iDreamPost
android-app
ios-app

కుక్క‌ల కోసం సూప‌ర్ స్టోర్‌

కుక్క‌ల కోసం సూప‌ర్ స్టోర్‌

ఈ భూమి ప్ర‌త్యేకత ఏమంటే, ఎక్క‌డికెళ్లినా అది తొంద‌ర‌గా అల‌వాటై పోతుంది. కొద్ది రోజులు అమెరికా కొత్త‌గా వుంది కానీ, ఇప్పుడు అలవాటైపోయింది. జాతి, రంగు, భాష‌, సంస్కృతి వేర్వేరు అయినా మ‌నుషులంతా ఒక్క‌టే. మ‌ట్టి ఎక్క‌డైనా మ‌ట్టే. కానీ ఇది ఒప్పుకోడానికి అహం అడ్డొచ్చి మ‌నుషులు యుద్ధాలు చేసుకున్నారు. మ‌నిషి ఎక్కువ భ‌య‌ప‌డేది ఎర్ర‌రంగుకి, అత‌నికి ఇష్ట‌మైన రంగు కూడా అదే. అత‌ని చ‌రిత్రంతా నెత్తురుదారిలో నిర్మించుకున్న‌దే.

మా క‌మ్యూనిట‌లో వాకింగ్ చేస్తూ వుంటే రోజూ ఒక ముస‌ల‌మ్మ క‌నిపిస్తుంది. వ‌య‌సు 70పైనే, నారింజ రంగు జుట్టు, ప్యాంట్ ష‌ర్ట్ వేసుకుని ఇంటి ముందు కుర్చీలో వుంటుంది. గుడ్‌మార్నింగ్ అని ప‌ల‌క‌రిస్తుంది. ఇక్క‌డ ఒక‌రికొక‌రు ఎదురైతే , తెలియ‌క‌పోయినా ప‌ల‌క‌రిస్తారు. “మార్నింగ్ , హౌ ఆర్ యూ” అంటారు. మ‌న దేశంలో అప‌రిచితులు ప‌ల‌క‌రిస్తే అనుమానిస్తాం. లేదంటే పిచ్చోడ‌ని న‌వ్వుకుంటాం.

ఆవిడ‌ను చూస్తే మ‌న ప‌ల్లెల్లో ఒంట‌రిత‌నంతో బాధ‌ప‌డే ముస‌లాళ్లు గుర్తుకొస్తారు. ఏదో బాధ‌, ఆ క‌ళ్ల‌లో. ఎవ‌రికీ ప‌ట్ట‌ని ఒక వృథా వ‌స్తువులా క‌నిపిస్తుంది. మ‌న ముస‌లాళ్ల‌కి మాట్లాడ్డానికి పొరిగింటివాళ్లైనా వుంటారు. ఇక్క‌డ అదీ లేదు. మేమున్న చోట మాతో క‌లిపి ఐదు ఇళ్లున్నాయి. ఆ నాలుగిళ్ల‌లో ఎవ‌రున్నారో ఇంత వ‌ర‌కూ చూడ‌నేలేదు. మ‌న న‌గ‌రాల్లో కూడా ఇంచుమించు ఇదే క‌ల్చ‌ర్ వ‌చ్చేసింది.

మ‌నుషుల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చేస‌రికి కుక్క‌లు, పిల్లుల పెంప‌కం ఎక్కువ‌. ఈ మ‌ధ్య ఒక Pet Store కి వెళితే అది మ‌న రిల‌యన్స్ సూప‌ర్ మార్కెట్ కంటే పెద్ద‌గా వుంది. చైనా వాళ్లు దొరికిన‌వ‌న్నీ తిన్న‌ట్టు, వీళ్లు దొరికిన‌వ‌న్నీ పెంచుకుంటున్నారు. పాములు, కొండ‌చిలువ‌లు , కుక్క‌లు, పిల్లులు, తాబేళ్లు, ఎలుక‌లు, చిల‌క‌లు ఇవ‌న్నీ ఒక ఎత్తైతే, వాటికి అవ‌స‌ర‌మైన వ‌స్తువులు వేరే. పిల్ల‌లు ఆడుకోడానికి బొమ్మ‌లుంటాయ‌ని తెలుసు కానీ, కుక్క‌లు ఆడుకోడానికి అన్ని ర‌కాల బొమ్మ‌లుంటాయ‌ని ఫ‌స్ట్ టైం చూశాను. కుక్క‌లు నిద్ర‌పోడానికి ర‌క‌ర‌కాల బెడ్స్ , అవి వుండ‌డానికి చిన్న ఇండ్లు , షికారు తీసుకెళ్ల‌డానికి ట్రోలీ బ‌ళ్లు , ర‌క‌ర‌కాల బెల్టులు.

