iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ ని ఊపేస్తున్న రీరిలీజుల ప్రహసనం

  • Published Jan 06, 2023 | 6:07 PM Updated Updated Jan 06, 2023 | 6:07 PM
టాలీవుడ్ ని ఊపేస్తున్న రీరిలీజుల ప్రహసనం

కొత్త సినిమాలని మించి రీ రిలీజుల ప్రహసనం టాలీవుడ్ లో ఉధృతంగా సాగుతోంది. దానికి తగ్గట్టే అభిమానులు అత్యుత్సాహంతో వీటికి పోటెత్తడంతో కొందరు డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వాళ్ళ పంట పండిస్తోంది. పోకిరితో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ అప్పట్లో 1 కోటి 75 లక్షల దాకా వసూళ్లు తేవడంతో మిగిలిన వాళ్లకు ఎక్కడ లేని జోష్ వచ్చేసింది. ఏదో డొనేషన్ల కోసమని విడుదల చేసిన జల్సా మూడు కోట్ల పై చిలుకు రాబట్టడం చూసి ప్రభాస్ రెబెల్, బిల్లా, వర్షంలు వరసగా థియేటర్లలో వదిలారు. వీటిలో ఒకటే ఓ మోస్తరుగా అడగా మిగిలినవి నష్టాలు తెచ్చాయి. ప్రేమదేశం, మాయాబజార్ లను అడిగే నాధుడు లేకుండా పోయాడు. ఫలితంగా నష్టాలు తప్పలేదు.

తాజాగా ఖుషి నాలుగు కోట్లకు పైగా రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఆఘమేఘాల మీద ఒక్కడుని జనవరి 7న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేవని ఆన్ లైన్ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. ఇవి చాలవు అన్నట్టు జనవరి 26న బద్రికి ప్లాన్ చేశారు. ఆ మేరకు పోస్టర్లు కూడా వచ్చాయి. ఫిబ్రవరి 14న తొలిప్రేమ ఆల్రెడీ లైన్ లో ఉంది. వీటితో కలిపి పవన్ కెరీర్ మొత్తంలో హిట్లన్నీ పునఃవిడుదల జరుపుకున్నట్టే. నెక్స్ట్ పంజాని రెడీ చేస్తున్నారు. ఇది ఎంత డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం పవర్ స్టార్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం తప్ప బయ్యర్లకు ఎగ్జిబిటర్లకు సంబంధించి మరో కోణం కనిపించడం లేదు

వీటి వల్ల కొత్త రిలీజులు ఎఫెక్ట్ అవుతున్న ప్రమాదాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే మంచిది. ఇవి చూడాలనే ఆతృతలో మూవీ లవర్స్ మిగిలిన వాటిని మర్చిపోతున్నారు. ఫలితంగా చిన్న చిత్రాలను కనీసం పట్టించుకునే వారు లేక నష్టాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడీ రీ రిలీజులకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోయినా ఇలా నెలకు రెండు మూడు వచ్చేలా కాకుండా పరిమితం చేయడం అవసరం. మంచి అనుభూతి నివ్వాల్సిన పాత క్లాసిక్స్ అభిమానుల అల్లరికి వేదికగా మారుతున్నాయి. కొన్ని చోట్ల ప్రెస్టీజ్ కి వెళ్లి మరీ సంబరాలు చేయడం లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్లు బాణాసంచా కాల్చడం ఫ్యాన్స్ జేబులకు చిల్లులు పెడుతోంది. దీనికి బ్రేక్ పడేది ఎన్నడో