iDreamPost
android-app
ios-app

ఇకపై గోవాలో.. అంత ఈజీ కాదు

ఇకపై గోవాలో.. అంత ఈజీ కాదు

బహుశా ఇప్పటిలాగా ఇకపై గోవాలో సినిమా షూటింగులకు అనుమతులు లభించడం అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఇకమీదట ఎవరైనా గోవా రాష్ట్రంలో సినిమాలను చిత్రీకరించాలనుకుంటే వారి సినిమా తాలూకు స్క్రిప్ట్ ని అక్కడి అధికారులకు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది. ఆ సినిమా స్క్రిప్ట్ చూసి సదరు అధికారులు ఒకే అంటేనే అక్కడ సినిమా చిత్రీకరణకు అనుమతులు లభిస్తాయి.

సంవత్సరం పొడవునా నిత్యం దేశ, విదేశీ పర్యాటకులతో కళకళలాడుతూ, విదేశీ పర్యాటకులకు మనదేశంలో మొదటి గమ్యస్థానంగా ఉన్న గోవా రాష్ట్రం కేవలం పర్యాటక రంగం ద్వారనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇలాంటి సమయంలో పూర్తిగా పర్యాటక రంగం మీదనే ఆధారపడిన గోవా లాంటి రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం సినిమా షూటింగుల విషయంలో ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న ఈ నిబంధనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న చాలా సినిమాల్లో ఈ ప్రాంతాన్ని మారక ద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చూపిస్తున్నారని, అలా చూపించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలీవూడ్ లో తెరకెక్కే చాలా సినిమాలలో గోవాని మారక ద్రవ్యాలకు, మత్తు పదార్ధాలకు కేంద్రం లాగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన మోహిత్ సూరి దర్శకత్వంలో ఆదిత్యా రాయ్ కపూర్, అనిల్ కపూర్, దిశా పాఠాని తదితరులు ‘మలంగ్’ సినిమాలో మారాక ద్రవ్యాలు తీసుకునేవారికి గోవా ని ఒక స్వర్గధామంలా చూపించారని, ఇలా చూపించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట, ఇక్కడ నివసిస్తున్న ప్రజల అభిమానం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రభుత్వం అధీనంలో ఉండే “ఎంటర్తైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా” చిత్రీకరణ జరుపుకునే ప్రతి చిత్రం స్క్రిప్ట్ ని పూర్తిగా పరిశీలించనుంది. వారి నుండి అనుమతి పొందితేనే గోవా లో షూటింగ్ జరుపుకోవడానికి ఆ చిత్ర యూనిట్ కి అనుమతి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియచేశారు.

ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గోవాలో జరిగే షూటింగుల మీద ఏవిధంగా ప్రభావం చూపనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. ఈ నేపథ్యంలో దీనిపై సినీ పరిశ్రమ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి!!