iDreamPost
android-app
ios-app

పార్టీల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులకు ఫించన్ ఇవ్వాల్సిందే…

పార్టీల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులకు ఫించన్ ఇవ్వాల్సిందే…

స్వాతంత్య్ర సమరయోధులంటే ఎవర్రా అడిగాడు వెంగల్రావ్…

ఆమాత్రం తెలీదా నీకు… మన దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి జైళ్లలో మగ్గి, తమ జీవితాలను ధారబోసిన మహనీయులేరా స్వతంత్ర సమరయోధులంటే.. అదికూడా తెలీదట్రా నీకు… వెటకారంగా అన్నాడు అమాయకరావు..

నువ్ ఇంత అమాయకుడివి కాబట్టే నీకు అమాయకరావు అని పేరెట్టార్రా నీకు భుజాలెగరేస్తూ అన్నాడు వెంగల్రావ్..

అర్థమయ్యేలా చెప్పెహే ఇష్టమొచ్చినట్లు వాగకుండా.. స్వాతంత్య్ర సమరయోధులంటే వాళ్లేరా.. కావాలంటే నేను చదివిన పుస్తకాల్లో చూపిస్తా అంతేకాని ఇలా తెలిసి తెలీని మాటలు నాకు చెప్పి నన్ను అమాయకుడిని చేయాలనుకుంటే బాగోదురా నీకు… రుసరుసలాడాడు అమాయకరావు.

బుక్కుల్లో ఉన్నవన్నీ నిజాలు కాదురా.. నిజాలైనవన్నీ బుక్కుల్లో ఉండవురా… వేదాంతం వెలిబుచ్చాడు వెంగల్రావ్..

అంటే స్వాతంత్య్ర సమరయోధులంటే నేను పుస్తకాల్లో చదివిన వాళ్ళు కాదంటావా.. అయోమయంగా అడిగాడు అమాయకరావు..

ఒరే.. స్వాతంత్య్ర సమరయోధులంతా అప్పట్లో ఓ పార్టీ పెట్టుకుని ఆ పార్టీలోనే ఉండి పోరాటం చేసార్రా.. అలా ఏదొక రాజకీయ పార్టీలో ఉండి, ఈ కాలంలో కూడా ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని వారి తరపున పోరాటం చేసిన ప్రతీ వోడు స్వాతంత్య్రసమరయోధులే చిట్టీ .. ఈ మాత్రం తెలియకపోతే ఎట్లారా అమాయకుడా… గర్వంగా చెప్పాడు వెంగల్రావ్..

నీ… అప్పుడంటే మన దేశం విదేశీ దొరల పాలనలో ఉండేది.. వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మమ్మల్ని మేమే పాలించుకుంటాం అని తెల్లదొరలను దేశం నుండి వెళ్లగొట్టిన గొప్పోల్లే స్వాతంత్య్ర సమరయోధులు.. అందుకోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా వెనుకాడలేదు వాళ్ళు.. జైళ్లల్లో మగ్గిపోతూ కూడా దేశానికి స్వతంత్రం ఎలా తేవాలా అని ఆలోచన చేసేటోళ్లు.. అప్పట్లో ఒకే పార్టీ ఉండేది కాబట్టి కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేటోళ్లు.. కొందరి మధ్య మనస్పర్థలు ఉన్నా సర్దుకుపోయి మొత్తానికి స్వతంత్రం తెచ్చారు. వాళ్ళు నిజమైన దేశభక్తులు… తనకు తెలిసిన విషయాన్ని హితబోధ చేసాడు అమాయకరావు..

మళ్ళీ అమాయకరావు అనిపించుకున్నావ్ రా నువ్వు.. ఎందుకంటే దేశం తెల్లదొరల పాలన నుండి నల్లదొరల పాలనలోకి వెళ్ళిపోయింది.. అలాంటి నల్లదొరల నిరంకుశ పాలనకు ఎదురు నిలిచిన పార్టీ నేతలంతా స్వాతంత్య్ర సమరయోధులేరా.. కావాలంటే తెలుగుదేశం పార్టీ విప్ బుద్ధా వెంకన్న మాటలు వింటే నీకు నిజమైన స్వాతంత్య్ర సమరయోధులు ఎవరో ఈజీగా అర్ధం అవుతుంది.. అన్నాడు వెంగల్రావ్..

Read Also: మేమూ స్వతంత్ర సమరయోధులమే..

బుద్ధా వెంకన్న ఏమన్నారేటి ? అంత పర్టికులర్ గా నొక్కి చెబుతున్నావ్.. ఆసక్తిగా అడిగాడు అమాయకరావ్..

ఓరిని ఇంకా తెలీదా నీకు? జగన్ నిరంకుశ పాలనను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలంతా స్వాతంత్య్ర సమరయోధులే అని, మరో వందేళ్లపాటు చరిత్రలో నిలిచిపోయే పోరాటం టీడీపీ ఎమ్మెల్సీలు చేసారని చెప్పారు.. అప్పుడే నాకు అర్ధం అయింది. స్వాతంత్య్ర సమరయోధులంటే ఏదొక పార్టీలో ఉండి పాలక పక్షం చేసే అన్యాయాలు అక్రమాలను అడ్డుకోవడానికి పోరాటం చేసేవాళ్ళని.. ఇప్పటికైనా నీ మట్టి బుర్రకు అర్ధం అయిందా..జ్ఞానబోధ చేసాడు వెంగల్రావ్ నవ్వుతూ..

అదేంటి అప్పట్లో స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసారు. పోలీసు దెబ్బలు తిన్నారు.. జైళ్లల్లో మగ్గారు.. ఇప్పుడు స్వతంత్ర భారతంలో పార్టీల్లో ఉన్నోళ్లకి స్వతంత్రం లేకపోవడం ఏంటి? నీకేమైనా పిచ్చెక్కిందా ఇలా మాట్లాడుతున్నావ్.. జుట్టు పీక్కుంటు అడిగాడు అమాయకరావ్..

గద్గదే నువ్ తెలుసుకోవాల్సింది.. అప్పట్లో దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసారు.. కానీ ఇప్పట్లో అమరావతి రాజధాని కోసం తమ ఎమ్మెల్సీ పదవులను, హోదాను త్యాగం చేసారు. కాబట్టి వీళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులే నొక్కి వక్కాణించాడు వెంగల్రావ్. ఇప్పుడు అమరావతి కోసం వాళ్ళు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పట్లో పదవి పోగొట్టుకోవడం అంటే ప్రాణాలు పోగట్టుకోవడమే.. అది పరిగణలోకి తీసుకుంటే తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ నిరంకుశ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడిన ఎమ్మెల్సీలకు స్వతంత్ర సమరయోధుల ఫింఛన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఉద్యమం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నేడో రేపో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తాను వివరిస్తూ అమాయకరావు వైపు చూసాడు వెంగల్రావ్..

అప్పటికే వెంగల్రావ్ చెబుతున్న మాటలు విని కోమాలోకి వెళ్ళాడు అమాయకరావ్..