iDreamPost
iDreamPost
థియేటర్లు మూతబడి ప్రేక్షకులు డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ కు బాగా అలవాటు పడిపోయారు . ఇంట్లోకే అదనపు ఖర్చు లేకుండా వినోదం నడిచి రావడంతో ఆదరణ కూడా ఘనంగా ఉంది. అయితే స్టార్ హీరో హీరొయిన్లు నటించిన సినిమాలేవీ ఇప్పటిదాకా వెబ్ ద్వారా రిలీజ్ కాలేదు. అందుకే పెంగ్విన్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. అందులోనూ ఇప్పుడు లీడింగ్ లో ఉన్న కీర్తి సురేష్ ప్రధాన పాత్ర కావడంతో ఆడియన్స్ లో ఆసక్తి రేగింది. ట్రైలర్ వచ్చాక థ్రిల్లర్ జానర్ లవర్స్ కూడా ఎదురు చూడటం మొదలుపెట్టారు. మరి ఇంత హైప్ ని మూటగట్టుకున్న పెంగ్విన్ నమ్మకాన్ని నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం
కథ
చుట్టూ వందల ఎకరాల అటవీ ప్రాంతం ఉండే హిల్ స్టేషన్ లో ఉంటుంది రిధం(కీర్తి సురేష్). రెండో భర్త గౌతం(మదంపట్టి రంగరాజ్)తో జీవిస్తూ ఏడో నెల గర్భవతిగా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆరేళ్ళ క్రితం మొదటి భర్త రఘు(లింగా)ద్వారా కలిగిన అజయ్(మాస్టర్ అద్వైత్)ఏడాది వయసులోనే కిడ్నాప్ కు గురై దొరకుండా పోతాడు. ఆ కారణం వల్లే ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటారు. అనూహ్యంగా ఓ రోజు అజయ్ రిధంకు దొరుకుతాడు. కాని విచిత్రంగా ఉన్న వాడి ప్రవర్తన చూసి డాక్టర్ డేవిడ్(మాధి) సహాయం కోరుతుంది. దీని వెనుక పిల్లలను ఎత్తుకెళ్ళి దారుణంగా హత్య చేసే సైకో కిల్లర్ ఉన్నాడని అర్థమవుతుంది. ఒంటరిగా వేట మొదలుపెడుతుంది రిధం. తర్వాత ఏం జరిగిందన్నది ఇక్కడ చెప్పడం భావ్యం కాదు.
నటీనటులు
రెగ్యులర్ కమర్షియల్ హీరొయిన్ల తరహాలో హీరో వెంట పడుతూ పాటలు పాడే పాత్రలకు భిన్నంగా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఒప్పుకుంటున్న కీర్తి సురేష్ ధైర్యానికి మెచ్చుకోవాలి. మహానటిలో తానేంటో ఇప్పటికే ఋజువు చేసుకుని కొత్తగా చెప్పాల్సింది ఏమి లేకపోయినా ఇందులో తన పెర్ఫార్మన్స్ ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళే స్కోప్ కనిపించడంతో ఒప్పుకున్నట్టు సినిమా చూశాక అర్థమవుతుంది. తప్పిపోయిన కొడుకు కోసం ఆరాటపడుతూనే కడుపులో బిడ్డను మోస్తూ మానసికంగా నరకయాతన పడుతున్న వైనాన్ని తన హావభావాలతో చూపించిన తీరు నిజంగా అద్భుతం. ఇలాంటి రోల్ ఎవరూ చేయలేదు అని చెప్పలేం కాని ఇప్పటి జెనరేషన్లో మాత్రం తాను స్పెషల్ గా నిలిచే ఏ అవకాశాన్ని కీర్తి సురేష్ వదలడం లేదు. మహానటి తర్వాత పెంగ్విన్ ని మరో ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇందులో హీరో లేడు. కీర్తి సురేష్ భర్తలుగా నటించిన వాళ్ళలో అంతోఇంతో ప్రాధాన్యత దక్కింది లింగాకే. తన మీదే అనుమానం వచ్చేలా దర్శకుడు రాసుకున్న కథలోని ఉద్దేశాన్ని చక్కగా మోశాడు. సెకండ్ హస్బండ్ గా చేసిన మదంపట్టి రంగరాజ్ కు కొన్ని సీన్లు తప్ప ఏమంత స్పేస్ దొరకలేదు. సైకాలజీ డాక్టర్ గా నటించిన మాధి ముందు స్తబ్దుగా కనిపించినా రెండో సగంలో చెలరేగిపోయాడు. ఇన్స్ పెక్టర్ గా చేసిన తిలక్ రాంమోహన్, రిధం స్నేహితురాలిగా నటించిన నిత్య కృపా, చిన్న పాపగా చేసిన ఐశ్వర్య రమణి సహజంగా చేసుకుంటూ పోయారు. మాటలు లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్స్ తోనే నెట్టుకురావాల్సిన అజయ్ పాత్రలో మాస్టర్ అద్వైత్ గుర్తుండిపోతాడు.
