iDreamPost
android-app
ios-app

ఆ ఊర్లో ఫోన్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమి ఉండవు.. ఎందుకో తెలుసా??

  • Published Jun 05, 2022 | 8:00 PM Updated Updated Jun 05, 2022 | 8:00 PM
ఆ ఊర్లో ఫోన్, టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమి ఉండవు.. ఎందుకో తెలుసా??

ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్‌ ఉండాల్సిందే, ఇంట్లో టీవీ ఉండాల్సిందే. చాలా మంది ఇళ్లలో ఫోన్, టీవీ, హెడ్ ఫోన్స్, మైక్రోవేవ్స్, ఇలాంటివి చాలానే ఎలక్ట్రానిక్ పరికరాలు సర్వ సాధారణమైపోయాయి. అవి లేకపోతే పనులు జరగవు. అసలు మనకి చేతిలో ఫోన్ లేకపోతేనే ఏదో కోల్పోయాం అనే స్టేజిలో బతుకుతున్నాము. అలాంటిది ఫోన్, టీవీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో 150 మంది బతుకుతున్నారు అంటే నమ్మగలమా.

కానీ నమ్మాలి. అమెరికాలోని గ్రీన్ బ్యాంక్ అనే గ్రామం వర్జీనియాలో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది వరకు నివసిస్తుంటారు. వీరిలో ఎవరికీ మొబైల్ ఫోన్, టీవీలు ఉండవు. అసలు ఈ ఊర్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించటానికి పర్మిషన్ లేదు. టీవీలు, రేడియోలు, మొబైల్‌, ఐప్యాడ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, రిమోట్ కంట్రోల్ బొమ్మలు, మైక్రోవేవ్‌లు.. ఇలా రేడియో తరంగాలని పంపించే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఇక్కడ నిషేధించబడ్డాయి.

ఎందుకంటే.. ఈ గ్రామంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది. దీనిని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ అంటారు. ఈ టెలిస్కోప్ ఎంత పెద్దది అంటే ఒక పెద్ద ఫుట్‌బాల్ మైదానం దీని డిష్‌ లో సరిపోతుంది. అయితే ఈ భారీ టెలిస్కోప్ యూఎస్ నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ వారికి సంబంధించింది. దీనిని 1958లోనే స్థాపించారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే తరంగాలపై ఇక్కడ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రకరకాల టెలిస్కోప్‌లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే తరంగాలు అంతరిక్షం నుండి వచ్చే తరంగాలను ప్రభావితం చేస్తాయని ఇక్కడ తరంగాలని ప్రసరించే అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకి నిషేధించారు. అలాగే ఈ ఊర్లోకి కేవలం డీజిల్ వెహికల్స్ ని మాత్రమే అనుమతిస్తారు.