iDreamPost
iDreamPost
ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాలంలో మంత్రి పదవి కూడా వరించడంతో ఒక వెలుగు వెలిగారు. కానీ దాన్ని నిలబెట్టుకోలేక ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా దిగజారిపోయారు. పార్టీని ఆమె.. ఆమెను పార్టీ పట్టించుకోలేదు. కానీ రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చి హడావుడి చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు.. మాజీమంత్రి పీతల సుజాత. ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పదవి ఖాళీ కావడంతో ఆమెలో ఆశలు చిగురించాయి. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే జెడ్పీ మాజీ చైర్మన్ జయరాజు నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.
రెండేళ్లకుపైగా తెరమరుగు
పూర్వాశ్రమంలో టీచర్ అయిన పీతల సుజాత 2004 ఎన్నికల్లోనే ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆమెను అభ్యర్థిగా నిలిపింది. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిన ఆమె 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాన్నే కోల్పోయారు. ఆచంట జనరల్ సీటుగా మారడంతో సుజాతకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే కొత్తగా ఎస్సీలకు కేటాయించిన చింతలపూడి నుంచి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ ఆమెకు 2014లో కల్పించింది. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆమెకు రాష్ట్రంలో పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి యోగం పట్టింది. అయితే మంత్రి హోదాలో పెత్తనం చేస్తూ అనేక వివాదాల్లో తలదూర్చడంతో 2017లో మంత్రివర్గ విస్తరణలోనే చంద్రబాబు ఆమెను తప్పించి పక్కన పెట్టేశారు. అప్పటినుంచి సుజాత నియోజకవర్గాన్ని, పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో 2019లో ఆమెకు కాకుండా కర్రా రాజారావును టీడీపీ అభ్యర్థిగా అవకాశం లభించింది. వైఎస్సార్సీపీ వేవ్ లో ఆయన ఓడిపోయారు. నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగుతున్న ఆయన కొద్ది నెలల క్రితమే మరణించారు.
ఇంత కాలానికి మళ్లీ తెరపైకి
కర్రా రాజారావు మరణంతో నియోజకవర్గ ఇంఛార్జి పదవి ఖాళీ కావడంతో పీతల సుజాత మళ్లీ తెరపైకి వచ్చారు. గత ఎన్నికల్లో టికెట్ లభించనప్పటి నుంచీ ఆమె నియోజకవర్గంలో పూర్తిగా కనిపించకుండా పోయారు. ఆమె ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియలేదు. కానీ ఇంఛార్జి పదవి ఖాళీ కాగానే మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతూ హడావుడి చేస్తున్నారు. ఎవరైనా ఫంక్షన్లకు పిలవడమే ఆలస్యం అక్కడ వాలిపోతున్నారు. ప్రెస్మీట్లతో ఊదరగొడుతున్నారు. పార్టీ సీనియర్ నేతల ద్వారా ఇంఛార్జి పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. కానీ ఆమెకు జెడ్పీ మాజీచైర్మన్ కొక్కిలిగడ్డ జయరాజు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లోనే పార్టీ టికెట్ ఆశించిన జయరాజు ఈసారి ఇంఛార్జి పదవి తనదేనని తన అనుచరుల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా జయరాజు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Also Read : Tdp Ex Mla,Ex Mlc – ఆ ఇద్దరూ అలా.. పార్వతీపురంలో టీడీపీ డీలా..