్సరాల లోపు వారు పోక్సో చట్ట పరిధిలోకి వస్తారని, పోలీసుల చార్జిషీట్‌ ప్రకారం నిందితులు మృతురాలి పట్ల లైంగిక వాంఛతో వ్యవహరించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్‌గా ఉన్నప్పుడు రిషితేశ్వరిని నిందితులు లైంగికంగా వేధించడం నేరమవుతుందని పేర్కొన్నారు. అందువల్ల మరోసారి చార్జీషీట్‌ను పరిగణనలోనికి తీసుకొని 6 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు ప్రభుత్వం

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్‌ చదువుతూ ఉండేది. సీనియర్ల లైంగిక వేధింపులు తాళలేక 2015 జూలైలో ఆత్మహత్య చేసుకుంది. రిషితేశ్వరి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దుంప హనీషా నాగలక్ష్మీ, జయచరణ్, నరాల శ్రీనివాస్‌లను ప్రధాన నిందితులుగా చేర్చారు. వారిపై చర్యలు తీసుకోవడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. అలాగే మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి వర్సిటీ వీసీ సాంబశివరావు, ప్రిన్సిపల్‌ బాబూరావులను కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మొదట వీసీ, ప్రిన్సిపాల్‌ను తొలగించారు. ఆ తర్వాత పోక్సో చట్టంతో పాటు ఐపీసీ, ఏపీ ర్యాగింగ్‌ చట్టాల కింద ఆ నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు పోక్సో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకునే నాటికి రిషితేశ్వరి మేజర్‌ అని, పోక్సో చట్టం కింద చార్జిషీట్‌ దాఖలు చేయడానికి వీల్లేదంటూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోక్సో చట్టం వర్తింపుపై ఉత్తర్వులు జారీ చేశారు.

పోక్సో చట్టం అంటే..?

18 ఏళ్ల లోపు బాలబాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు యూపీఏ సర్కార్‌ 2012 నవంబరు 14న (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌)- పోక్సోను రూపొందించింది. బాలికలను తాకకూడని చోట తాకినా, అసభ్యకరమైన సంకేతాలు చేస్తున్నా, ఆశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించినా, లైంగిక వేధింపులకు గురిచేసినా, అసభ్య పదజాలంతో మాట్లాడినా, ఈవ్‌టీజింగ్‌ చేసినా పోక్సో కింద కేసు నమోదు చేస్తారు. అత్యాచారయత్నం, అత్యాచారం, హత్య చేస్తే పోక్సో చట్టం ద్వారా జీవిత ఖైదు లేదా మరణదండన విధిస్తారు. నిందితులపై నాన్‌బెయిల్‌ వారెంట్లు జారీ చేయడంతో పాటు బెయిల్‌ ఇచ్చే అధికారాన్ని నేరుగా కోర్టులకే ఇచ్చారు.

బీజేపీ ప్రభుత్వం సవరణలు

పోక్సో అమలులోకి వచ్చిన ఏడేళ్ల తరువాత బీజేపీ ప్రభుత్వం చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవితఖైదును తొలగించి మరణశిక్షను విధించాలని సవరణ చేసింది. జీవితఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గాని జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. సత్వర న్యాయానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని, త్వరితగతిన విచారణ చేపట్టేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో తప్పనిసరిగా ఫోక్సో కోర్టు ఉండాలని సూచించింది. అలాగే 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించేలా ఆర్డినెన్స్‌ కూడా తీసుకొచ్చింది.

Show comments