iDreamPost
iDreamPost
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా అన్ని పార్టీలు కార్మికులతో కలిసి ఉద్యమాలు చేపట్టాయి. ఇప్పుడు ఆఖరిలో జనసేనాని రంగంలో దిగుతున్నారు. ఇప్పటికే కేంద్రం పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్లాంట్ అమ్మకానికి సిద్ధమవుతున్న తరుణంలో పవన్ తీరు ఆసక్తిగా మారుతోంది. బద్వేల్ లో బీజేపీకి మద్ధతు అంటూ, వైజాగ్ లో బీజేపీ విధానాల మీద ఉద్యమం ఎలా చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో ప్రత్యేక హోదా వంటి సందర్భాల్లో పవన్ వ్యాఖ్యలు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో ఏపీ అంతటా యువత ఉద్యమాలు చేపట్టారు. కానీ పవన్ మాత్రం తాను మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధిస్తానని చెప్పుకొచ్చారు. చివరకు ఏపీకి ఒరిగేందేమీ లేకపోగా జనసేన మాత్రం బీజేపీ గూటిలో చేరిపోయింది. అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ కి మద్ధతుగా, క్రౌడ్ ఫుల్లర్ గా పవన్ మారిపోయారు.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవల రెండుసార్లు ఢిల్లీ వెళ్లారు. హస్తినలో బీజేపీ నేతలను కలిసినట్టు ప్రకటించారు. కానీ ఆయన ఎన్నడూ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనే మాట మాత్రం అనలేదు. అంటే ఢిల్లీలో సై అని ఇప్పుడు వైజాగ్ లో నై అనడం విశేషగా కనిపిస్తోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తలపిస్తూ పవన్ కూడా రెండు నాలుకల ధోరణిని అలవర్చుకున్నట్టు భావించాల్సి ఉంటుంది.పవన్ కి చిత్తశుద్ధి ఉంటే నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించాలి. మోదీ ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేయాలి. మిత్రపక్షంగా దానికి బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ తరుపున అసెంబ్లీలో తీర్మానం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు. కానీ ఇన్నాళ్ళుగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా స్టీల్ ప్లాంట్ వైపు చూడడమే చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీలో ప్రైవేటీకరణ వద్దని కూడా చెప్పలేని పవన్ ఇప్పుడే ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే సందేహం వస్తుంది.
ఏమయినా ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఉద్భవించిన వైజాగ్ స్టీల్ పరిరక్షణకు పవన్ కూడా కదలడం కార్మికులను సంతృప్తి పరుస్తుంది. గతంలో తనను గాజువాకలో గెలిపించి ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడేవాడినని చెప్పిన పవన్ ఇప్పుడయినా మనసు మార్చుకుని ప్రజల పక్షాన నిలిస్తే మంచిదే. కానీ ఆయన గతంలో ఏదయినా ఓ సమస్యను ప్రస్తావించడం,ఆ తర్వాత అది మరచిపోవడం అలవాటు చేసుకున్నారు. ఈ నెల ఆరంభంలో కూడా రోడ్ల సమస్య అదే తంతు. ఊరికే ఒక్కరోజు హంగామా చేసి ఆ తర్వాత షూటింగులకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ నెలాఖరులో ఒక్కరోజు హడావిడి కోసం వస్తున్నారు. ఆ తర్వాత మొఖం చాటేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దానికి భిన్నంగా తన మిత్రపక్ష ప్రభుత్వం మీద పోరాడి, ప్లాంట్ పరిక్షణ ఉద్యమంలో చిత్తశుద్ధితో కలిసి సాగితేనే జనసేనను జనం విశ్వసించే అవకాశం ఉంటుంది. లేదంటే గతంలో చెప్పినట్టుగానే ఒట్టి మాటలు తప్ప గట్టి చేతలు చేతగాని నేతగా ముద్రపడిపోతుంది.