వరుసగా 16వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

  • Published - 04:16 AM, Mon - 22 June 20
వరుసగా 16వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

పెట్రోల్ ధరలు ప్రతిరోజు వాహనదారులకు షాకిస్తూనే ఉన్నాయి. చమురు సంస్థలు వరుసగా 16వ రోజు కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచడం వల్ల డీజల్‌పై 58 పైసలు, పెట్రోల్‌పై 33 పైసల చొప్పున ధరలు పెరిగాయి. దీంతో 16 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 8.36 పెరగగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 9.43 పెరిగింది.

కరోనా సంక్షోభం కారణంగా నష్టాల్లో మునిగిన చమురు ఉత్పత్తి సంస్థలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్ డీజిల్ ధరలను నిత్యం పెంచుతున్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పాతాళంలోకి జారుకున్నాయి. దాంతో కొన్ని రోజులపాటు చమురు ఉత్పత్తిని ఆయా సంస్థలు నిలిపివేశాయి. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చుకోవడానికి వినియోగదారులపై అదనపు ధరల భారం మోపుతున్నాయి.

ఈ ధరల భారం సామాన్యుడిపైనే అధికంగా పడుతుంది. కాబట్టి ఈ అధిక ధరలను అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పెట్రోల్ పై విధించే పన్నులు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి ధరలు తీసుకురావాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Show comments