iDreamPost
iDreamPost
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వం తీసుకుంటున్న దాదాపు అన్నీ నిర్ణయాలపైనా ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేస్తునే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ లెక్కల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా 75 కేసులు నమోదయ్యాయి. తాజాగా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ఏర్పాటుపైన కూడా పిటీషన్ పడింది. ప్రకాశంజిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేశాడు. సరే పిటీషన్ దాఖలైంది కాబట్టి ఎస్ఇబి ఏర్పాటుపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
నిజానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేయటం లేకపోతే విలీనం చేయటమన్నది పూర్తిగా ప్రభుత్వం ఇష్టం. పరిపాలనా సౌలభ్యాన్ని, అదనపు భారాన్ని, సిబ్బంది కొరత తదితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎవరైనా ఉద్యోగులు నష్టపోతామాని అనుకుంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకుంటారు. తప్పదని అనుకుంటే ఉద్యోగులే కోర్టును ఆశ్రయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి.
ఎక్సైజ్ డిపార్టుమెంటును ప్రభుత్వం రెండుగా విడదీసి మద్యం, ఇసుక అక్రమ రవాణా, సారా తయారీ నియంత్రణ కోసమని ప్రభుత్వం ఎస్ఇబిని ఏర్పాటు చేసింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని 3152 మంది సిబ్బందిలో 2991 మంది ఇప్పటికే ఎస్ఇబిలో జాయిన్ అయిపోయారు. విచిత్రమేమిటంటే ఎక్సైజ్ శాఖను రెండుగా విభజించటానికి శాఖాపరంగా ఎవరి నుండి ఎటువంటి వ్యతిరేకతా ఎదురుకాలేదు. కానీ మధ్యలో పోలూరికి వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. చట్ట నిబంధనలను సవరించకుండా ఎస్ఇబి ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ పోలూరి పిటీషన్ వేయటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తున్నాయి. పేదలకు ఇళ్ళ పంపిణీ చేయాలన్నా, అమరావతిలో పేదలకు పట్టాలు ఇవ్వటాన్ని, మూడు రాజధానుల ప్రతిపాదన, స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టటం, డాక్టర్ సుధాకర్ వివాదం, మద్యం షాపులు తెరవటం ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేశాయి. ప్రభుత్వంపై దాఖలైన పటీషన్లు వేసిన వ్యక్తులను గమనిస్తే చాలామందిక టిడిపి సంబంధాలున్న విషయం బయటపడుతున్నాయి. కొన్ని కేసుల్లో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా కేసులు వేశారు. కేసులు ఎవరేసినా వాళ్ళ వెనుక టిడిపినే ఉందన్న విషయం అర్ధమవుతోంది.
పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి దూకుడును తట్టుకోలేకపోతున్న ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబునాయుడు తన మనుషులతో కోర్టులో కేసులు వేయిస్తున్నాడంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇపుడు దాఖలైన పిటీషన్ ను వ్యతిరేకిస్తు ఉద్యోగుల సమాఖ్య మరో కేసు వేసింది. పిటీషనర్ కు ప్రభుత్వ నిర్ణయంతో ఎటువంటి సంబంధం లేదని సమాఖ్య స్పష్టంగా చెప్పింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా అనుమానించింది. ఇటువంటి వాటిని అనుమతిస్తే ప్రభుత్వ వ్యతిరేకులంతా రాజకీయ ప్రయోజనాలకు కోర్టులను వేదికలు చేసుకుంటారంటూ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేయటం నూరుశాతం వాస్తవమే.