iDreamPost
android-app
ios-app

అంతర్జాతీయ న్యాయస్థానానికి అమరావతి…!!

అంతర్జాతీయ న్యాయస్థానానికి అమరావతి…!!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వ్యవహారం ఖండాంతరాలకు చేరింది. రాజధాని విషయంలో జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. ఏపీ రాజధానిగా అమరాతినే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో యూఎస్‌కు చెందిన ఎన్నారై కావేటి శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అమరావతి కోసం జరగుతున్న ఉద్యమంలో సీరియస్‌నెస్‌ లేదని తాజా ఘటన నిరూపిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానాలను ఏవైనా రెండు దేశాలు మాత్రమే వారి మధ్య నెలకొన్న సమస్యలపై ఆశ్రయించే వీలుంది. వ్యక్తులు, సంస్తలు, కార్పొరేషన్‌లు, ఎన్జీవోలు, రాష్ట్రాలు ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం లేదు. అలాంటిది ఎన్నారై కావేటి శ్రీనివాస్‌ అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన దాఖలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. అమరావతిపై తెలుగు మీడియాలో ప్రచారం కోసమైతే శ్రీనివాస్‌ లక్ష్యం నెరవేరినట్లే కానీ అంతకు మించి ఏమీ ఆశించలేరు. అమరావతిపై అంతర్జాతీయ న్యాయస్థానం కూడా స్పందించిందంటూ.. ప్రజలు అనుకోవాలనేమో శ్రీనివాస్‌ కావేటి ఈ ప్లాన్‌ వేసుంటారని నిఫుణులు చెబుతున్నారు.

అమరావతిపై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణలు జరుగుతున్నాయి. హైకోర్టు తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రిం కోర్టును అమరావతి మద్ధతుదారులు ఆశ్రయించొచ్చు. అంత వరకూ అమరావతి అంశంపై న్యాయ పోరాటం చేయొచ్చు. సుప్రింలో ఇంకా అమరావతిపై పిటిషన్లు దాఖలు కాలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం వదలి అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడం అంటే ప్రచారం కోసం తప్పా మరో లక్ష్యం లేదని స్పష్టంగా చెప్పవచ్చు.