డైరెక్టర్ అండ్ టీం
ఈ మధ్య కాలంలో అందులోనూ ముఖ్యంగా సౌత్ లో సైకో కిల్లర్ సినిమాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. మంచి స్క్రీన్ ప్లే ఉంటే జనం బాగా ఆదరిస్తారని ఇటీవలి కాలంలో రాక్షసుడు, హిట్ లాంటివి ఋజువు చేశాయి. పెంగ్విన్ కూడా అదే కోవలోకి వస్తుంది. కాని ఫలితం మాత్రం వాటి స్థాయిలో అనిపించదు. పెంగ్విన్ లో దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ చెప్పాలనుకున్న పాయింట్ లో మంచి డెప్త్ ఉంది. మొదటి నలభై నిముషాలు స్లోగా నడిపించినా ఆ తర్వాత కథనం వేగమందుకుని ఆసక్తిగా సాగుతుంది. కాని ఆ టెంపో ముందు నుంచి మైంటైన్ చేయక పోవడం వల్ల చాలా సేపు వరకు పెద్ద ఆసక్తిగా అనిపించదు. నలభై నిమిషాల ముందే విలన్ ని రివీల్ చేసి మళ్ళీ కాసేపటికే ఇంకో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్ దానికి తగ్గట్టు బలమైన స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోవడంతో కొంచెం థ్రిల్ కొంచెం డల్ తరహాలో పెంగ్విన్ సాగుతుంది.
ప్రేమ కథలు, ఫ్యాక్షనిజం సబ్జెక్ట్స్ ఒకదశలో బాగా రొటీన్ అయిన తరహాలో ఈ మధ్యకాలంలో సైకో కిల్లర్ స్టోరీస్ కూడా ఒక ఫార్ములాగా మారిపోతున్నాయి. కాసేపు సస్పెన్స్ కొనసాగించి ఆ తర్వాత ఊహించని పాత్రను ప్రతినాయకుడిగా చూపించి తిరిగి ప్రీ క్లైమాక్స్ లో అసలు హంతకుడిని బయటికి తీసుకురావడం అనేది కృష్ణ అవే కళ్ళు నుంచి విశ్వక్ సేన్ హిట్ దాకా ఎన్నోసార్లు చూసిందే. తన ఊహకు భిన్నంగా సాగినప్పుడు ఇలాంటి వాటిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈశ్వర్ కార్తిక్ దీన్ని దృష్టిలో పెట్టుకునే పెంగ్విన్ ని రాసుకున్నారు కాని సన్నివేశాల్లో బిగి లేకపోవడంతో పాటు ఎమోషన్స్ ని బలంగా రిజిస్టర్ చేయలన్న ఉద్దేశంతో తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు పెంగ్విన్ కి ప్రధమార్థంలో భారంగా మారాయి. అందులోనూ ఎంతసేపూ రిథం పాత్ర మీద సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు తప్పించి మిగిలిన వాటి మీద ఫోకస్ తగ్గించడంతో అవి అంతగా కనెక్ట్ కాలేకపోయాయి. సెకండ్ హాఫ్ లో ఒక అరగంట తనలోని అసలైన టెక్నీషియన్ ని చూపించిన ఈశ్వర్ కార్తిక్ దాన్ని తుదికంటా కొనసాగించి ఉంటే ఇదో బెస్ట్ థ్రిల్లర్ గా నిలిచిపోయేది. అయినప్పటికీ మరీ దారుణంగా అయితే నిరాశపరచలేదు.
