iDreamPost
iDreamPost
ప్రస్తుతం బీజేపీ–జనసేన మధ్య కొనసాగుతున్న పొత్తుకు వచ్చే ఎన్నికల నాటికి పవన్ కటీఫ్ చెప్పేస్తారా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. జనసేన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌కళ్యాణ్ మంగళవారం మాట్లాడిన వీడియోను ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. అందులో పొత్తులకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాన్ని కలిగిస్తున్నాయి.
‘మీరందరూ పొత్తుల నిర్ణయం నాపై పెట్టినప్పటికీ, పొత్తుల గురించి మనందరం కలిసి ఒకటే మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే అది నేను ఒక్కడినే కూర్చుని నిర్ణయం తీసుకునేది కాదు. మనం ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాం. రకరకాల పార్టీల వారు మన పొత్తు కోరుకోవచ్చు. అది వారి మైండ్‌గేమ్ కావొచ్చు, లేదంటే వేరొకటి కావొచ్చు. దయచేసి మనందరం కలిసి ఒకటే మాట మాట్లాడదాం. ముందు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిగా పుంజుకుని, ఆ తర్వాత పార్టీలోని అందరి నేతలతో చర్చించాకే పొత్తుపై ఒక నిర్ణయం తీసుకుందామ’ని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ‘ఈలోపు ఎవరూ మాట్లాడవద్దు. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. త్వరలో పార్టీ నిర్వహించే ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే దానిపై ఆలోచించి ముందుకువెళదామ’ని అని పవన్‌కళ్యాణ్ అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. వ్యూహాత్మకంగా..
బీజేపీతో పొత్తు కోసం ఎన్నో వ్యూహాలతో పలు ప్రయత్నాలు చేసిన చంద్రబాబు.. ఫలితం లేకపోవడంతో కనీసం జనసేనతోనైనా పొత్తు కుదుర్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు జనసేనపై తన వన్ సైడ్ లవ్‌ను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ తన పార్టీ నేతలను ఉద్దేశించి ఒక వీడియోను మీడియాకు రిలీజ్ చేయడం వ్యూహాత్మకమేనని పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచీ చంద్రబాబుకు మిత్రుడు. ఈ విషయం ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ఇప్పటికీ వారి స్నేహం చెక్కు చెదరలేదన్నది కాదనలేని నిజం. కాకపోతే కొన్ని రాజకీయ పరిమితులతో రహస్య మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి తర్వాత కమ్యూనిస్టులతో పొత్తుకు గుడ్‌బై చెప్పేసి ఆగమేఘాలపై బీజేపీతో పవన్ పొత్తు పెట్టేసుకున్నారు.
Also Read : టీడీపీ – జనసేన పొత్తు పై సోము హాట్ కామెంట్స్
ఏ ఎన్నికలూ లేకపోయిన సమయంలో ఆయన పొత్తు పెట్టుకోవడంపై అప్పట్లోనే పరిశీలకులు ఆశ్చర్యపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేసిన చంద్రబాబు… తన మిత్రుడు పవన్‌పై ఒత్తిడి తెచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకొనేలా చేశారని పరిశీలకులు అప్పట్లో వ్యాఖ్యానించారు కూడా. బీజేపీతో పొత్తు కోసం అటు తాను పంపిన రాజ్యసభ సభ్యులతోనూ, ఇటూ పవన్‌కల్యాణ్ ద్వారా ఈ రెండేళ్లూ బాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు రాజకీయ అవకాశ వాదాన్ని పూర్తిగా గ్రహించిన బీజేపీ అధినాయకత్వం ఆయనను నమ్మలేదు. అందుకే ఆయన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు కనీసం పవన్ కల్యాణ్‌తోనైనా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు తన ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడం. దానికి పవన్ కల్యాణ్ తనకు కొంత సమయం కావాలని చెప్పడం పరోక్షంగా చెప్పడం వ్యూహాత్మకమేని అర్థమవుతోంది.
పార్టీ నేతలను ట్యూన్ చేయడానికేనా?
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లోనూ తమను గట్టెక్కిస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. పవన్ కారణంగా కాపు సామాజిక వర్గం ఓట్లు తమ పార్టీకి గంపగుత్తగా పడతాయని, అందుకే పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ రహిత జనసేన అయితేనే బీజేపీ పవన్‌తో పొత్తుకు ఒప్పకుంటుంది కానీ లేదంటే ససేమిరా అంటుంది. అలా అని బీజేపీతో ఉన్న పళంగా తెగతెంపులు చేసుకొని బాబుతో పొత్తు అని ప్రకటిస్తే జనసేన నాయకులు, కేడర్ దాన్ని ఎలా తీసుకుంటారో అన్న సందేహంతో వారిని క్రమంగా ట్యూన్ చేసే ఉద్దేశంతోనే పవన్ ఈ వీడియోను రిలీజ్ చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు సాధ్యం కాదని అర్థమైనప్పటి నుంచి పవన్ కమలనాథులతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పవన్‌కల్యాణే తమ ఉమ్మడి సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు ప్రకటించినా ఆ పార్టీతో జనసేన మమేకం కాలేకపోతోంది. బద్వేల్ ఉప ఎన్నికల బరి నుంచి టీడీపీ హఠాత్తుగా తప్పుకోగా జనసేన కూడా పోటీ చేయదని పవన్ కల్యాణ్ ప్రకటించి బీజేపీ నేతలను అప్పట్లో ఆశ్చర్య పరిచారు.
పొత్తు ధర్మంలో భాగంగా కనీసం బీజేపీ తరఫున ప్రచారం కూడా చేయలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇక ఈ పార్టీతో తనకు పొత్తు అనవసరమనే నిర్ణయానికి పవన్ వచ్చారని అందుకే రానురానూ దూరం జరుగుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం అంటూ హడావుడి చేయడం కూడా ఇలా దూరం జరగడంలో భాగమేనని అంటున్నారు. బాబు డైరెక‌్షన్‌లో ఇలా ఒక్కో అడుగు బీజేపీకి దూరం జరుగుతూ, క్రమంగా పార్టీ కేడర్‌ను మానసికంగా సిద్ధం చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ టీడీపీ, జనసేన పొత్తును పవన్‌కల్యాణ్ ప్రకటిస్తారని అంటున్నారు. అందుకోసమే 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే దానిపై త్వరలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభలో అలోచిద్దామని పవన్ ప్రకటించారని పరిశీలకులు భావిస్తున్నారు. జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని అయితే బీజేపీకి ఎప్పుడు కటీఫ్ చెబుతారు?అందుకు ఏ కారణాలు చెబుతారు? అన్నదే తేలాల్సి ఉందని అంటున్నారు.
Also Read : టీడీపీ, జనసేన పొత్తుపై బాబు, పవన్ ది ఒకేమాట. మరోసారి స్పష్టమయిన స్నేహబంధం