iDreamPost
iDreamPost
ప్లాస్టిక్.. ఈ మాట, సదరు వస్తువులు వినియోగించుకునే వారికి సౌలభ్యంగానే ఉంటుంది కానీ పర్యావరణ నిపుణులను మాత్రం ఉలిక్కిపడేలా చేస్తుంది. ప్లాస్టిక్ వస్తువును వినియోగించడం కారణంగా ఏర్పడే నష్టం ఇప్పటికిప్పుడు తెలియకపోవడమే దాని విసృత వినియోగాన్ని పెంచుతోందన్న అభిప్రాయం కూడా ఉంది. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ వినియోగంలో వచ్చిన మార్పు అతి తక్కువనే చెప్పాలి. ఉదయం లేచింది మొదలు పళ్ళుతోముకు బ్రష్‌ల దగ్గర ప్రారంభిస్తే అతి భద్రంగా దాచుకునే ఏటీయం కార్డు వరకు ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. వీటిని వినియోగించేటప్పుడు దీని ద్వారా ఏర్పడే ముప్పుకంటే, ఇది లేకపోతే ఏం ఉపయోగించుకోవాలో? అన్న సందేహమే పెద్దగా కన్పిస్తుంది మనకు.
మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్న ప్లాస్టిక్ కారణంగా సమస్త జీవరాశితో తులతూగే భూమితో పాటు పంచభూతాలు కలుషితమైపోతున్నాయని ఎన్నో ఏళ్ళ క్రితమే గుర్తించారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలు తమకు తాముగానే నియంత్రణ విధించుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు యుద్దప్రాతిపదికనే ప్రత్నాలు ప్రారంభించాయి. కానీ మనదేశంలో మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ ఫలప్రదంగా అమలు చేస్తున్న దాఖలాలైతే కన్పించడం లేదు.
ఎప్పుడో నిషేధించిన అతి పల్చటి క్యారీ బ్యాగ్‌లు ఇప్పటిక్కూడా పల్లెల్లో అందుబాటులో ఉండడాన్నే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉన్న భారతదేశం ఆ స్థాయికి వెళ్ళడానికి ఇక్కడున్న 138 కోట్ల జనాభాయే కారణం. ఇక్కడి జనాభా రోజువారీ కార్యకలాపాల నేపథ్యంలో రోజూ దాదాపు 26వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పోగు చేస్తున్నారని అంచనా గట్టారు. అందులో దాదాపు పదివేల టన్నుల వ్యర్ధాలు సేకరించకుండా అలాగే వదిలేస్తున్నారట. అంటే ఆ పదివేల టన్నులు, నేలమీద, నీటిలో, లేదా అగ్గిలో కాలుతూ ఉంటాయన్నమాట. ఇలా ఏ రూపంలో ఉన్నాగానీ పర్యావరణంపై అది అత్యంత తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుందనడంలో సందేహమే లేదు. తద్వారా అంతిమంగా పర్యావరణంలోని అన్ని జీవరాశులతో పాటు మనిషి ఆరోగ్యాన్ని కూడా ఈ ప్లాస్టిక్ తినేస్తుంటుంది.
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పాటించడంలో రాష్ట్రాల స్థాయిలోనే నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇక వ్యక్తిస్థాయిలో అది ఎంత పకడ్భంధీగా అమలవుతుందో బేరీజు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏ గ్రామానికి వెళ్ళాలన్నా ఆ గ్రామానికి ద్వారపాలకుల మాదిరిగా డంపింగ్‌యార్డులే దర్శనమిస్తుంటాయి. అక్కడ కూడా అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్ధాలే ఉంటాయి. పదేళ్ళ క్రితం ఇప్పుడున్న స్థాయిలో అవి ఉండవు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద కొండలను తలపిస్తుంటాయి. ప్లాస్టిక్ పట్ల ప్రస్తుతం చూపుతున్న నిర్లక్ష్యం ఇదే రీతిలో కొనసాగితే అతి కొద్ది సంవత్సరాల్లో సదరు ప్లాస్టిక్ వ్యర్ధాల కొండలకు అక్కడి స్థలం సరిపోక మన ఇళ్ళ మధ్య వరకు కూడా పోగైపోతాయంటున్నారు నిపుణులు. అభివృద్ధిలో ముందున్న అనేక దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యక్తి సగటు ప్లాస్టిక్ వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ మనం కూడా మేలుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నామంటున్నారు.
పునర్‌వినియోగంపై కానరాని శ్రద్ధ..
టన్నుల కొద్దీ పోగైపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిల్ చేసి పునర్‌వినియోగించడంపై తీవ్రస్థాయిలోనే నిర్లక్ష్యం కన్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత ప్రయోగాలు సాగుతున్నాయి. అలాగే పలు దేశాలు విజయవంతమవుతున్నాయి కూడా. ప్లాస్టిక్ వేస్టేజ్‌ను భౌతికంగా మార్పులు చేయడం ద్వారా రోడ్ల నిర్మాణంలో వినియోగించడం, ఫుట్‌పాత్ టైల్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్‌తో తయారు చేసిన టైల్స్ వాడకం, విద్యుత్, ఆయిల్ వంటి ఇంధనాలను తయారు చేసేందుకు వినియోగించడం తదితర విధాలుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగానే దృష్టి పెడుతున్నారు. తద్వారా ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు, రీ సైకిల్ విధానంలో వాడడం ద్వారా ఆయా దేశాలు పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇలా ఆయా దేశాల్లో విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు గతంలో కూడా పలువురు ప్రయత్నించినప్పటికీ ఆశావహ ఫలితాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే ప్రభుత్వ స్థాయిలో ఈ దిశగా దృష్టి పెడితే ఫలితాలు విజయవంతమవుతాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పర్యావరణానికి పెనుముప్పుగా తయారవుతున్న ప్లాస్టిక్ నుంచి విముక్తి కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాలు, నగరాల్లో ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వాడకం తర్వాత అవి ఎక్కడకు చేరుతున్నాయనేది అధిక వర్షాలు కురుసినప్పుడు వెల్లడవుతోంది. వర్షపునీరు పోయే మార్గం లేక, అది వరదగా మారి నివాసాలను ముంచెత్తుతోంది. దీనికి మన నిర్లక్ష్యమే కారణం తప్పా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని నిందించలేము.