సంతోష్ నారాయన్ సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ పనితనం బాగుంది. ఎక్కువ సౌండ్ వాడకుండా సినిమా థీమ్ కి తగ్గట్టు మంచి స్కోర్ ఇచ్చారు. రెండు పాటలు ఏ మాత్రం ఆసక్తి కలిగించేలా లేవు. పెట్టకపోయినా బాగుండేది. కార్తిక పళని ఛాయాగ్రహణం మాత్రం అద్భుతంగా ఉంది. హిల్ స్టేషన్ అందాలను బంధించిన తీరు, డార్క్ సీన్స్ లో లైటింగ్ స్కీంని వాడిన విధానం మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. అనిల్ క్రిష్ ఎడిటింగ్ కొంచెం మొహమాటపడకపోయి ఉంటే రెండు గంటల్లోపే ముగిసి బెటర్ గా అనిపించేది. కార్తీక్ సుబ్బరాజ్ అండ్ టీం నిర్మాణ విలువలు బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో ఎక్కువ ఖర్చు లేకుండా అతి తక్కువ రోజుల్లో నీట్ గా ముగించేశారు
ప్లస్ గా నిలిచినవి
కీర్తి సురేష్ నటన
ఛాయాగ్రహణం
లొకేషన్స్
సెకండ్ హాఫ్ ట్విస్టులు
మైనస్ గా అనిపించేవి
ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం
పాటలు
ఇతర పాత్రలు వీక్ గా చూపడం
క్లైమాక్స్
కంక్లూజన్
ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ప్రపంచానికి పరిచయం చేసిన సైకో కిల్లింగ్ కాన్సెప్ట్ నుంచి ఇప్పటికే కొన్ని వేల సినిమాలు వచ్చాయి కాబట్టి మరీ కొత్తగా ఆలోచించడం అత్యాశే అవుతుంది. కాని డెబ్యు డైరెక్టర్ ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు వాటికన్నా మిన్నగానో, ప్రేక్షకులు నిజమైన థ్రిల్ ని ఎంజాయ్ చేసేలానో ఉంటే తప్ప ఇవి సక్సెస్ కావు. ఆ రకంగా చూసుకుంటే పెంగ్విన్ పూర్తి స్థాయిలో అంచనాలు అందుకోలేదనే చెప్పాలి. కొంత ఓపిక పట్టి ఫస్ట్ హాఫ్ ని భరిస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఒక రకమైన టోన్ లో సాగి ఈ జానర్ లవర్స్ ని ఓ మాదిరిగా మెప్పిస్తుంది కాని రెగ్యులర్ ఆడియన్స్ ని మాత్రం పూర్తిగా సంతృప్తి పరచడంలో పెంగ్విన్ అంతగా సక్సెస్ కాలేకపోయింది. సైకో కిల్లర్ మూవీస్ లో ఇదేదో డిఫరెంట్ అని చెప్పలేం కాని మస్ట్ వాచ్ కాకుండా జస్ట్ వాచ్ క్యాటగిరీలో పెంగ్విన్ ని వేయొచ్చు
చివరి మాట
పెంగ్విన్ – కొంచెం థ్రిల్ కొంచెం డల్