iDreamPost
android-app
ios-app

కోనసీమలో ఉన్న తమిళ ఊరు తెలుసా..?

  • Published Sep 29, 2021 | 11:53 AM Updated Updated Sep 29, 2021 | 11:53 AM
కోనసీమలో  ఉన్న తమిళ ఊరు తెలుసా..?

‘‘పేరూరు’’ ఇది ఒక అచ్చతెలుగు పల్లెటూరు. వినడానికి తెలుగు ఊరులా ఉన్నా… నామాంత్రం మాత్రం తమిళనాడు నుంచి వచ్చిందే. నిజమే ఈ తమిళ గ్రామం ఉన్నది పచ్చిని కోనసీమలోనే. అమలాపురాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. తమిళ చరిత్రకే కాదు.. కవులు.. రచయితలకు కథా శిల్పం. ఎన్నెన్నో అందాలు ఆరబోసుకున్న ఒక ‘పిల్ల’టూరు. అమలాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరు పట్టణం విస్తరరించడంతో దాదాపుగా పట్టణంలో అంతర్భాగం అయిపోయింది.

స్వాతంత్య్రానికి పూర్వమే ఏర్పడిన ఈ గ్రామం తంజావూరు జిల్లా కుంభకోణము వద్ద ఉన్న వనంగిమాన్‌ అనే గ్రామం నుంచి వలస వచ్చిన ద్రవిడలకు ఆవాసమైంది. తొలుత ఈ గ్రామాన్ని ‘‘పెరియవూరు’’ అని పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా పేరూరుగా మారిందని స్థానికులు చెబుతుంటారు. వసల వచ్చిన ద్రవిడలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని స్థానికులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. వీరిని కోనసీమ ద్రావిడులు అని పిలుస్తారు. అప్పట్లో వడమలలో ఏడు గోత్రాలు, బృహచ్చరణలో అయిదు గోత్రాలు గల 15 కుటుంబాలు తరలివచ్చాయని ఇక్కడ చరిత్ర.

మొట్టమొదట వీరు కోనసీమలోని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామములో స్థిరపడ్డారు. కాని అక్కడ రాజుల మధ్య విబేధాల వల్ల ఆ పరిస్థితులకు తట్టుకోలేక ఒక రాజును అభ్యర్థించి ఒక స్థలాన్ని పొందారు. అదే పేరూరు. ఇక్కడి కుటుంబాలే కాల క్రమంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, గంజాం జిల్లాలకు వ్యాపించినవి. వారిని ఆయా ప్రాంతాల్లో పేరూరు ద్రావిడులని పిలుస్తున్నారు. ‘ఏడు శతాబ్ధాల క్రితమే మా పూర్వీకులు ఇక్కడకు వచ్చారని చెబుతారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని ఏలిన రాజరాజ చోళ్లు మా వారిని అవమానించడంతో వలసవచ్చినట్టు పెద్దవారు చెబుతారు’ అని పేరి శ్రీనివాస్‌ తెలిపారు.

Also Read : కింగ్‌మేకర్‌ రాయవరం మునసబు గురించి తెలుసా..?

శాస్త్ర ప్రజ్ఞ అధికం..

పేరూరు ద్రవిడలు మంత్రశాస్త్రంలో ప్రజ్ఞావంతులు. అంతర్వేది నృసింహస్వామి చక్రం ఒకసారి సముద్రములో పడిపోగా వీరు తమ మంత్రశక్తితో గట్టుకు చేర్చారని ఆలయచరిత్రలో పొందుపరిచారు. వైష్ణవ సంప్రదాయము గల ఈ ఆలయంలో పేరూరు ద్రావిడులకు కృతజ్ఞతా పూర్వక విశిష్ట స్థానం ఏర్పాటు చేశారు. అంతర్వేదిలో మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు జరిగే చక్రస్నానానికి పేరూరు ద్రవిడలు స్వామివారి విగ్రహాన్ని సముద్రం వద్దకు తీసుకుని వస్తారు. ఈ గ్రామంలో ఉన్న లక్ష్మీ నర్శింహస్మామి ఆలయానికి విశిష్ఠమైన గుర్తింపు ఉంది. ద్రవిడ బ్రాహ్మాణులు అధికంగా ఉండే అగ్రహారం అచ్చతెలుగు పల్లెటూరు.

ఇప్పటికీ పాతకాలం నాటి ఆచార్య వ్యవహారాలు పాటిస్తుంటారు. విశాలమైన రోడ్లు… రోడ్లకు ఇంటికీ మధ్య ఖాళీ స్థలం.. ఆపై కోనసీమ శైలిలో ఉండే పెంకుటిళ్లు. ఇళ్లకు ఉండే ఎత్తు అరుగులు.. సాయంత్రం అయితే పెద్దవారి ముచ్చట్లతో అరుగులు నిండిపోతాయి. ఇళ్ల మధ్య ఉండే కొబ్బరి చెట్లు వీటి అందాలను రెట్టింపు చేస్తాయి. కొత్తగా వచ్చే పర్యాటకులు ఎవరైనా కోనసీమ పల్లెలను చూడాలంటే పేరూరు ఒకసారి రావాల్సిందే. ఈ గ్రామంలో కొబ్బరి కురిడీ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఉత్తరాధి రాష్ట్రాలకు టన్నుల కొద్దీ కురిడీ ఎగుమతి అవుతుంది.

Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?