iDreamPost
android-app
ios-app

పెంచల నారసింహుని సన్నిధిలో…Travelogue

పెంచల నారసింహుని సన్నిధిలో…Travelogue

మా పల్లెల్లో పెంచలకోన అంటే అదొక క్రేజ్. ఎందుకు ఆ క్రేజ్ అంటే ఏ ఆటోకు చూసినా పెంచల నరసిహస్వామి సర్వీస్ అనో లేక దీవెనలతో అనో రాసుకుంటుంటారు. అదే కాక ఏప్రిల్, మే నెలల్లో పెంచల తిరునాల చూడ్డం కోసమే వెళ్లి వచ్చినవారు “అబ్బబ్బ ఏం జరిగిందిలే కాళ్లు పెట్టడానిగ్గూడా సందులేదు” అని చెప్పే మాటలు అదనం. గూగుల్ లో ఫోటోలు వెతికితే పచ్చని ప్రకృతి మధ్య ఉండడంతో వెళ్లాలి వెళ్లాలని అనుకుంటుండేవాడిని.

నిన్న మోక్షం వచ్చింది. రెండు బైకుల్లో నలుగురం బయల్దేరాం. మేఘావృతమైన ఆకాశం, దారికిరువైపులా చెనిక్కాయ, వరి పైర్లతో గాలికి అదో గమ్మత్తైన గంధాన్ని అద్దే సువాసనల మధ్య జోరుగా సాగిపోయింది. కుడివైపు మల్లెంకొండ ఎడమ వైపు దుర్గమ్మ కొండ మధ్యలో రోడ్డు.

ఇంతకు ముందు సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేదంట. కానీ ఇప్పుడు రాపూరు – వెంకటగిరికి హైవే రోడ్డు వేస్తుండడంతో గతుకుల్లేని రోడ్డు మీద రయ్య్ రయ్యిన సాగిపొయ్యాయి మా బండ్లు వెళ్తుంటే పడమటి కొండల్లో ఏదో చిన్న వాటర్ ప్రాజెక్టులా అనిపించి ఏందబ్బా అనుకుంటూ వెళ్తే పెన్నా నది దగ్గరికిరాగానే అర్థమైంది అదే సోమశిల ప్రాజెక్టని.

పెన్నా నది బ్రిడ్జి ఇంకా పూర్తికాలేదు. నిర్మాణంలో ఉంది. నది చాలా వెడల్పుంది అక్కడ. నదికిరువైపులా వర్సగా పేర్చినట్టుండే తాటి చెట్లు, గాలికి ఊయలలూగే వరి నాట్లు అబ్బబ్బ పుడ్తే గిడ్తే నదీ పరీవాహక ప్రాంత పల్లెల్లో పుట్టాలనిపించింది.

అక్కడి పల్లెల్లో పాడి కోసం ఎక్కువగా ఆవుల మింద ఆధారపడ్తారేమో దారి పొడుగునా ఆవుల మందలే కనిపించాయి. అక్కడక్కడా తెల్ల గొర్రెలు కూడా.

Also Read:జీవితాన్ని వెతుకుతూ … సోమశిల జలాల్లో ఒక రోజు

బండి నేనే డ్రైవ్ చేస్తే అన్నీ సరిగా గమనించలేనని వెనకాల కూర్చున్నా. అలా చూస్తున్న నా కంటికి ఎత్తైన కొండమీద తెల్లగా పెద్ద నైలాన్ పైపులాంటి ఆకారం చిక్కింది. ఎంత దూరంపోయినా కనపడ్తూనే ఉంది. పోనీ వాటర్ ఫాలేమో అనుకోడానికి పోలిక చిక్కడంలేదు గానీ తర్వాత తెలిసింది అదే ఈ మొత్తం యాత్రలో అద్భుతమైన అనుభూతినిచ్చిన లోకోన(గునాల) జలపాతం అని.

