iDreamPost
android-app
ios-app

కొత్త కమిషనర్‌ వచ్చాకే పరిషత్‌ ఎన్నికలు.. నిమ్మగడ్డకు మాయని మచ్చ..

కొత్త కమిషనర్‌ వచ్చాకే పరిషత్‌ ఎన్నికలు.. నిమ్మగడ్డకు మాయని మచ్చ..

వాయిదా పడిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఈ నెలలో జరగవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తేలిపోయింది. పరిషత్‌ ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం, ఎస్‌ఈసీ కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడంతో పరిషత్‌ ఎన్నికలు ఈ ఆర్థిక ఏడాదిలో జరగవని నిర్థారణ అయింది. ఈ నెల 30వ తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో.. కొత్త కమిషనర్‌ ఆధ్వర్యంలోనే పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడం అనివార్యమైంది.

తాజా పరిణామాల నేపథ్యంలో.. నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన వెంటనే నూతన కమిషనర్‌ను నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ పదవికి పరిశీలిస్తోంది. ప్రేమ్‌ చంద్రారెడ్డి, శ్యామ్యూల్, నీలం సాహ్ని పేర్లను కమిషనర్‌ పదవికి పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురులో నీలం సాహ్నికే సీఎం జగన్‌ ఆమోదం తెలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయ. గవర్నర్‌ ఆమోదం తర్వాత నిమ్మగడ్డ పదవీ నుంచి తప్పుకున్న వెంటనే నూతన కమిషనర్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

పరిషత్‌ ఎన్నికలను నిర్వహించకుండా మీనమేషాలు లెక్కిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీవ్ర విమర్శలపాలవుతున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలను కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో నిర్వహించేందుకు గత ఏడాది నవంబర్‌ నుంచి ఆపసోపాలు పడిన నిమ్మగడ్డ.. న్యాయస్థానాల్లోనూ పోరాటాలు చేశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధి అంటూ, నిధులు సకాలంలో వస్తాయంటూ నీతి వాక్యాలు వల్లెవేశారు. ప్రక్రియ మధ్యలో ఉన్న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించకుండా.. అసలు నోటిఫికేషన్‌ కూడా విడుదల కానీ పంచాయతీ ఎన్నికలను, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలపై ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అయినా.. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. దాని అధికారాన్ని వ్యక్తిగత లేదా ఓ పార్టీకి మేలు చేసేలా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వినియోగిస్తున్నారని పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై ఆయన వ్యవహరిస్తున్న తీరుతో అర్థమవుతోంది. పార్టీ రహిత గుర్తులతో జరిగే పంచాయతీ ఎన్నికలను ముందు పెట్టడం ద్వారా గ్రామాల్లో ప్రజల మధ్య గ్రూపులు ఏర్పడేందుకు అస్కారం కల్పించారు. తద్వారా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి మేలు జరుగుతుందని భావించారు. కానీ గ్రామీణ ప్రజలు కర్రు కాల్చి టీడీపీకి వాత పెట్టడంతో ఖంగుతిన్నారు.

పట్టణాలలో పరిస్థితి అనుకూలంగా ఉంటుందని భావించి.. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించారు. పల్లెల కన్నా పట్టణ ఓటర్లు టీడీపీని అథఃపాతాళానికి తమ ఓటుతో తొక్కారు. పంచాయతీ ఫలితాలను తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకున్న టీడీపీ పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అలా చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇదే క్రమంలో పార్టీ గుర్తులపై జరిగి పరిషత్‌ ఎన్నికల్లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే వస్తే.. గ్రామాల్లోనూ టీడీపీ బేలతనం బయటపడుతుందని, అదీ తన హాయంలో జరిగితే.. టీడీపీకి నష్టం ఎక్కువగా ఉంటుందనే కారణంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదన్నది కాదనలేని సత్యం.

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాజ్యంగబద్ధ పదవిలో ఉంటూ నిమ్మగడ్డ ప్రవర్తించిన తీరు ఆయన కెరీర్‌లో మాయనిమచ్చగా మిగులుతుందనడంలో సందేహం లేదు. వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లు.. ఆయన టీడీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Also Read : పరిషత్‌ ఎన్నికలు నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే జరుగుతాయా..?