iDreamPost
android-app
ios-app

రైతుల కోసమే.. విపక్షాలది దుష్ప్రచారం..

  • Published Dec 25, 2020 | 8:51 AM Updated Updated Dec 25, 2020 | 8:51 AM
రైతుల కోసమే.. విపక్షాలది దుష్ప్రచారం..

వ్యవసాయ చట్టాల ద్వారా దేశంలో రైతాంగానికి అనేక విధాలుగా ప్రయోజనం దక్కుతుందని ప్రధాన మంత్రి మోడీ పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలో ఆయన పాల్గొన్నారు. విపక్షాల మీద తీవ్రంగా మండిపడ్డారు. బ్రాండ్ ఇండియా రూపొందించే ప్రయత్నం చేస్తున్న తమకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. రాజకీయాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ, రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తాము దేశాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసమే శ్రమిస్తున్నామన్నారు. గతంలో రైతులను విస్మరించిన వాళ్లు ఇప్పుడు రైతుల కోసం మాట్లాడడం, ఉద్యమాలకు ఉసిగొల్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. టెక్నాలజీ సహాయంతో రైతులకు మరింత ప్రయోజనాలు ఖాయం అన్నారు. మార్పు మొదలయ్యిందని, దానిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కనీస మద్ధతు ధర , వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఢోకా లేదన్నారు. రైతులకు ఒప్పంద వ్యవసాయంలో ప్రస్తుతం దక్కుతున్న దాని కన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. వ్యవసాయ చట్టాల ద్వారా న్యాయపరమైన భద్రత కూడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం డెయిరీ రంగంలో కంపెనీలు నేరుగా పాలు కొనుగోలు చేయడం వల్ల రైతులకు లబ్ది జరుగుతోందన్నారు. పౌల్ట్రీ రంగంలో కూడా పెద్ద పెద్ద కంపెనీల మూలంగా ఉత్పత్తిదారులకు ప్రయోజనం వస్తుందని, వ్యవసాయదారులందరికీ అలాంటి ప్రయోజనాలు అనివార్యం అన్నారు.

రైతులకు తమ ప్రభుత్వం పలు పథకాలు తీసుకుందన్నారు. వాటి ద్వారా మారుమూల గ్రామాల్లో రైతులకు కూడా లబ్ది జరుగుతోందన్నారు. రైతుల భూములకు గ్యారంటీ కల్పించే చట్టాలు రూపొందించామన్నారు. రైతుల మీద కొందరు కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. ప్రతీ గ్రామంలో రైతుల భూములకు, స్వామిత్మా యోజనా సాయంతో భరోసా కల్పిస్తున్నామన్నారు. వాటి ద్వారా బ్యాంకులలో రుణాలకు అవకాశం వస్తుందన్నారు. టెక్నాలజీ సహాయంతో వస్తున్న మార్పులను కోట్ల మంది రైతులు ఆహ్వానిస్తున్నారని కానీ ఎన్నికల్లో ఓటమి పాలయిన కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మన వ్యవసాయ విధానం ఆధునీకరించాల్సి ఉందని, దానికి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా తాము ముందుకెళుతున్నామన్నారు.

రికార్డు స్థాయిలో రైతులకు మేలు చేస్తుంటే అడ్డుకోవడం తగదని విపక్షాలకు హితువు పలికారు. రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కొందరు రాజకీయ నేతలు మాత్రం రైతులను భ్రమల్లో పెడుతున్నారని, వారికి ప్రజాస్వామ్యం మీద కూడా విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. కనీస మద్ధతు ధరలకు ఢోకా లేదని చెప్పాం. రికార్డు స్థాయిలో ధరలు కల్పిస్తున్నాం అయినా రైతుల పేరుతో ఉద్యమం పేరుతో అడ్డుకుంటున్నారంటూ మోడీ వ్యాఖ్యానించారు. మోడీ ఎన్నడూ రైతుల కోసమే ఆలోచిస్తాడని తెలిపారు. రైతుల కోసం లక్ష కోట్ల ఖర్చు చేసి ఆన్ లైన్ లో సదుపాయాలు కల్పిస్తున్నాం అంటూ వివరించారు. సాధారణ రైతులు ఎక్కువగా లబ్ది పొందుతారని అభిప్రాయపడ్డారు. రైతు కు మా ప్రభుత్వం రెట్టింపు నిధులు కేటాయిస్తోందని, 2.5 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామన్నారు.