రాపూరు రోడ్డు నుంచి పడమరగా సింగిల్ రోడ్డు మీద డైవర్షన్ తీసుకుని మూడు కిలోమీటర్లు వెళ్లగానే పెంచలకోన చేరుకున్నాం. చుట్టూ పచ్చని ప్రకృతే ఉన్నప్పటికీ రెండు మూడు కొండల లోయల్లో ఉంటుందేమో అనుకున్న నాకు అది కొండల వెలుపలే ఉండడం కొంత నిరాశ కలిగించింది కానీ తర్వాత ఆ నిరాశ ఏ కొంచెమూ లేకుండా ఆ జలపాతం మొత్తం తీర్చేసింది.

దర్శనం అయిన తర్వాత నిత్య అన్నదాన సత్రం వాళ్లు ఇంకో పది నిముషాలు ఆగండి భోజనం పెడతాం అంటే మళ్లీ వచ్చి తిందాములే అని గుడికి వెనకాల కొండల్లో మూడు కిలోమీటర్ల అవతల ఉన్న లోకోనకు బయల్దేరాము.

దారి పొడుగునా తెల్లటి రాళ్లు, వాటిని ఒరుసుకుంటూ పారే కల్మషం లేని నీళ్లు. పైన నీళ్లు పారుతుంటూ కింద కాళ్లతో కదిలించినా ఏ మరకా లేకుండా అతి స్పష్టంగా కనపడే రాళ్లు మరో విశిష్టతను జోడించాయి. ఒకచోట ప్రత్యక్షమవుతున్నయి మరోచోట రాళ్లల్లోనే అంతర్వాహినిగా ప్రవహిస్తున్నాయి. చెట్ల వేర్లల్లో, పెద పెద్ద బండరాతి సందుల్లో రమనీయంగా ఉన్నాయి చూడ్డానికి. ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగాము.

కొత్తగా పెళ్లైన జంట కాబోలు ప్రకృతి అందాలను ఏకాంతంగా ఆస్వాదించడానికి వచ్చారు. కొద్దిసేపు నడిచిన తర్వాత మా వల్ల వారి ఏకాంతానికి భంగం కలిగిందేమో వెనక్కి వెళ్లిపోయారు. మా వల్లనే వెళ్లిపోయారేమో కొంచెం గిల్టీ ఫీలింగ్ కొద్దిసేపు మదిని తొలిచింది.

దగ్గరికి వెళ్లేకొద్దీ జలపాతం దూకుతున్న సవ్వడులు చెవులను తాకుతూ తొందరగా రండి రండని మరింతగా ఊరిస్తున్నాయి. వంద నూట యాభై మీటర్ల ఎత్తైన కొండ నుంచి దూకుతుండొచ్చు.

Also Read:బండేరు కోన…కొన్ని అందాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాతం అతి ఎత్తెైనది. మరిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ రికార్డు ఏ జలపాతానిదో అనే సందేహం రాకపోలేదు. తర్వాత వెతకాలి.

దగ్గరికెళ్లి ఆ ప్రకృతి రమనీయ దృశ్యాలు చూడగానే అప్పటివరకూ వేధిస్తున్న ఆకలి, దప్పికలు ఏ గాలికెగిరిపోయాయో ఏమో తెలీనంతగా అలరించాయి. మరీ పెద్ద జలపాతం కాదు గానీ దాని ప్రత్యేకత అంత అనుభూతినిచ్చింది.

సాధారణంగా అన్ని జలపాత పాదాల వద్ద నీళ్లు దూకి దూకి పెద్ద గుండం ఏర్పడుతుంది. కాబట్టి దగ్గరికి వెళ్తే ప్రమాదాలు జరగచ్చని ఎవ్వరినీ దగ్గరికి వెళ్లనియ్యరు. కానీ ఇక్కడ మాత్రం నడుముల్లోతుకు మించి లేకపోవడంతో నిస్సంకోచంగా లోపలికి దిగొచ్చు.

