Idream media
Idream media
పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం (డిసెంబర్ 10) మధ్యాహ్నం భూమి పూజ చేశారు. ఎంతో అట్టహాసంగా చేయాలనుకున్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాడంబరంగా నిర్వహించింది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు ఆదేశాలు. కొత్తగా నిర్మాణం చేపట్టాలనుకున్న పార్లమెంట్ నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు సుప్రీం తుది తీర్పు వెలువడే వరకూ నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శంకుస్థాపన వరకు అనుమతి ఇచ్చింది. దీంతో నిరాడంబరంగా భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ సహా మొత్తం 200 మంది అతిథులు హాజరైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు.
1921లో పునాది రాయి..
ప్రస్తుత పార్లమెంట్ భవనాన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ డిజైన్ చేశారు. నిర్మాణానికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. అప్పట్లో దీనికి 83 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. దీనిని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం వృత్తాకారంలో 560 అడుగుల వ్యాసార్థంతో ఉంటుంది. దీని పై కప్పుకు 257 గ్రానైట్ స్తంభాలను సపోర్టుగా నిలబెట్టారు. కమిటీ హాళ్లు 3 ఉన్నాయి. పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌ను ఎర్రటి శాండ్‌స్టోన్‌తో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసివేసేలా ఇనుప గ్రిల్స్, ఇనుప తలుపులతో నిర్మించారు. దీనికి మొత్తం 12 గేట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భవనం వందేళ్లుగా సేవలందిస్తోంది. నిర్మాణం జరిగి వందేళ్లు దాటిన క్రమంలో కొత్త భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది.
కొత్త భవనం విశిష్ఠతలు..
శంకుస్థాపన చేసిన ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్గత అలంకరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విశాలమైన సెంట్రల్ కాన్‌స్టిట్యూషన్ గ్యాలరీని సామాన్య ప్రజలు కూడా సందర్శించే అవకాశం కల్పించనున్నారు. అయితీ ఇవన్నీ ఏ అడ్డంకులూ లేకుండా జరగాలంటే సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.