Idream media
Idream media
లాక్ డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. బుక్స్, స్టేషనరీ, ఫ్యాన్ల తయారీ ఎలక్ట్రికల్ షాప్స్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది. రెడ్ జోన్లు, హాట్స్పాట్ ప్రాంతాలలో ఎలాంటి మినహాయింపులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు అమలు అవుతాయని వెల్లడించింది.
గత నెల 24వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వ నాటికి కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ 15 తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు, నిర్మాణ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించింది. రెండు రోజుల క్రితం అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ కూడా వ్యవసాయ రంగంలోకి చేరుస్తూ లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. తాజాగా ఎలక్ట్రికల్ షాపులు, బుక్ షాపులకు మినహాయింపు ఇచ్చింది.
లాక్ డౌన్ నుంచి ఫ్యాన్ల తయారీ, ఎలక్ట్రికల్ దుకాణాలకు మినహాయింపులు ఇవ్వడం ఆ రంగానికి పెద్ద ఊరట లభించినట్లయింది. సాధారణంగా వేసవిలో ఫాన్స్ తయారీ, ఎలక్ట్రికల్ షాపులకు మంచి సీజన్. మార్చి, ఏప్రిల్, మే.. 3 నెలల కాలంలోనే వారికి మంచి వ్యాపారం ఉంటుంది. కొత్త ఫ్యాన్లు, కూలర్ల అమ్మకాలు.. అదేవిధంగా సర్వీసు కి ఇది మంచి సీజన్. మార్చిలోనే ఎలక్ట్రికల్ దుకాణాల యజమానులు వేసవి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త స్టాక్ను భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. అయితే అనుకోని రీతిగా మార్చి 24 వ తేదీన లాక్ విధించడంతో వారి వ్యాపారం అంత నిల్చిపోయింది.
ఇతర రంగాల తో పాటు ఆ రంగానికి కూడా భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా దుకాణదారులు తెచ్చుకున్న స్టాక్ ను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమయంలో లాక్ డౌన్ నుంచి ఎలక్ట్రికల్ దుకాణాలకు మినహాయింపు ఇవ్వడం వల్ల ఊరట లభించింది. ఈ నెలలో మిగిలిన వారం రోజులు వచ్చే నెల అంతా ఎండలు మండిపోతాయి కాబట్టి ఈ సమయంలో ఉన్న స్టాక్ను కొంతమేరకైనా అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. నష్టాల నుంచి కొంతమేరకు బయటపడే అవకాశం ఎలక్ట్రికల్ దుకాణాల వారికి లభించినట్లయింది.