iDreamPost
android-app
ios-app

AP మాజీ డిప్యూటీ స్పీకర్ గుండెపోటుతో మృతి..

AP మాజీ డిప్యూటీ స్పీకర్ గుండెపోటుతో మృతి..

ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్య, గుండెపోటు, రోడ్డు ప్రమాదం, ఇతర అనారోగ్య కారణాలతో పలువురు ప్రముఖులు లేదా ప్రముఖల పిల్లలు మరణిస్తున్నారు. సెలబ్రిటీల మరణంతో వారి కుటుంబ సభ్యులతో పాటు వారి  అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. మూడు రోజుల క్రితమే తమిళ హీరో విజయ్ ఆంటోని కుమార్తె లారా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అలానే గుండె పోటుతో జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి కన్నుమూశారు. తాజాగా పరిగి మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుండెపోటుతో మరణించారు.

మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెనొప్పితో బాధ పడ్డారు. దీంతో వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు.

ఈయన కుమారుడే కొప్పుల మహేశ్ రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు మహేష్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిగి నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా కొప్పుల హరీశ్వర్ రెడ్డి గెలిచారు. 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా హరీశ్వర్ రెడ్డి విజయం సాధించారు.

వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి మంత్రి స్థాయికి ఎదిగారు.  1999 -2003 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ గా సేవలు అందించారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో ఉన్న పరిచయంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి.. మాజీ మంత్రి మృతిపై మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.