iDreamPost
android-app
ios-app

AIADMK – చేతులు క‌లిపిన ప‌న్నీర్ , ప‌ళ‌ని.. చిన్న‌మ్మ‌కు చెక్ పెట్టేనా?

AIADMK – చేతులు క‌లిపిన ప‌న్నీర్ , ప‌ళ‌ని.. చిన్న‌మ్మ‌కు చెక్ పెట్టేనా?

ఎన్నిక‌ల‌కు ముందు త‌మిళ‌నాడులో డీఎంకే కూటమి మొత్తం ఊడ్చేస్తుంద‌ని స‌ర్వేలు చెప్పాయి. దాదాపు 200 స్థానాల వరకు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. అలా జరగలేదు. దీనికి కారణం పళనిస్వామి పనితనం. జయలలిత మరణం త‌ర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న పళని స్వామి.. అంతే ఓర్పు, నేర్పుతో ప్రభుత్వాన్ని నడిపించారు. అసమ్మతిలాంటివి లేకుండా చూసుకున్నారు. ప్రభుత్వంపై కూడా అంత‌గా వ్యతిరేకత రానీయకుండా చూసుకున్నారు. అటు డీఎంకే కూడా ప్రభుత్వంపై అంతే సాఫ్ట్‌గా వెళ్లింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా డీఎంకేలోకి చేరతారనుకున్నారు. కాని, స్టాలిన్ మాత్రం.. వాళ్లెవరినీ చేర్చుకోలేదు. ప్రజలు ఇచ్చే తీర్పుకే కట్టుబడి ఉందాం అంటూ అదే స్ఫూర్తితో నిలబడ్డారు.

నిజానికి తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిస్థాయి వ్యతిరేకత రాలేదు. జయలేని లోటు కనిపించకుండా చేయడంలోనూ పళని సక్సెస్ అయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం సైతం అధికార పార్టీని పెద్దగా టార్గెట్ చేయలేదు. కరోనా విజృంభిస్తున్నా.. దాన్ని రాజకీయ కోణంలో వాడుకోలేదు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో కనిపించడం నిజంగా కొత్త, వింతే. కాని, అన్నాడీఎంకే బీజేపీతో పొత్తుపెట్టుకోవడమే కొంప ముంచిందన్న వాదన వినిపిస్తోంది. బీజేపీతో కలిసి వెళ్లకపోయి ఉంటే.. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య టఫ్‌ ఫైట్ ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఎన్నిక‌ల అనంత‌రం అన్నాడీఎంకేలో ముస‌లం మొద‌లైంది. ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ వ‌ర్గాల మ‌ధ్య ఉప్పు – నిప్పుగా య‌వ్వారం మారింది. అంత‌ర్గ‌త విబేదాలు బ‌హిరంగ‌మ‌య్యాయి. ఇదే అదునుగా శ‌శిక‌ళ రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకు షాక్ ఇచ్చేలా అన్నాడీఎంకేలో కీల‌క మ‌లుపులు చోటుచేసుకున్నాయి.

అన్నాడీఎంకే చీఫ్‌ పదవి విషయంలో పన్నీర్‌, పళని మధ్య రాజీ కుదిరింది. శశికళను పార్టీలోకి రానివ్వొద్దనే డిమాండ్‌తో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు పళనిస్వామి. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్న శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు. ఇద్దరి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి. పార్టీ సమయ్వయ కర్తగా పన్నీర్‌సెల్వం , ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ఏక్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇద్దరికి ఈ పదవులు దక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న పళనిస్వామి.. పార్టీ సారథ్య పగ్గాలను పన్నీర్‌సెల్వంకు అప్పగించారు.

అన్నాడీఎంకేను తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు శశికళ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు తెరచాటు ప్రయత్నాలతో పాటు.. బహిరంగంగానూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని పన్నీర్ సెల్వం, పళని స్వామి నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం ఉండేందుకు పళనిస్వామి ఒప్పుకున్నారు. పార్టీ ఎన్నికలకు ముందే ఆ మేరకు వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. శశికళను పార్టీలోకి రానివ్వొద్దనే డిమాండ్‌తో పార్టీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పళనిస్వామి ఒప్పుకున్నారు. పార్టీ పగ్గాలు పన్నీర్‌సెల్వంకు ఇచ్చేందుకు పళనిస్వామి ఒప్పుకోగా…అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్‌గా పళనిస్వామి ఉండనున్నారు. ఆ మేరకు పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం.. పార్టీ ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read :  AIADMK – ఏడీఎంకే రాజ్యాంగం మార్పు.. ప్రధాన కార్యదర్శి పదవికి చెల్లు