అంతెత్తునుంచి నీళ్లు దూకుతుంటే మనసు ఆగలేకపోయింది. జలుబు చేస్తుందేమో చేస్తుందేమో అని కొద్దిసేపు నిగ్రహంగా కూర్చున్న వాన్ని కాస్తా చేస్తే చెయ్యనీలే అని నీళ్లలో దూకేశాను. వెళ్లి ఆ జలపాతం కింద కూర్చుంటే పైన్నుంచి దూకే నీళ్లు మనకి అభిషేకం చేస్తున్నట్టుగా గిలిగింతలు పెట్టాయి. దాదాపు అర్థగంటపైనే అలా కూర్చుండిపోయా కదలకుండా. చెక్కిన మెట్లలాగా ఉండే ఆ రాళ్లపైన కొంచెం పైకెక్కి కూడా కూర్చున్నాము.

గంట గంటన్నర ఎగిరెగిరి అలిసిపొయ్యాక గుడి దగ్గరికొచ్చి పులిహోర ప్యాకెట్లతో కడుపునింపుకుని లడ్లు కొన్ని తీసుకుని ఇంటి మొహం పట్టాము.

తిరిగే ఓపికుంటే అడివిలో సీజను బట్టి దొరికే కాయలు బాగానే ఉన్నాయి. ఇది నేరేడు కాయల సీజన్ కావడంతో గోలపల్లి చెరువులో ఫారెస్టు డిపార్ట్మెంట్ వాళ్లు నాటిన చెట్లకు విరగకాసాయి. మంచి రుచుండే చెట్లు చూసుకుని ఎగుటయ్యేంత వరకూ తిని రెండు కవర్లకు ఇంటికి తెచ్చుకున్నాము.

వచ్చే దారిలో సోమశిల ప్రాజెక్టు చూసుకుని ఇంటి దారిపట్టి పొద్దుగుంకే టయానికి బద్వేలు చేరుకున్నాము.

పెంచలకోన:

రాపూరు మండలం, నెల్లూరు జిల్లా

గుడి వివరాలు:

స్వయంభువుగా వెలసిన పెంచల(పెనుశిల) నరసింహ స్వామి. నరసింహ స్వామి చెంచు లక్ష్మిని ప్రేమించడంతో అలిగిన లక్ష్మీదేవి గుడి గర్భగుడికి దూరంగా వంకకు ఆవరి గట్టున ఉంటుంది.

చూడదగ్గ ప్రదేశాలు:

నరసింహ స్వామి గుడి,
లోకోన(గునాల) జలపాతం(గుడికి వెనకాల నైరుతి దిక్కున వంక మీదుగా మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి. వర్షాకాలం అయితే మర్చిపోకుండా వెళ్లండి)
బద్వేల్ దారిలో వచ్చే సోమశిల ప్రాజెక్టు

దారి మార్గాలు:

హైదరాబాద్, బెంగుళూర్ వాళ్లు బద్వేల్ కి వస్తే అక్కన్నుంచి 90 కిలోమీటర్లు(బద్వేల్ నుండి నెల్లూర్ రూట్లో 25 కిరోమీటర్లు వెళ్లిన తర్వాత కుడివైపుకు అంటే దక్షిణంగా దారి ఉంది)

తిరుపతి, చెన్నై, రాజంపేట, కడప వాళ్లు వెంకటగిరి, రాపూరు మీదుగా పెంచలకోన చేరుకోవచ్చు. రాజంపేట నుండి అయితే 85 కిలోమీటర్లు, వెంకటగిరి నుండి 60 కిలోమీటర్లు.

నెల్లూరు నుంచి అయితే పొదలకూరు మీదుగా 80 కిలోమీటర్లు.

ఉదయగిరి నుంచి అయితే 105 కిలోమీటర్లు.

Also Read:చెయ్యేరు,అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రయాణం

దూర ప్రాంత ప్రయాణికులు అయితే ఉండడానికి ఎసి నాన్-ఎసి రూముల సబపాయం కూడా కలదు.

అలా సాగుతుంది మరి పెంచలకోన ప్రయాణం. మంచి అనుభూతి రావాలంటే వర్షాకాలంలో వెళ్లండి. చలికాలం కూడా బాగుంటుంది. ఎండాకాలం పొయి బాగ చెప్పినాడ్రా వీడు అని నన్ను తిట్టుకోకండి ఎందుకంటే ఆ జలపాతంలో నీళ్లుండవు దానికి తోడు పైనా కిందా దరువేసే ఎండలు వాంచుతాయి. సరేనా…