Idream media
Idream media
ప్లేటో, సోక్రటీసు శిష్యుడు. గురువుని అన్యాయంగా చంపేసిన తరువాత దేశం వదిలి వెళ్లాడు. ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ ఏథెన్స్ చేరి అకాడమీ స్థాపించాడు. రాజకీయాల్లోకి తెలివైన వాళ్లు, మేధావులు వస్తేనే దేశం బాగుపడుతుందని నమ్మాడు. 2400 ఏళ్ల తర్వాత కూడా ఇది జరగలేదు. తెలివైన వాళ్లు ప్రభుత్వంలో ఉండకపోతే మూర్ఖులు తెలివైన వాళ్లని పాలిస్తారని చెప్పాడు. ప్రపంచమంతా ఇదే జరుగుతోంది. ప్లేటో ఏం చెప్పాడంటే…
1.నిజం మాట్లాడేవాన్ని ప్రపంచమంతా ద్వేషిస్తుంది
రెండురెళ్లు నాలుగు అంటే గుండ్రాళ్లు విసురుతారని శ్రీశ్రీ అన్నాడు. రెండురెళ్లు ఆరు అంటేనే సేఫ్. ఒకరోజంతా నిజాలే మాట్లాడ్డానికి ప్రయత్నించండి. సాయంత్రానికి శత్రువుల సంఖ్య లెక్క పెట్టుకోండి.
2.చెప్పాల్సిన విషయం వుంటేనే తెలివైన వాళ్లు మాట్లాడ్తారు
ఏదో ఒకటి చెప్పడానికి మూర్ఖులు మాట్లాడ్తారు.
టీవీ ఆఫీస్ , పత్రికా కార్యాలయాలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు సాయంత్రం పూట నిర్వహించే గ్రూప్ మీటింగ్‌ల్ని పరిశీలించండి. ప్లేటోకి దండం పెడ్తారు.
3.మీ పిల్లలు మీ దారిలో నడవాలని కోరద్దు
మీరిద్దరూ రెండు వేర్వేరు కాలానికి సంబంధించిన వాళ్లు.
టెన్త్ ఫస్ట్ వచ్చిన నేను పెద్దల మాటలు విని MPC చేరాను. లెక్కలు అర్థం కాక ఫెయిల్ అయితే పాలిటెక్నిక్ చేరమన్నారు. మిషన్లు భయపెడితే BCom చేరాను. అది ఎందుకు చదివానో నాకే తెలియదు. చివరికి తెలుగులో MA చేశాను. ఇదొక్కటే జీవితంలో ఇష్టంగా చదివిన చదువు.
40 ఏళ్లుగా ఇంజనీరింగ్, మెడిసిన్ పిచ్చి పట్టి , చేయని నేరానికి పిల్లలు నారాయణ, చైతన్య జైళ్లలో మగ్గిపోతున్నారు. 24 శతాబ్దాల క్రితమే ఈ ప్రమాదాన్ని ప్లేటో గుర్తించాడు.
4.జీవితంలో అతిపెద్ద గెలుపు మనల్ని మనం గెలవడమే.
గెలుపు సాధించడం ఎలా అని ఎన్ని పుస్తకాలు చదివినా ఇది అర్థం కాదు. ఇతరుల కంటే బాగా జీవించడమే గెలుపు అనుకుంటాం. మనకి నచ్చినట్టు మనసుని జయించడమే అతిపెద్ద గెలుపు.
5.ఆచరణకి పనికిరాని జ్ఞానం
విత్తు నాటని నేల వంటిది.
అందరూ సమానులే అని మొదలైన సిద్ధాంతాలు , కొందరు మాత్రమే సమానులుగా ముగియడానికి ఇదే కారణం. అరిషడ్వర్గాలని జయించామని భావించే స్వాములు అహాన్ని, అధికారాన్ని జయించలేరు. వాళ్లు జ్ఞానవంతులే. ఆచరణలో శూన్యవంతులు.
6.గుహనుంచి బయటకొచ్చిన వాళ్లకే నక్షత్రాలు కనిపిస్తాయి
ఎవరి గుహలో వాళ్లు జీవిస్తున్న కాలం ఇది. నక్షత్రాలు ఉంటాయని కూడా తెలియని జనరేషన్‌లు వస్తున్నాయి. మన గురించి మనం సీరియస్‌గా ఆలోచిస్తే ఎక్కువ భాగం మనం గుహల్లోనే గడిపామని అర్థమవుతుంది.
7.పిల్లలు చీకటికి భయపడితే పెద్దవాళ్లు వెలుగుకి భయపడతారు
జ్ఞానం, నిజాయితీ, సత్యం, ధర్మం ఇలా వెలుగుని దేనితోనైనా పోల్చొచ్చు. ఇదొక్కమాట అర్థం కావాలంటే ఒక జీవిత కాలం అవసరం.
8.దేశం కోసం పాలకులు అబద్ధాలు చెప్పినా తప్పులేదు
మన నాయకులు పూర్తిగా రివర్స్. పదవుల కోసం ఎన్నైనా చెబుతారు.
9.ప్రేమలో వుంటే
ప్రతి ఒక్కరికి కవిత్వం వస్తుంది.
ప్లాష్ బ్యాక్‌లోకి వెళితే ఈ వాక్యాలు అర్థమవుతాయి.
10.చెడ్డ లక్ష్యం వుంటే జ్ఞానం అతి ప్రమాదకారి
కరోనా టైంలో దోచేసిన డాక్టర్లు, మందుల కంపెనీలు, బ్యాంకులకి కోట్లు ఎగ్గొట్లే వాళ్లంతా ఈ కేటగిరి.
Also Read:సోక్రటీస్ చెప్పిన జీవిత సూత్రాలు