100 డాల‌ర్లు క‌ట్టి మ‌న వివ‌రాల‌న్నీ ఇస్తే పిల్లి కూన‌ల్ని ద‌త్త‌త‌కి ఇస్తారు. ఈ స్టోర్‌లో Pet Hospitalతో పాటు సెలూన్ కూడా వుంది. క‌టింగ్ అన‌కుండా గ్రూమింగ్ అనాల‌ట‌. మ‌నం కోరిన‌ట్టు క‌టింగ్ చేసి , గోళ్లు శుభ్రం చేసి, స్నానం చేయించి ఇస్తారు. ర‌క‌ర‌కాల కుక్క‌లు బుద్ధిగా హెయిర్ డ్రెస్ చేయించుకుంటున్నాయి. అవి క‌ద‌ల‌కుండా ర‌క్క‌కుండా ప్ర‌త్యేక‌మైన ఏర్పాటు వుంది. ఫీజు 35 డాల‌ర్లు. అంటే 2500 రూపాయ‌లు. కుక్క‌ల్ని అంతా బాగా చూసుకుంటున్నందుకు సంతోషించాలో ఆ మాత్రం డ‌బ్బుల‌కి మ‌నూర్లో ముస‌లాళ్లు నెలంతా ఎదురు చూస్తార‌ని చెప్పుకోడానికి బాధ‌ప‌డాలో అర్థం కాలేదు.

మా క‌మ్యూనిటీలో కుక్క‌ల కోసం ఒక పార్కు కూడా వుంది. వాటిని షికారు తీసుకెళితే షిట్‌ని ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్లో ఎత్తి అక్క‌డున్న ప్ర‌త్యేక డ‌స్ట్‌బిన్‌లో వేయాలి.

వ‌చ్చిన కొత్త‌లో ప్ర‌తి దాన్ని రూపాయిల్లోకి మార్చుకుని భ‌య‌ప‌డేవాన్ని. స‌మోసా ఒక డాల‌ర్ అంటే , వెంట‌నే 75 రూపాయ‌లు క‌నప‌డి అది చేదుగా వుండేది. క‌రివేపాకు నాలుగు రెమ్మ‌లు డాల‌రు. మ‌న ఊర్లో మోపులు మోపులు వ‌స్తాయి. మైండ్‌లోంచి డాల‌ర్‌ని రూపాయిలోకి మార్చే కాలిక్యులేట‌ర్‌ని Delete చేయ‌మ‌ని మా అబ్బాయి చెప్పాడు. ఆ ప‌ని చేయ‌క‌పోతే ప్ర‌శాంతంగా ఉండ‌డం క‌ష్ట‌మ‌న్నాడు. నా తెలివి త‌క్కువ కాక‌పోతే ఆదాయం డాల‌ర్ల‌లో వుంటే, ఖ‌ర్చు కూడా డాల‌ర్లే క‌దా.

అప్ప‌టి నుంచి ఇండియ‌న్ షాప్ ప‌టేల్ బ్ర‌ద‌ర్స్‌కి వెళితే రేట్లు చూడ‌డం మానేశా. లేక‌పోతే 400 గ్రాముల మిక్స‌ర్‌కి 300 రూపాయ‌లు పెట్టాలంటే ప్రాణం ఒప్పుతుందా?

ఒక సినిమాలో వెన్నెల కిషోర్ సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్‌. ఉద్యోగం పోతే భార్య‌కి , అత్త‌కి చెప్ప‌కుండా Job కి అని చెప్పి బ‌య‌ల్దేరి ఒక మ‌ట‌న్ కొట్టులో ప‌నిచేస్తూ వుంటాడు. ఇదో కామెడీ సీన్‌.

ఇక్క‌డ Meat Foods షాప్‌లో మ‌న తెలుగు కుర్రాడు ప‌నిచేస్తూ క‌నిపించాడు. మ‌ట‌న్‌ని మిష‌న్లు క‌ట్ చేస్తాయి. చేత్తో కొట్టే ప‌నిలేదు. ప‌ని ఒక‌టే. అక్క‌డ డ‌బ్బులు రావు కాబ‌ట్టి వెన్నెల కిషోర్‌ని భార్య‌, అత్త అవ‌మానిస్తారు. ఇక్క‌డ డ‌బ్బులొస్తాయి కాబ‌ట్టి, అత‌నికి సంబంధించిన వాళ్లు ఇండియాలో మా వాడు అమెరికాలో వున్నాడ‌ని గ‌ర్వంగా చెప్పుకుంటారు. గౌర‌వం డ‌బ్బుకే కానీ, ప‌నికి కాదు.

ఈ మ‌ధ్య అప్నా బ‌జార్‌కి వెళితే అక్క‌డ తెలుగు మాట్లాడే వాళ్లు చాలా మంది క‌నిపించారు. ఒక‌డు ఫోన్‌లో “క‌న్ఫ్యూజ్ చేయ‌కు. బెండ‌కాయ‌లు, బీర‌కాయ‌లు, వంకాయ‌లు అన్నీ వున్నాయి. అన్నీ కావాలా? ఏదో ఒక‌టి తేవాలో చెప్పు, ఎంత Quantites కావాల్లో చెప్పు” అంటున్నాడు. కానీ అవ‌త‌ల ఆవిడ వాన్ని తిక‌మ‌క పెడుతూనే వుంది. ప్ర‌పంచంలో ఎక్క‌డికెళ్లినా తెలుగు కామెడీ ఆడియో వినిపిస్తూనే వుంటుంది.