Idream media
Idream media
సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రతి లోగిళ్లు.. రంగవళ్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, ఆట, పాటలతో సందడిగా ఉంటాయి. నెల రోజుల ముందే పండగ వాతావరణం గ్రామాల్లో నెలకొని ఉంటుంది. పండగ మూడు రోజులు.. ఇక సందడే సందడి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉభయ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందేలు మరో ఎత్తు. కొన్నేళ్లుగా కోడి పందేలు నిర్వహించరాదంటూ న్యాయస్థానాలు, ప్రభుత్వం, అధికారులు ఆదేశాలు జారీ చేయడం, నిర్వహణపై తీవ్రమైన చర్చ.. ఆఖరుకు పందేలు జరగడం.. సర్వసాధారణంగా సాగుతోంది.
తాజాగా ఈ ఏడాది కూడా కోడి పందేలపై మునుపటి పరిస్థితే మొదలైంది. కోడి పందేలు, ఆ సమయంలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిలువరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి, తోగుమ్మి గ్రామాలకు చెందిన పలువురు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. తమ గ్రామ పరిసరాల్లో ప్రతి ఏడాది కోడి పందేలు జరుగుతున్నాయని, వాటితోపాటు అక్కడే అక్రమ మద్యం, జూదం, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. కోడి పందేలు నిర్వహించరాదని సుప్రీం, హైకోర్టుల ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కావడంలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులే కోళ్లను చూపుతూ పందేలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సారైనా కోడి పందేలు జరగకుండా ముందస్తుగా ఆదేశాలు జారీ చేయాలని ఆ వ్యాజ్యంలో కోరారు.
పశ్చిమ గోదావరి ప్రజలు కోర్టుకు వెళితే.. తూర్పు గోదావరిలో కోడి పందేలు జరగకుండా చూసే బాధ్యత ఆ జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ భుజానికెత్తుకున్నారు. సాంప్రదాయ సంక్రాంతి ముద్దు.. కోడి పందేలు వద్దు.. అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాల ఎస్పీలు, జేసీలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కోడి పందేలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, సాంప్రదాయ క్రీడలు ఆడేవారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రతి చోట.. కోడి పందేలపై నిషేధం ఉన్న విషయం వివరిస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని, మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కోడి పందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగే చోట.. ఈ నెల 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెక్షన్ 144 అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టులో వ్యాజ్యాలు, అధికారుల హడావుడి ప్రతి ఏడాది జరుగుతోంది. అయినా పండగ రోజుల్లో కోడి పందేలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది ఇదే తంతు ఉండడంతో.. ఈ ఏడాది కూడా పందేలు జరుగుతాయనే ధీమాతో పందెం రాయుళ్లు ఉన్నారు. సంక్రాంతి పందేలకు కోళ్లను ఏడాది నుంచే సిద్ధం చేస్తుంటారు. ఇక కత్తుల తయారీ, కత్తులు కట్టేవాళ్లు సిద్ధమవుతుంటారు. పండగకి కొన్ని రోజుల ముందు.. కోడి కత్తులను సీజ్ చేయడం, కేసులు నమోదు వంటివి జరుగుతుంటాయి. అయినా చివరికి కోడి పందెమే గెలుస్తోంది. మరి ఈ సారి అందుకు భిన్నంగా జరుగుతుందా..? చూడాలి.
Also Read : జగన్ ఢిల్లీ టూర్.. కేంద్రం మదిలో ఏముంది?