iDreamPost
android-app
ios-app

ప్రజల కోసమే పెగాసస్‌ తెచ్చారట

ప్రజల కోసమే పెగాసస్‌ తెచ్చారట

వారం రోజుల నుంచి దేశ రాజకీయాలు పెగాసస్‌ స్పైవేర్‌ చుట్టూ జరుగుతున్నాయి. దేశంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, వ్యాపారులు, జడ్జిలు సహా వివిధ రంగాల వ్యక్తులపై పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా నిఘా పెట్టారని, వారి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారంటూ ది వైర్, వాషింగ్టన్‌ పోస్టు పత్రికలు కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై సోమవారం నుంచి జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడంలోనూ ఈ స్పైవేర్‌ను వాడారనే కథనాలతో దుమారం మరింత పెరిగింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా కథనాల్లో వాస్తవం లేదంటూ ముక్తసరి సమాధానాలు చెబుతోంది.

దేశంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న తరుణంలో.. పెగాసస్‌ స్పైవేర్‌ను తయారు చేసిన ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ స్పందించింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను నేరుగా ప్రస్తావించని సదరు సంస్థ.. అసలు ఈ స్పైవేర్‌ తయారికి గల కారణాలను, దాని ప్రయోజనాలను చెప్పుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవడం, వీధుల్లో సురక్షితంగా నడవగలుగుతున్నారంటే పెగాసస్‌ వంటి సాంకేతికలే కారణమని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. ఇలాంటి సాంకేతికతలు.. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ముసుగులో దాగిఉన్న అసాంఘిక శక్తులను, ఉగ్రవాదాన్ని నిరోధించి, నేర దర్యాప్తులో నిఘా సంస్థలకు, ప్రభుత్వాలకు సహాయపడతాయని తెలిపింది. మెసేజింగ్, సామాజిక మాధ్యమాల్లో హానికర చర్యల పర్యవేక్షణకు చాలా దేశాల్లో చట్టాలు అనుమతించవని, ఇలాంటి సమయాల్లో వాటి కళ్లుగప్పి నేరాలకు పాల్పడేవారిని గుర్తించడానికి తమతోపాటు సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు నిఘా సాధనాలను ప్రభుత్వాలకు అందిస్తుంటాయని ఎన్‌ఎస్‌వో వివరించింది.

ఎన్‌ఎస్‌ఓ వివరణ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలా కనిపిస్తోంది. నేరుగా భారత్‌ పేరును ప్రస్తావించకపోయినా.. ప్రభుత్వాలకు తాము పెగాసస్‌ స్పైవేర్‌ను అందిస్తుంటామని చెప్పడంతో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. అయితే తమ స్పైవేర్‌ను ఎందుకు ఉపయోగిస్తారో, దాని వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను కలుగుతాయో సదరు సంస్థ వివరించడంతో ప్రతిపక్షాలకు పరోక్షంగా ఆయుధాలను అందించినట్లైంది. ఎన్‌ఎస్‌ఓ సంస్థ పెగాసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాద నిర్మూలన, అసాంఘిక శక్తుల నియంత్రణ కోసం తయారు చేస్తే.. దానిని కేంద్ర ప్రభుత్వం రాజకీయాల కోసం ఉపయోగించుకుందనే ఆరోపణలు రేపు ప్రతిపక్ష పార్టీల నేతలు చేసే అవకాశం లేకపోలేదు. ప్రజల భద్రత కోసం ఉపయోగించాల్సిన పెగాసస్‌ స్పైవేర్‌ను.. ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకమనుకున్న వారిపై ప్రయోగించిందనే విమర్శలను ప్రతిపక్షాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎదుర్కొనబోతోంది.

Also Read : సుప్రీం కోర్టులో పెగాసస్‌ నిఘా బంతి