iDreamPost
android-app
ios-app

తొలగించిన కొద్ది గంటల్లో తిరిగి ప్లే స్టోర్‌లో అడుగుపెట్టిన పేటిఎం

తొలగించిన కొద్ది గంటల్లో తిరిగి ప్లే స్టోర్‌లో అడుగుపెట్టిన పేటిఎం

నిబంధనలు అతిక్రమించిందన్న కారణంతో ప్లే స్టోర్ నుండి పేటిఎం యాప్‌ను శుక్రవారం గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. కాగా తొలగించిన కొద్దిగంటలకే తిరిగి పేటిఎంను తిరిగి ప్లే స్టోర్‌లోకి పునరుద్ధరించారు.

అసలేం జరిగింది

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సెక్యూరిటీ నిబంధనలు అతిక్రమించినందుకు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ శుక్రవారం తొలగించింది.దీంతో ఇకపై పేటిఎం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటిఎంను డౌన్లోడ్ చేసుకోలేరు. అదేవిధంగా పేటిఎం అప్లికేషన్ ను అప్‌డేట్‌ కూడా చేసుకోలేరు.

పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించింది. క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు గూగుల్ నిబంధనలకు విరుద్ధమని ఈ విషయంలో గతంలోనే పేటిఎంకు నోటీసులు జారీ చేశామని గూగుల్ తెలిపింది.పేటిఎం ఫస్ట్ గేమ్స్ పేరుతో ఆన్లైన్ బెట్టింగులు మరియు జూదం నిర్వహిస్తూ తరచూ పేటిఎం గూగుల్ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్టు గూగుల్‌ స్పష్టం చేసింది. పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం ప్లే స్టోర్ లో యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

దీనిపై పేటిఎం స్పందిస్తూ త్వరలో తమ సేవలు గూగుల్ ప్లే స్టోర్ లో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వినియోగదారుల మొబైల్స్ లో ఉన్న పేటిఎం అప్లికేషన్ ను యథావిధిగా వాడుకోవచ్చని దానిని కొత్తగా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అప్‌డేట్‌ చేయడానికి వీలుపడదని వెల్లడించింది. ప్లే స్టోర్ లో మాత్రమే పేటిఎం అందుబాటులో ఉండదని ఐవోఎస్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంటుందని పేటిఎం తెలిపింది.

కొద్దిగంటలకే ప్లే స్టోర్‌లో అడుగుపెట్టిన పేటిఎం

పేటిఎం యాప్‌ను తొలగించిన కొద్ది గంటల్లోనే పేటీఎమ్‌ తన యాప్‌లో సవరణలు చేసింది. ముఖ్యంగా పేటీఎమ్‌ క్రికెట్‌ లీగ్‌ గేమ్‌లో ‘క్యాష్‌బ్యాక్‌’ ఫీచరును తొలగించిన అనంతరం గూగుల్ తిరిగి ప్లే స్టోర్‌లోకి అనుమతించింది. దీనిపై పేటీఎమ్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందిస్తూ కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా నూతన వినియోగదారులను పేటిఎం పెంచుకోకుండా ఉండేలా గూగుల్ వ్యవహరిస్తోందని వెల్లడించారు. కాగా పేటిఎంను ప్లే స్టోర్ నుండి తొలగించడంతో ఆందోళనకు గురయిన వినియోగదారులు తిరిగి ప్లే స్టోర్ లో అడుగుపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు..